survivors
-
లైంగికదాడి బాధితులకు వైద్యం నిరాకరణ నేరమే
న్యూఢిల్లీ: లైంగిక హింస, యాసిడ్ దాడి వంటి కేసుల బాధితులకు వైద్యం అందించే విషయమై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయా కేసుల బాధితులకు వైద్యం నిరాకరించడమే నేరమేనని స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితిలో గుర్తింపు పత్రాలు తేవాలంటూ ఆస్పత్రులు, వైద్య నిపుణులు పట్టుబట్టడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇటువంటి బాధితులకు ఉచితంగా వైద్య సాయం అందించాల్సిందేనని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంది. లేనట్లయితే బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. ఆస్పత్రులతోపాటు వైద్య చికిత్సలు అందించే అన్ని రకాల కేంద్రాలకు ఇదే సూత్రం వర్తిస్తుందని వివరించింది. ఆయా కేసుల బాధితులకు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే కాదు, అవసరమైన ఇతర నిర్థారణ పరీక్షలు, ఆస్పత్రిలో చేర్చుకోవడం, ఔట్ పేషెంట్‌గా వైద్యం అందించడం, సర్జరీ, భౌతిక, మానసిక కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ వంటి సేవలను కూడా అందించాలని తెలిపింది. తక్షణమే ఈ విషయాన్ని వైద్యులు, పరిపాలన సిబ్బంది, అధికారులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వంటి అందరికీ చేరేలా ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి, లైంగికదాడి మైనర్ బాధితులు, ఇతరులకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని కోరింది. -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..
ఆస్పత్రిని అప్పటికప్పుడూ సెట్ వేసినట్లుగా సెటప్ చేసే పోర్టబుల్ ఆస్పత్రి గురించి విన్నారా. పైగా ఈ ఆస్పత్రి సాయంతో దాదాపు 200 మంది రోగులకి ఒకేసారి వైద్యం అందించొచ్చట కూడా. ఇంతకీ ఏ దేశం ఈ ఆస్పత్రి మోడల్ని తీసుకొచ్చిందంటే..భారతదేశం ప్రపంచంలోనే తొలి విపత్తు ఆస్పత్రిని ప్రవేశపెట్టింది. దీనిని ఎయిర్‌లిఫ్ట్ చేసి సుమారు 72 క్యూబ్‌లు ప్యాక్ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను 'ఆరోగ్య మైఔత్రి క్యూబ్' అని పిలుస్తారు. భీష్మ(భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి ప్రాజెక్ట్)లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. ఈ క్యూబ్లలో ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయలు, వెంటిలేటర్లు, రక్త పరీక్షపరికరాలు, ఎక్స్‌రే యంత్రం, వంట స్టేషన్, ఆహారం, నీరు, షెల్టర్ పవర్ జనరేటర్ వంటి అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేక కేజ్‌లో దాదాపు వందమంది రెండు రోజుల పాటు జీవించేందుకు అవసరమైన సామాగ్రితో నింపిన 36 మినీ క్యూబ్‌లను చూడవచ్చు. వీటిలో రెండు మెయిన్ కేజ్‌లు ఉంటాయి.వాటిని మాస్టర్ క్యూబ్స్ అని పిలుస్తారు. వీటిల్లో దాదాపు 200 మంది ప్రాణాలను రక్షిచవచ్చు. ఈ మినీ ఫోర్టబుల్ ఆస్పత్రి 40 బుల్లెట్ గాయాలు, 25 పెద్ద రక్తస్రావం, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 హెడ్ ఇంజూరీస్, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నుముకకి అయ్యే పగళ్లు గాయాలు వంటి వివిధ రకాల తీవ్రమైన గాయాలను నిర్వహించగల సామర్థ్యం గలది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ బీష్మలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్‌ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్‌ని గత జనవరిలో జరిగిన గ్లోబల్ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు.ఆగస్టులో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మెడ్‌టెక్ ఎక్స్‌పోలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారిక ప్రారంభం జరిగింది. అంతేగాదు ఈ ప్రాజెక్టును మొదటగా మయన్మార్ అధికారులకు చూపించారు. ఇక ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు ఈ ఆలోచనను అందించారు. ఆయన సూచనల కారణంగా ఆయుర్వేద ఉత్పత్తులకు క్యూబ్స్‌లోని వస్తువులు జాబితాలో జోడించామని అధికారులు తెలిపారు. భారతదేశం మయన్మార్‌కు రెండు ఆరోగ్య మైత్రి క్యూబ్‌లను విరాళంగా అందించింది ఒక శ్రీలంకకు కూడా ఒకటి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.(చదవండి: మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!) -
సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!
మాట్లాడే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతుంటారు. ఆదుకోవాలని మనసు ఉండాలేగానీ, సరికొత్త దారులు అనేకం కనిపిస్తాయని చేసి చూపెడుతోంది పదిహేడేళ్ల సీమర్ సంగ్లా. యాసిడ్ దాడి బాధితులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన సీమర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒకసారి పూనమ్ అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. దీంతో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. అయితే ఆమె మామూలు సబ్బులతో స్నానం చేస్తే యాసిడ్ దాడి జరిగిన ప్రదేశంలో బాగా మంట పుట్టేది. ఈ విషయం తెలిసిన యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే సీమర్ తల్లి... పూనమ్‌ను ఆదుకునే క్రమంలో ... మంట రాని సబ్బు తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే సీమర్ అమ్మ, అమ్మమ్మలు కలిసి, సబ్బు తయారు చేశారు. యాసిడ్ దాడికి కాలిపోయిన పూనంకు ఈ సబ్బు స్వాంతన కలిగించింది. వాడుకోవడానికి చాలా అనువుగా అనిపించింది. ఇదంతా దగ్గర నుంచి చూసిన సీమర్ యాసిడ్ బాధితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టింది. పూనమ్లా ఎంతోమంది యాసిడ్ దాడికి గురైనట్లు తెలుసుకుని, వాళ్లందరికి తాను ఏదోరకంగా సాయపడాలనుకుంది. గతేడాది యాసిడి బాధితుల అవసరాలకు తగినట్లుగా ‘సేఫ్ కేవ్’ పేరిట సబ్బులు తయారు చేయడం ప్రారంభించింది. అలోవెర, తేనెలతో సబ్బులు తయారు చేసి యాసిడ్ బాధితులకు ఇచ్చేది. ఈ సబ్బులు బాధితులకు సాంత్వననిచ్చేవి. వారి ఆసక్తిని గమనించిన సీమర్... సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. శిక్షణ తీసుకున్న వారంతా సబ్బులు తయారు చేసి మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో వాళ్లకంటూ ఒక గుర్తింపుతోపాటు, సాధారణ అమ్మాయిల్లా జీవించగలుగుతున్నారు. సీమర్.. ఇప్పటిదాక ఇరవైమందికిపైగా సబ్బుల తయారీలో శిక్షణ ఇచ్చింది. యాసిడ్ బాధితుల గురించి తన స్నేహితులు, ఇతర పిల్లలకు చెబుతూ వారికి సాయం చేయాలని కోరుతోంది. ఇది చిన్నపనే అయినప్పటికీ వారి జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకొస్తుంది సీమర్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన బాధితులంతా సీమర్ శిక్షణతో ధైర్యాన్ని కూడగట్టుకొంటూ జీవితంపై కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నారు. -
వారు కాపాడటానికి వచ్చారనుకున్నాం.. కానీ..
ఏథెన్స్: మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తూ గ్రీసు వైపుగా వచ్చి మునిగిపోయిన బోటులో ప్రాణాలు దక్కించుకున్న కొందరు విస్తుపోయే నిజాలను చెబుతున్నారు. గ్రీసు తీర రక్షక దళాల బృందాలను చూడగానే వారు మమ్మల్ని కాపాడతారని అనుకున్నాము కానీ వారే మా పడవ మునిగిపోవడానికి కారణమని చెప్పారు. ఇటీవల ఆఫ్రికా నుండి ఐరోపా దేశాలకు వలస వస్తోన్న ఒక బోటు నీటమునిగిన సంగతి తెలిసిందే. 750కు పైగా వలసదారులు ప్రయాణిస్తున్న ఆ బోటు ప్రమాదంలో 80 మంది మృతి చెందగా 104 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మిగతా వారంతా గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్, సిరియా, ఈజిప్టు దేశాలకు చెందినవారే. అయితే వీరిలో ప్రాణాలు దక్కించుకున్న ఈజిప్టు వ్యక్తిని అసలేం జరిగిందని ప్రశ్నించగా.. గ్రీసు సమీపంలోకి రాగానే దూరంగా రక్షక దళాలు కనిపించడంతో మమ్మల్ని కాపాడమని అరిచాము. వారు తాడు వేసి మమ్మల్ని రక్షిస్తారని అనుకుంటే మమ్మల్ని కిందకి లాగేశారని అన్నాడు. సిరియాకు చెందిన మరో మృత్యుంజయుడు చెబుతూ.. వారు మా పడవకు ఒకపక్కన తాడు కట్టి బలంగా లాగడంతో బోటు మునిగిపోయిందని అన్నాడు. వీరిద్దరూ చెప్పినదాని బట్టి చూస్తే గ్రీసు తీర రక్షక బృందాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పొట్ట చేతపట్టుకుని జీవనబండిని లాగించాలని ఐరోపా వైపు పయనమైన శరణార్థుల్లో 104 మంది మినహాయిస్తే మిగిలిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది కూడా చదవండి: ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా? -
టైటాన్ ఆశలు జల సమాధి
దుబాయ్/బోస్టన్: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉదంతం.. విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ శకలాలను తిలకించడానికి టైటాన్ మినీజలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!. టైటాన్ శకలాలను టైటానిక్ సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ఉత్కంఠగా అన్వేషణ కొనసాగుతున్న తరుణంలో.. ప్రాణవాయువు(ఆక్సిజన్) ముగిసిపోయే అంచనా గడువు దగ్గరపడుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడంది. తాము నీటి అడుగుకు పంపించిన రిమోటెడ్ ఆపరేటెడ్ వెహికిల్.. శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్వేనని భావిస్తున్నట్లు తెలిపింది. ‘తమ సంస్థ చీఫ్ పైలట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ప్రయాణికులైన షహ్జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్ దావూద్, హామిష్ హార్డింగ్, పౌల్–హెన్రీ నర్గియెలెట్ మృతి చెందారు’అని ఓషన్ గేట్ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆదివారం ఉదయం బయలుదేరిన సమయంలో టైటాన్లో దాదాపు 96 గంటలపాటు మాత్రమే శ్వాసించేందుకు అవసరమైన ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కూడా ముగిసిపోయింది. గురువారం ఉదయానికల్లా జలాంతర్గామిలో ఆక్సిజన్ ఇక పూర్తిగా నిండుకున్నట్లే. అయితే, టైటాన్ గల్లంతైన రోజే వారు మరణించారా? అంటే..ఆ పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టైటాన్ ఆదివారం ఉదయం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. టైటాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో టైటాన్ కోసం తీవ్ర అన్వేషణ కొనసాగించింది. సెర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని నౌకలు, విమానాలను, ఇతర పరికరాలను రంగంలోకి దించారు. ఫ్రెంచ్ పరిశోధక సంస్థ కెమెరాలు, లైట్లతో కూడిన డీప్–డైవింగ్ రోబోట్‌ను సముద్రంలోకి పంపించింది. A debris field was discovered within the search area by an ROV near the Titanic. Experts within the unified command are evaluating the information. 1/2 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 Coast Guard holds press briefing about discovery of debris belonging to the 21-ft submersible, Titan. #Titanic https://t.co/aPSeEaBuG8 — USCGNortheast (@USCGNortheast) June 22, 2023 -
ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు
బనశంకరి: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత ఏడేళ్లుగా కోమాలో ఉండి, ప్రాణాలు విడిచింది. వైద్యానికి రూ.9.5 కోట్లు ఖర్చు అయినట్లు ఆమె భర్త తెలిపారు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కేరళకు చెందిన రాజేశ్‌నాయర్, పూనమ్‌రాణా(35) దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. పూనమ్ నగరంలోని అక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. ఆమె 2015 అక్టోబరు 2న కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స చేశారు. వ్యాధి నయం కాకపోగా కోమాలోకి వెళ్లింది. ఈ నెల 24న పరిస్థితి విషమించి మృతి చెందినటు రాజేశ్‌నాయర్ చెప్పారు. ఆసుపత్రిలో రూ.7.5 కోట్ల బిల్లు చెల్లించామని, ఇంకా రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. ముంబై ఆసుపత్రిలో 42 ఏళ్లుగా కోమాలో ఉన్న అరుణా శానుబాగ్ తర్వాత దీర్ఘకాలం కోమాలో ఉన్న పూనమ్ కేసు రెండోది అని వైద్యులు వెల్లడించారు. -
భారత్‌లో కరోనా మరణాలు 40 లక్షలు?
లండన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్‌లో రెండేళ్లలో ఏకంగా 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికారిక లెక్కల్లోకి రాని కోవిడ్ మృతుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని పేర్కొంది. 2020 జనవరి–2021 డిసెంబర్ మధ్య మరణించిన వారి సంఖ్య కేంద్రం వెల్లడించిన లెక్కల కంటే ఏకంగా 8 రెట్లు ఎక్కువని తెలిపింది. 2021 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 22.3 శాతం భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. రెండేళ్ల కాలంలో కరోనా మృతులపై 191 దేశాల గణాంకాలతో లాన్సెట్ నివేదిక రూపొందించింది. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 59.4 లక్షల మంది కరోనాకు బలైనట్టు అధికారిక గణాంకాలున్నాయి. కానీ వాస్తవానికి 1.82 కోట్ల మంది మరణించినట్టు అధ్యయనంలో తేలినట్టు లాన్సెట్ వెల్లడించింది. భారత్‌లో కరోనాతో రెండేళ్లలో 4.89 లక్షల మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించిందని, కానీ వాస్తవానికి 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు తేలిందని వివరించింది. భారత్ తర్వాత అమెరికా (11.3 లక్షల మరణాలు), రష్యా (10.7 లక్షలు), మెక్సికో (7.98 లక్షలు), బ్రెజిల్ (7.36 లక్షలు), ఇండోనేసియా (7.36 లక్షలు), పాకిస్తాన్ (6.64 లక్షలు) ఉన్నట్టుగా వివరించింది. తప్పుడు సమాచారం: కేంద్రం లాన్సెట్ లెక్కల్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆ సంస్థ విశ్లేషణలు, అంచనాలు ఊహాజనితాలని విమర్శించింది. కరోనా మరణాల లెక్కలు సేకరించే పద్ధతిలో తప్పులు దొర్లాయని ఆ నివేదిక రచయితలే అంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
తీరని విషాదం : ముగ్గురు మృత్యుంజయులు
కరాచీ : కరాచీ విమాన ప్రమాదంలో మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్న తరుణంలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారన్న భారీ ఊరట నిస్తోంది. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్, ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ యూనిట్ సీఈవో ఖాలిద్ షెర్డిల్ క్షేమంగా బయడపడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. అలాగే అమర్ రషీద్ అనే మరో యువకుడు కూడా ఈ ప్రమాదంనుంచి బయటపడడం మిరాకిల్. ఈ విషయాన్ని రషీద్ బంధువులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు) పాకిస్తాన్ జియో న్యూస్ ప్రకారం, ప్రాణాలతో బయటపడిన వారిలో జాఫర్ మసూద్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం స్థలంనుంచి ఇప్పటికి 34 మృతదేహాలను వెలికితీయగా, వీరిలో ఇద్దరు పైలట్ల మృతదేహాలను గుర్తించారు. ఇంకా 24 న్యూస్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు అన్సార్ నఖ్వీ ఈ ప్రమాదంలో అసువులు బాసారు. వీరితో పాటు స్థానికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.సెకండ్ లెఫ్టినెంట్ హమ్జా యూసుఫ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. పరేడ్ ముగిసిన తరువాత హంజా మొదటిసారి ఈద్ పర్వదినం సందర్భంగా ఇంటికి వెళుతున్నారు. (ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?) హమ్జా యూసఫ్ మృతులు (స్థానికి మీడియా సమాచారం ఆధారంగా) -
జీవితపు రుచి
ప్రాణాలు పోయేంతటి విపత్కర పరిస్థితిలో కూడా జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలిగే వెసులుబాటు ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే, మనకు ప్రాణాలు పోయేంత సందర్భాలు ఉంటాయా? ఒకాయన ఒక మూలిక కోసం దట్టమైన అరణ్యానికి వెళ్లాడు. వెతుకుతూ నడుస్తుండగా– ఉన్నట్టుండి, వెనక నుంచి పులి గాండ్రింపు వినబడింది. ప్రాణాలు కాపాడుకోవడానికి తోచినదిక్కు పరుగెత్తాడు. అలా ఒక కొండ మీదికి చేరుకున్నాడు. ఆ భయంలో అక్కడ పట్టుజారడంతో కొండ కొమ్ముకు వేలాడసాగాడు. తిరిగి పైకి ఎక్కడానికి వీలు లేదు. అక్కడ పులి ఉంటే! చూస్తే కొండలో మొలిచిన ఒక తీగేదో కనబడింది. దాన్ని పట్టుకుని కిందకు దిగాలన్న ఆలోచన వచ్చింది. నెమ్మదిగా తీగను అందుకున్నాడు. అలా గాల్లో వేలాడుతుండగా, హఠాత్తుగా కొండలో ఉన్న బొరియలోంచి వచ్చిన రెండు ఎలుకలు ఆ తీగను కొరకడం మొదలుపెట్టాయి. ఇప్పుడేం చేయాలి? అప్పుడు ఆయన ఆ తీగకు ఒక చిన్న పండు ఉందని గమనించాడు. అది ఎర్రగా గుండ్రంగా ఉండి, నోరూరిస్తోంది. దాన్ని తెంపి నోట్లో వేసుకున్నాడు. అంతటి గొప్ప రుచి అతడు అంతకుముందెన్నడూ చూడలేదు. ఇంతే కథ! ఆ బాటసారి ఆ తర్వాత ఏమయ్యాడు అన్నది మనకు చెప్పదు. కానీ ఈ చెప్పిన మేరలోనే ఎంత వెలుగు ప్రసరిస్తోంది! ప్రాణాలు పోయేంతటి విపత్కర పరిస్థితిలో కూడా జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలిగే వెసులుబాటు ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే, మనకు ప్రాణాలు పోయేంత సందర్భాలు ఉంటాయా? మరి ఎంతమేరకు జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలుగుతున్నాం! -
అమ్మను చంపేసింది !
► దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి.. ► కె.నరసాపురంలో విషాదఛాయలు మృత్యుకుంట ఔను అమ్మను మృత్యుకుంట మింగేసింది. బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడిపోయిన అమ్మ ప్రాణాలు వదిలేసింది. ఇద్దరు బిడ్డలను అనాథను చేసి వెళ్లిపోయింది. అమ్మకు ఏమైందో, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక ఆ పసి కూనలు అమాయక చూపులతో అందరినీ చూస్తూ ఉండిపోవడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. అయ్యో.. పాపం.. అంటూ సానుభూతి చూపారు. - పరిగి పరిగి మండలం కె.నరసాపురానికి చెందిన వాల్మీకి రామచంద్ర భార్య అనిత(24) గ్రామ శివార్లలోని నీటి కుంటలో పడి ప్రమాదవశాత్తు శుక్రవారం మరణించారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన కుంట ఒడ్డునున్న బట్టలు ఉతికే క్రమంలో కాలుజారి కుంటలో పడిపోయింది. ఆ తరువాత ఊపిరాడక ప్రాణాలు వదిలింది. అమ్మకు ఏమైంది.. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు సహా ఊరంతా నీటి కుంట వద్దకు చేరుకున్నారు. అందరి మధ్య నిర్జీవంగా ఉన్న తల్లిని చూస్తూ ఆమె ఇద్దరు బిడ్డలు ప్రసాద్(5), మారుతి(3) అందరి వైపు అమాయక చూపులు చూడటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తల్లికి ఏమైందో కూడా అర్థం కాక వారలా దిక్కులు చూస్తూ ఉండిపోయారు. అమ్మ ఎందుకు మాట్లాడటం లేదో, ఎందుకు తమను దగ్గరికి తీసుకోవడం లేదో అర్థం కాక ఆ చిన్నారులు ఏడుపు మొహంతో ఉండిపోవడం చూసిన వారి హృదయాలు బరువెక్కాయి. ఇక అమ్మ తిరిగి రాదనే విషయం ఆ పిల్లలకు ఎలా చెప్పాలో అర్థం కాక అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న సర్పంచ్ మైలారప్ప, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి తదితరులు అనిత మృతదే హాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
ఒబామాను నిలదీసి క్షమాపణలు డిమాండ్!
టోక్యో: అమెరికా అణుబాంబు దాడికి గురై బాధితులుగా మిగిలిన పలువురు జపానీయుల ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవాలనుకుంటున్నారు. ఆయనను కలిసే సందర్భంగా వారి దీనగాధను చెప్పడమే కాకుండా తమ ప్రజలకు క్షమాపణలు డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. టోక్యోలోని ఓ జాతీయ సంఘానికి చెందిన ఇద్దరు నాయకులు ప్రధానంగా ఈ డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగాసాకిపై అమెరికా అణుబాంబులు వేసిన విషయం తెలిసిందే. దీంతో వేలమంది ప్రాణాలుకోల్పోవడమే కాకుండా ఎంతోమంది వికలాంగులుగా మారారు. ఇప్పటికీ ఆ బాంబు ప్రభావం అక్కడ ఉంది. తన పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఒబామా సెంట్రల్ జపాన్ లో జరగనున్న జీ-7 సమావేశానికి ఈ నెల 27న హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే హిరోషిమా పట్టణంలో పర్యటించనున్నారు. తద్వారా హిరోషిమాను సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలవబోతున్నారు. కాగా, ఒక వేళ హిరోషిమా బాధితుల తరుపున వచ్చేవారితో ఒబామా సమావేశం అయినా క్షమాపణలు మాత్రం చెప్పబోరని వాషింగ్టన్ అధికారులు చెప్పారు. -
పాపం ‘ఫ్రై డే’ చేపలు
విజయవాడ: ఎంకిపెళ్లి సుబ్చి చావుకొచ్చినట్లు.. కాలువ పనులు చేపల ఉసురు తీశాయి. ఈ పనులకు ఎండ తోడవడంతో వందలాది చేపలు విలవిలాడుతూ తేలిపోయాయి. విజయవాడ వన్‌టౌన్‌లోని రథం సెంటర్‌ను ఆనుకుని ఉన్న ఏలూరు కాలువ మరమ్మతు పనుల కోసం కెనాల్ గేట్లు మూసేశారు. ఔట్‌ఫ్లో నీటిని మోటార్ల ద్వారా తోడేశారు. దీనికి ఎండ తీవ్రత తోడవడంతో శుక్రవారం కాలువలో వందల చేపలు చనిపోయాయి. నీటిపైకి తేలి కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి. -
కాంట్రాక్టరు మనోడే.. విచారణ వద్దు!
‘అనంత’లో 15 మంది మృతి చెందిన ప్రమాదంపై ఇదీ తీరు మంత్రి బంధువుకి ఇబ్బందులని నివేదిక ఊసెత్తని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీకి చెందిన వారిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది. 15 మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘోర దుర్ఘటనకు కారకుడైన అస్మదీయుడిని రక్షించేందుకు ఏకంగా విచారణకు మోకాలడ్డుతోంది. అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే హడావుడిగా ప్రకటనలు గుప్పించిన సీఎం, మంత్రులు ఇప్పుడు విచారణ ఊసెత్తడం లేదు. రాష్ట్రంలో రోజుకోచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా, వీటిపై గంటల కొద్దీ సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు, అధికారులు ప్రమాదాలపై లోతుగా విచారణ జరిపేందుకు చొరవ చూపడంలేదన్న ఆరోపణలున్నాయి. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారమే ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. ఈ ఏడాది జనవరి ఏడోతేదీన అనంతపురం జిల్లా మడకశిర నుంచి పెనుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 15 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జనవరి 9న అప్పటి రవాణాశాఖ కమిషనర్ అనంతరామును ఆదేశించింది. తరువాత వారంలోనే బదిలీ చేసింది. మళ్లీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినా, కొద్ది రోజుల్లోనే రవాణాశాఖకు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నియమించింది. కాంట్రాక్టర్‌ను రక్షించేందుకే.. కాంట్రాక్టరు తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆర్అండ్బీ అధికారులిద్దరిని, ఆర్టీసీ అధికారులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు కాంట్రాక్టరుపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు. ఆ రోడ్డు పనిని సార్వత్రిక ఎన్నికలకు ముందు ద్వారకామయి కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత అనంతపురం జిల్లాకు చెందిన కీలక మంత్రి సమీప బంధువు ఆ కాంట్రాక్టరు నుంచి పనులు చేజిక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో బెదిరింపులు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సబ్ కాంట్రాక్టరుగా రోడ్డు పనులు చేస్తున్న కృష్ణదేవరాయ కన్‌స్ట్రక్షన్స్‌పై క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అధికారులు సాంకేతిక కారణాలు చూపి టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని జనవరి తొమ్మిదిన ఆదేశించిన ప్రభుత్వం తరువాత ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చి సబ్ కాంట్రాక్టరు మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే విచారణను పక్కన పెట్టేసిందన్న ఆరోపణలున్నాయి. -
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి
సింగరేణి సీఎండీ వాహనాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తుల యత్నం వెళ్లిపోయిన సీఎండీ... గంట పాటు రోడ్డుపై బైఠాయింపు టేకులపల్లి : కోయగూడెం ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల వలన వచ్చే దుమ్ము, ధూళితో తమ ప్రాణాలు పోతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి సీఎండీ శ్రీధర్ వాహనాన్ని సోమవారం పెట్రాంచెలక స్టేజీ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. సీఎండీ కేఓసీని సందర్శించి తిరిగి వస్తుండగా గ్రామస్తులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే వేగంగా వాహనం వారిని దాటి వెళ్లిపోవడంతో వెనుక వస్తున్న డెరైక్టర్లు,మిగిలిన అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్‌రావు, ఎంపీపీ భూక్య లక్ష్మి, సొసైటీ అధ్యక్షులు వాంకుడోత్ పూన్యా, కోయగూడెం సర్పంచ్ పూనెం సురేందర్ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సైలు బత్తుల సత్యనారాయణ, ముత్తా రవికుమార్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. కానీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంట పాటు ఆందోళన కొనసాగించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆందోళన ఉధృతం అవుతుండటంతో పోలీసులు, కేఓసీ పీఓ అభ్యర్ధన మేరకు సింగరేణి డెరైక్టర్లు కారు దిగి వచ్చి వారితో మాట్లాడారు. వారం రోజుల్లో పెట్రాంచెలక స్టేజీ నుంచి టేకులపల్లి రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డి ప్రసాద్, గణితి కోటేశ్వరరావు, ఎండీ రాసుద్దీన్, నోముల భానుచందర్, జమీల్, శ్రీనివాస్, ప్రకాశ్, శంకర్, మారుతీరావు,రెడ్యానాయక్ పాల్గొన్నారు. -
ప్రాణమా! వీడ్కోలు!
మృత్యువు తరుముతుంటే భయంతో దాక్కుంటారు దాదాపు అందరూ. ఆవేశంలో అనాలోచితంగా ప్రాణాలు తీసుకుంటారు కొందరు. కానీ అమెరికాకు చెందిన బ్రిటనీ మేనార్డ్ ఈ రెండూ చేయలేదు. తనను కబళిస్తానన్న మృత్యువును ముందుగానే ఆహ్వానించింది. జీవించాలనే ఆశ ఉన్నా... జీవించే అవకాశం లేక నిండు జీవితాన్ని అంతం చేసు కోవాలని నిర్ణయించుకుంది. ఆమెది ఆవేశంలో చేసుకుంటోన్న ఆత్మహత్య కాదు. అయినవాళ్లకి తనవల్ల ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం, ఆత్మ శాంతి కోసం చేసుకుంటోన్న సగౌరవ స్వీయహత్య! జనవరి 1, 2014. నిదుర తెరలను తొలగించుకుని బలవంతంగా కళ్లు తెరిచింది ఇరవై తొమ్మిదేళ్ల బ్రిటనీ మేనార్డ్. ఇంకా మత్తుగానే ఉన్న కన్నుల ముందు ఏదో రూపం అస్పష్టంగా కదలాడింది. ఆమెకు తెలుసు అక్కడున్నది ఎవరో. అందుకే ఆమె పెదవులు ఆనందంగా విచ్చుకున్నాయి. మరుక్షణం ఆమె నుదుటి మీద ఓ వెచ్చని స్పర్శ! ''హ్యాపీ న్యూ ఇయర్ డియర్'' అంటూ ఓ తీయని స్వరం చెవులకు మంద్రంగా సోకింది. ఆ స్పర్శ, ఆ స్వరం... ఆమెకెంతో ఇష్టమైన వ్యక్తివి. ఆమె భర్త... డ్యాన్ డియాజ్వి! ''థాంక్యూ డ్యాన్... విష్ యూ ద సేమ్'' అంది నవ్వుతూ. బ్రిటనీకి న్యూ ఇయర్ డే అంటే చాలా ఇష్టం. పాతకు గుడ్‌బై చెప్పి కొత్తకు స్వాగతం పలికే ఆ రోజును ఎప్పుడూ ప్రత్యేకంగా జరుపు కుంటుంది. ఈసారి కూడా ఎంతో సంతోషంగా గడపాలనుకుంది. అయితే మధ్యాహ్నం కావస్తుండగా... ఆమెకు ఉన్నట్టుండి తలనొప్పి మొదలైంది. 'ఎందుకో ఈ మధ్య తరచు తలనొప్పి వస్తోంది. ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గినట్టే ఉంటోంది కానీ మళ్లీ మామూలే. ఇవాళ కూడా రావాలా ఈ తలనొప్పి' విసుక్కుంటూ, పెయిన్ కిల్లర్ వేసుకుని మళ్లీ పనిలో పడింది. కానీ ప్రతి సారిలా ఈసారి నొప్పి తగ్గలేదు. అంతకంతకూ పెరిగి, తట్టుకోలేని స్థితికి చేరుకుంది. దాంతో హాస్పిటల్‌కు బయలుదేరింది బ్రిటనీ. కానీ ఆమెకి తెలీదు... తన జీవితాన్ని అల్లకల్లోలం చేసే భయంకరమైన నిజమొకటి త్వరలో తెలియనుందని! సారీ మిసెస్ డియాజ్... మీకు బ్రెయిన్ క్యాన్సర్... అశనిపాతంలా తాకింది బ్రిటనీని ఆ మాట! కలల కోటలు కళ్ల ముందే కూలిపోతున్న ఫీలింగ్. వెంటనే సర్జరీకి ఏర్పాట్లు జరిగాయి. మెదడులో ఉన్న ట్యూమర్‌ని ఆపరేషన్ చేసి తొలగించారు వైద్యులు. కానీ దురదృష్టం... మూడు నెలలు తిరిగేసరికి ట్యూమర్ మళ్లీ వచ్చేసింది. ఈసారి దాన్ని నియంత్రించడం తమ వల్ల కాదని డాక్టర్లకు తెలిసిపోయింది. చివరి ప్రయత్నంగా రేడియేషన్ చేద్దామన్నారు. అయినా ప్రాణం నిలుస్తుందా అంటే... ఆ నమ్మకం కూడా ఇవ్వలేమన్నారు డాక్టర్లు. ఇక ఏం చేసినా మరణం తప్పదని, ఆ మరణం తనను చేరేలోపు నరక యాతన పడక తప్పదని తెలియగానే... ఎవరూ ఊహించని ఒక కఠోర నిర్ణయాన్ని తీసుకుంది బ్రిటనీ. మరణానికి తానే ఆహ్వానం పలకాలనుకుంది. దానికోసం ఆమె ఎంచుకున్న మార్గం... డెత్ విత్ డిగ్నిటీ! అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థుల కోసం ఏర్పాటు చేసిన చట్టమిది. నరకయాతన పడి మరణించ కుండా, అంతా బాగున్నప్పుడే అనాయాసంగా, హుందాగా చనిపోవడానికి వీలు కల్పించే వరం! సరిగ్గా ఆ వరాన్నే కోరుకుంది బ్రిటనీ. వ్యాధి ముదిరిపోయి, ఒళ్లు గుల్ల అయిపోయి, తీసుకుని తీసుకుని చనిపోయే దుర్భర పరిస్థితి తనకి వద్దు. తనవాళ్ల మధ్య, తనను ప్రేమించేవాళ్ల చేరువలో ప్రశాంతంగా కన్నుమూయాలి. ఏ నొప్పీ లేకుండా ప్రాణాలు వదిలేయాలి. అందుకే తన మరణానికి తానే ముహూర్తం పెట్టుకుంది. ఆ ముహూర్తం ఎప్పుడో కాదు... రేపే (నవంబర్1). ఈ రోజు తన భర్త పుట్టిన రోజును ఘనంగా సెలెబ్రేట్ చేసి, రేపు తన ఇంట్లో.. తల్లి, తండ్రి, భర్త, స్నేహితుల మధ్య తనువు చాలించనుంది! బ్రిటనీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యమైనది కాదు. జీవించాలనే కోరిక ఉన్నా, విధి లేకనే తన జీవితాన్ని అంతం చేసుకుంటోంది. అది ఎంత కష్టతరమైన, దుఃఖపూరితమైన స్థితో తెలియంది కాదు. ఆమె పరిస్థితే అంత వేదనాభరితమంటే... ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి అంతకంటే దయనీయం. నిన్నటి వరకూ నవ్వుతూ తిరిగిన మనిషి, తమకెంతో ప్రియమైన మనిషి తమ కళ్లముందే ప్రాణాలు తీసుకుంటుంటే... నిస్స హాయంగా నిలబడి చూస్తూ ఉండటంకన్నా బాధాకరస్థితి మరొకటి ఉండదు. మనసుల్ని మెలిపెట్టే ఆ భయంకర వేదనను తట్టుకునే శక్తిని భగవంతుడే వారికి ప్రసాదించాలి. లేదంటే తనవారి కోసమైనా మరి కొన్నాళ్లు జీవించాలన్న కోరికను బ్రిటనీ మనసులో కలిగించాలి. ఆమె జీవితాన్ని మరికొన్నాళ్లు పొడిగించాలి!! నాకు చనిపోవాలని లేదు. కానీ చనిపోక తప్పని పరిస్థితి. నేను ఆత్మహత్య చేసుకోవడం లేదు. కృశించి కన్నుమూయకుండా, మంచాన పడి నా వాళ్లతో సేవ చేయించుకోకుండా... అంతా బాగున్నప్పుడే గౌరవంగా, ప్రశాంతంగా వెళ్లిపోతున్నాను... అంతే! ఇవే నా చివరి మాటలు. ఇక మీదట నేను ఎవరితోనూ మాట్లాడను. కన్నుమూసే వరకూ మా వాళ్లతోనే సంతోషంగా గడుపుతాను. బ్రిటనీ, 2014 అక్టోబర్ 22. డెత్ విత్ డిగ్నిటీ చట్టం క్రూరంగా అనిపిస్తోందని, రద్దు చేయమని అంటున్నారు. ఎందుకు రద్దు చేయాలి? మరణ యాతన నుంచి విముక్తి కల్పించే ఈ చట్టం అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని దేశాల్లోనూ కూడా ఉండాలి. అందుకే నేను నా పేరుతో బ్రిటనీ మేనార్డ్ ఫండ్ ఏర్పాటు చేశాను. దీనిలోని ప్రతి పైసానీ డెత్ విత్ డిగ్నిటీ చట్టాన్ని ప్రపంచమంతా విస్తరింపజేయ డానికి ఉపయోగించాలి. నాలాంటి వాళ్లందరికీ ప్రశాంతంగా చనిపోయే అవకాశాల్ని కల్పించాలి. ఇదే నా చివరి కోరిక! బ్రిటనీ మేనార్డ్ కొద్ది రోజుల క్రితం చెప్పిన మాటలు మనదేశంలో ప్యాసివ్ యుథనేషియాని 2011లో చట్టబద్ధం చేశారు. దీని ప్రకారం ఏళ్లపాటు అచేతనావస్థలో ఉండి అవస్థ పడుతున్నవారికి లైఫ్ సపోర్ట్‌ను తొలగించవచ్చు. ఇదే కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్). అయితే డెత్ విత్ డిగ్నిటీ ఇందుకు భిన్నం. బాధాకరమైన మరణం తప్పదని తేలిన రోగులు తమంతట తాముగా ముందే ప్రాణాలు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుందీ చట్టం. అమెరికాలోని ఆరెగాన్, వాషింగ్టన్, వెర్మాంట్ రాష్ట్రాలలో మాత్రమే ఉందిది. వీటిలో ఏదో ఒక రాష్ట్రంలో రోగి నివసిస్తున్నట్టు ఆధారాలు చూపించాలి. తర్వాత ఆ వ్యక్తిని సైకియాట్రిస్టు దగ్గరకు పంపిస్తారు. కౌన్సెలింగ్ ద్వారా రోగి మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు సైకియాట్రిస్ట్. అప్పటికీ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటే, నొప్పి తెలియకుండా ప్రాణాలు తీసే ట్యాబ్లెట్లను (వంద ట్యాబెట్లను నీటిలో కరిగించి తీసుకోవాలి) సూచిస్తారు. అయితే మందు ఆ వ్యక్తే స్వయంగా తీసుకోవాలి తప్ప వేరెవ్వరూ కలిపి ఇవ్వకూడదు! భార్య చివరి కోరికను తీర్చడం కోసం డెత్ విత్ డిగ్నిటీ చట్టం అమలులో ఉన్న ఆరెగాన్ రాష్ట్రంలో స్థిరపడటానికి నిర్ణయించుకున్నాడు డ్యాన్. అక్కడ ఆస్తులు కొన్నాడు. లెసైన్సులు సంపాదించాడు. ప్రభుత్వం కోరిన అన్ని డాక్యుమెంట్లనూ సమర్పించాడు. బ్రిటనీని సంతోషంగా ఉంచుతానని పెళ్లి సమయంలో ప్రమాణం చేశాను. సంతోషంగా మరణించ నివ్వు అని అడిగితే ఎలా కాదనగలను అంటున్నాడు డ్యాన్. ఇవన్నీ చేయడానికి అతడు ఎంత మథనపడి ఉండాలి? మనసును ఎంతగా చంపుకుని ఉండాలి! హ్యాట్సాఫ్ డ్యాన్!! -
కవ్వింత: దురాశ
సుజిత: సంగీత కచేరి ఎక్కడ జరిగినా ఎందుకు అంత ఖర్చు పెట్టి మీ అత్తగార్ని పంపుతావు? నయన: సంగీత కచేరి అంటే మా అత్త ప్రాణాలిస్తుందట, అందుకనీ... కోపం ‘‘నీకు నీ భార్య మీద బాగా కోపం వస్తే ఏం చేస్తావ్? చెయ్యి చేసుకుంటావా?’’ ‘‘లేదు, నా ఒక్కడికే వంట చేసుకుంటాను’’. అలా అర్థమైందా? ఎస్కలేటర్ ఆపరేటర్: ఏంటి సార్ ఎస్కలేటరు దాకా వచ్చి వెనక్కు వెళ్తున్నారు? కస్టమర్: ఎస్కలేటరు మీద వెళ్లే వాళ్లు కుక్కను చేత్తో ఎత్తుకుని వెళ్లాలని రాశారు కదా. నా దగ్గర కుక్క లేదు మరి. ముల్లు ‘‘ఇదేమిటయ్యా... అరికాలి నిండా ఇన్ని ముళ్లెలా గుచ్చుకున్నాయి?’’ ‘‘మొదట ఒక్క ముల్లే గుచ్చుకుంది డాక్టర్. ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రయత్నించీ... ఆందోళన భార్య: (పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి) సార్, మా ఆయన ఉదయమనగా కుక్కతో పాటు బయటకు వెళ్లారు. నాకేదో భయంగా ఉంది. ఎస్సై: ఎందుకమ్మా అంత ఆందోళన? భార్య: ఆందోళన అంటారేంటండీ, ఆ కుక్కను ఈ మధ్యే పదివేలు పెట్టి కొన్నాను. అదే ఆఖరు ‘‘హర్షవర్థనుడు ఏ యుద్ధంలో మరణించాడురా సోమేశ్వర్? ‘‘ఆయన చేసిన ఆఖరి యుద్ధంలో సార్’’ -
జర్వాల గండం
ఎన్నడూ లేనివిధంగా జ్వరాల తీవ్రత విషమించింది. విషజ్వరాలు.. డెంగీతో జనం వణికిపోతున్నారు. జ్వరమొస్తేనే ప్రాణం పోతుందేమోననే భయాందోళనలు అలుముకున్నాయి. మంగళవారం ఒకేరోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జ్వరాలతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో జిల్లావ్యాప్తంగా జ్వరాలతో చనిపోయిన వారి సంఖ్య 35కు చేరింది. - సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పండుగకు ముందే యైటింక్లయిన్‌కాలనీ సమీపంలోని న్యూమారేడుపాక గ్రామంలో డెంగీతో నలుగురు ప్రాణాలు కోల్పోవటం విషాదం రేకెత్తించింది. పండుగ తర్వాతే అదే వరుస కొనసాగుతోంది. కోరుట్ల పట్టణంలో సోమ, మంగళ వారాల్లో.. ఒకేరోజు వ్యవధిలో వివిధ ఆసుపత్రుల్లో ముగ్గురు జ్వరాలతో మరణించారు. రోజుకు రెండు వందల మందికి పైగా జ్వరపీడితులు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొం దుతున్నారు. గత రెండు వారాల్లో అత్యధికంగా కోరుట్ల నియోజకవర్గంలోనే పది మంది, రామగుండం నియోజకవర్గంలో ఏడుగురు జ్వరాల బారినపడి కన్నుమూశారు. జిల్లా కేంద్రంలో పాటు అన్ని పట్టణాలు, పల్లెల్లో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసి పోయాయి. బతుకమ్మ, దసరా పండుగలు... వరుసగా వచ్చిన సెలవు దినాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లన్నీ రోగులతో కిటకిటలాడాయి. శని, ఆదివారాల్లో వీకెండ్ విహారానికి వైద్యసేవలు బంద్ చేసే డాక్టర్లు సైతం వారం రోజులుగా రోగుల రద్దీతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 687 మంది అవుట్ పేషంట్లు చికిత్స పొందగా.. అందులో 96 మంది జ్వరపీడితులు ఇన్ పేషెంట్లుగా చేరారు. జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటే... వైద్య ఆరోగ్య శాఖ తేలిగ్గా తోసిపారేస్తోంది. అసలు డెంగీ మరణాలు, విష జ్వరాలతో ఎవరూ చనిపోలేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యమిస్తోంది. ప్రజలే వివిధ అనారోగ్య కారణాలతో చనిపోయారని కుంటిసాకులు వెతుకుతోంది. నియోజకవర్గం మృతుల సంఖ్య కోరుట్ల 10 జగిత్యాల 02 హుస్నాబాద్ 03 హుజురాబాద్ 01 పెద్దపల్లి 02 కరీంనగర్ 02 సిరిసిల్ల 01 గోదావరిఖని 07 చొప్పదండి 02 మానకోండూర్ 01 ధర్మపురి 04 మొత్తం 35 -
పసివాళ్ల ప్రాణాలు.. జాగ్రత్త
నోయిడా: మీరు మీ చిన్నారులను ఆటోరిక్షాల్లో పంపిస్తున్నారా? ఆలోచించండి..ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్నారా? గమనిస్తున్నారా? లేదంటే చిన్నారులు ఆటో ప్రమాదాలకు బలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాల నివార ణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాలతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా ఉంది. విద్యార్థులను ఇంటి వద్దకు చేర్చడానికి , ఇంటి నుంచి పాఠశాలకు రావడానికి మెరుగైన రవాణా సౌకార్యాలు ఆయా విద్యాసంస్థలు కల్పించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వ్యవహరించాలి... తస్మాత్ జాగ్రత్త..!హెచ్చరించినా.. అయితే పాఠశాల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి.‘ మీ పిల్లల్ని ఆటోరిక్షాల్లో పాఠశాలలకు పంపించవద్దు, చిన్నారులు పాఠశాలకు, అక్కడి నుంచి ఇంటికి భద్రంగా వచ్చేలా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.. అయినా కొందరు తల్లిదండ్రులు ఆటో రిక్షాలనే ఆశ్రయిస్తున్నారు. పిల్లలు ప్రమాదాల బారిన పడడానికి కారకులవుతున్నారు. ఆటో బోల్తా చిన్నారి మృతి ఆటోల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు భద్రత కరువైంది. ఇటీవల నితారిలో పదేళ్ల విద్యార్థి ఆటో నుంచి ఎగిరి కిందపడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. పరిమితికి మించిన విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్తుండగా మలుపు వద్ద ఆటో బొల్తాకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదే ఆటోలో మొత్తం 11 మంది విద్యార్థులను పరిమితికి మించి పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటలు నోయిడా పరిధిలో జరగడం పరిపాటిగా మారింది. బస్సు స్టాప్‌లు దూరంగా ఉండడం వల్ల కొందరు చిన్నారుల తల్లిదండ్రులు ఆటోరిక్షాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనల తర్వాత తల్లిదండ్రులు, పాఠశాల యాజమానుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రతపై అప్రమత్తంగా ఉంటాం: విద్యార్థి తండ్రిసెక్టార్ -19కి చెందిన విద్యార్థి తండ్రి అరుణ్‌సింగ్ మాట్లాడుతూ ‘మాకు ఆటోరిక్షాలు అనుకూలంగా ఉన్నాయి. ఐదేళ్లుగా ఆటోల్లోనే పంపిస్తున్నాం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఎప్పటికప్పుడు డ్రైవర్‌తో భద్రత చర్యలను చర్చిస్తామని, అనుభవం ఉన్న డ్రైవర్ అని చెప్పారు. అధిక ఫీజులతో భారం: విద్యార్థి తల్లి సెక్టార్ 57కు చెందిన మృథిలా దేవి మాట్లాడుతూ‘ ఇప్పటికే స్కూలు ఫీజులు, పుస్తకాలు తదితర ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి..భరించలేకపోతున్నాం. అందుకే ఆటో రిక్షాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మా చిన్నారి రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడేదిలేదు. కానీ, ఇటీవల ఆటో రిక్షా ప్రమాదంలో చిన్నారి మృతిచెందడంతో కళ్లు తెరిచాను. ఇప్పటికైనా ఆలోచిస్తా. నా ముగ్గురి పిలల్ని బడికి సుర క్షితంగా పంపించేలా చర్యలు తీసుకొంటాని అన్నారు. ఆటో ఎప్పటికీ సురక్షితం కాదు సెక్టార్- 64కు చెందిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ‘ చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్రంగాకలిచివేసింది. నా కూతురును తీసుకెళ్లే ఆటో పరిమితికి మించిన విద్యార్థులను తరలిస్తుండగా గమనించా. నాతోపాటు మరికొందరు చిన్నారుల కోసం మరో ఆటోను ఆశ్రయించా.. ఇలా ఎన్ని ఆటోలను మార్చినా అధికలోడుతో వెళ్తున్నారు. ఇక ఆటోల్లో పిల్లల్ని తరలించడం సురక్షితం కాదని విరమించుకొన్నాని’అన్నారు. ఆటో రిక్షాల్లో పిల్లల్ని పంపించొద్దు: ప్రిన్సిపాల్ సెక్టార్ -56లోని సర్లా చోప్రా డీఏసీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, పూనమ్ కల్రా మాట్లాడుతూ ‘మా పాఠశాల విద్యార్థులను చేరవేయడానికి 21 బస్సులను నడిపిస్తున్నాం. ఇందులో 3 బస్సులు పాఠశాలకు చెందినవే. మిగతా బస్సులు కాంట్రాక్ట్ పద్ధతిలో నడిపిస్తున్నాం, ఎక్కువ మంది విద్యార్థులు సమీప ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థుల్ని తమ తల్లిదండ్రులే స్వయంగా తమ వాహనాల్లో తీసుకొచ్చి పాఠశాల వద్ద దించి వెళ్తుంటారు. మరికొందరు కార్లలో కూడా తీసుకొచ్చి వదిలి వెళ్తుంటారు. ఎందుకంటే విద్యార్థులను ఆటోరిక్షాల్లో పంపించ వద్దని తల్లిదండ్రులకు సూచించాం. చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలు తీసుకొన్నామని’ అన్నారు. ఆటో రిక్షాలను ఆశ్రయించనీయం: రేణుసింగ్ సెక్టార్-44లోని అమితీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రేణుసింగ్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ల లెసైన్స్‌లు, ఐడీలను పరిశీలిస్తాం. అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమిస్తాం. పాఠశాల బస్సుల్లో పిల్లల్ని బస్సు స్టాప్లకు వరకూ సురక్షితంగా తరలిస్తాం. సాహిబాబాద్, ఘజియాబాద్ తదితర ప్రాంతాలకు చిన్నారులను క్యాబ్‌ల్లో పంపిస్తాం. ఆటో రిక్షాలను ఆశ్రయించవద్దని తల్లిదండ్రలకు సూచించాం. అసలు ఆటోల్లో విద్యార్థులను తీసుకొనిరావడం, తీసుకెళ్లడాన్ని కూడా పూర్తిగా నిషేధించామని అన్నారు. తల్లిదండ్రులకూ అవగాహన సెక్టర్ 28లోని విశాల భారతి పబ్లిక్ స్కూల్ రష్మి కక్రూ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు సొంత బస్సుల్లోనే విద్యార్థులను ఇంటికి తరలిస్తాం. విద్యార్థులతో పాటే ఒక ఉపాధ్యాయుడు కూడా ఉంటారు. ఆటో రిక్షాల్లో విద్యార్థుల పంపించడ సురక్షితం కాదని తల్లిదండ్రలకు అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా పలుజాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు కూడా జారీ చేస్తాం. డ్రైవర్,బస్సుకు సంబంధించిన అన్ని వివరాలు అధికారులకు పంపిస్తామని అన్నారు. అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకొంటామని, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామలు అయ్యేలా చూస్తామని, అప్పుడే విద్యార్థుల ప్రయాణం సురక్షితంగా ఉంటుందని చెప్పారు. -
భౌ బోయ్
నగరంలో శునకాల స్వైర విహారం గుంపులుగా తిరుగుతూ జనంపై దాడి ఏటా పెరుగుతున్న కుక్క కాటు బాధితులు, మరణాలు స్పందించని అధికారులు మల్కాజిగిరిలో చిన్నారిపై దాడితో ఆందోళన సిటీ బ్యూరో, న్యూస్‌లైన్: ‘గ్రేటర్’లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా తిరుగుతూ కనిపించే వారందరిపై దాడి చేస్తున్నాయి. వీటి బారిన పడి, ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుక్కల దాడిలో ప్రాణాలు కో ల్పోతున్న వారి సంఖ్య భీతిగొల్పుతోంది. శుక్రవారం మల్కాజ్‌గిరిలో రెండున్నరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ చిన్నారి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. రక్తమోడుతున్న బాలుని తీసుకొని కుటుంబ సభ్యులు రెండు ఆస్పత్రులకు తిరిగినా అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం రాజధాని నగరంలో వైద్యసేవల తీరుకు దర్పణం పడుతోంది. ఇక్కడ... అక్కడ...అని తేడా లేకుండా నగరమంతటా కుక్కల బెడద తీవ్రంగా వేధిస్తోంది. బాటసారులతో పాటు వాహనదారులూ కుక్క కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట విధులు నిర్వహించి ఇళ్లకు వెళుతున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఏ కుక్క ఎటు నుంచి మీద పడుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. వీటి కారణంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా కాలు బయట పెట్టలేని దుస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. వీటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి చర్యలూ కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటిని దూరంగా తరలించాలని తాము చేస్తున్న విజ్ఞప్తులు పట్టించుకునే వారే లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే శస్త్ర చికిత్సలు వీధి కుక్కల వల్ల ప్రజలకు హాని జరుగకుండా ఉండేం దుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు శస్త్రచికిత్స కేంద్రాల ద్వారా ఏటా దాదాపు 80 వేల కుక్కలకు టీకాలు, నెలకు రెండువేల కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని అంటున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే అధికారుల మాటలపై సందేహాలు రేకెత్తేలా ఉంది. శస్త్ర చికిత్సల సంగతి అటుం చి... వాటిని దూర ప్రాంతాలకు తరలించాలని జనం ముక్తకంఠంతో కోరుతున్నారు. గడచిన పదేళ్లలో నగరంలో కుక్కకాటుతో దాదాపు 40 మంది మృతి చెందారు. ఏటా దాదాపు ఐదు వేల మంది కుక్కకాటు బారిన పడుతున్నారు. కుళ్లిన ఆహార పదార్థాల వల్లనేనట... గ్రేటర్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్తకుప్పలు.. వాటిలోని కుళ్లిపోయిన ఆహార పదార్థాలను కుక్కలు తినడం వల్ల ప్రకోపం పెరిగి ప్రజలపై దాడి చేస్తాయని పశువైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాక ఆగస్టు-నవంబర్ నెలల మధ్య కుక్కల సంతానోత్పత్తి సమయమైనందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గతంతో పోలిస్తే గ్రేటర్లో కుక్కల బెడద తగ్గిందని అధికారులు చెబుతుండగా... నెలకు దాదాపు రెండువేల మంది నారాయణగూడలోని ఐపీఎంకు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఐపీఎంకు వచ్చేవారిలో నగర ప్రజలే కాక పొరుగు జిల్లాల వారు కూడా ఉంటున్నారని అధికారులు అంటున్నారు. రోజూ ఫిర్యాదులు... తమ ప్రాంతంలో కుక్కలు తిరుగుతున్నాయంటూ రోజుకు వంద మందికి పైగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తున్నారు. కుక్క కాటు బాధితుల సంఖ్య కూడా రోజుకు వందకుపైగానే ఉంటున్నట్టు ఓ అధికారి చెప్పారు. గ్రేటర్లో ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల కుక్కలు ఉండవచ్చునని అంచనా. కుక్క క రిచిన వారికి అవసరమైన యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు నారాయణగూడలోని ఐపీఎం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో అందుబాటులో ఉన్నాయని జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనల మేరకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు(స్టెరిలైజేషన్) ద్వారా మాత్రమే ప్రజలకు కుక్కల నుంచి హాని లేకుండా చేయాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్సల కేంద్రాలు ఆటోనగర్, అంబర్‌పేట, చుడీబజార్, జీడిమెట్ల, పటాన్‌చెరులలో ఉన్నాయి. మల్కాజిగిరిలో కుక్కల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ గోవర్థన్‌రెడ్డి చెప్పారు. అక్కడ నిత్యం తమ విభాగానికి చెందిన రెండు వాహనాలు తిరుగుతున్నాయన్నారు. వీధి కుక్కలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను గ్రేటర్‌లోని దిగువ నెంబర్లకు తెలియజేయవచ్చు. ఈస్ట్‌జోన్-9000554767, 9989930359 సౌత్‌జోన్- 9989930358, సెంట్రల్‌జోన్-9704456521, 9989930356 వెస్ట్‌జోన్-9000901937 నార్త్‌జోన్-9704456520, 9989930397 ఇదీ పరిస్థితి : సాక్షి, సిటీబ్యూరో: కుక్క కాటుకు సంబంధించి గత ఏడాది ఫీవర్ ఆస్పత్రిలో అత్యధికంగా 11621 కేసులు నమోదు కాగా, వీరిలో 23 మందికి రేబిస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదువేలకు పైగా కుక్కకాటు కేసులు నమోదు కాగా, పది మంది రేబిస్ బారిన పడ్డారు. ఇదే ఆస్పత్రిలో గురువారం 47 కేసులు కాగా, శుక్రవారం 28 కేసులు నమోదవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇవీ దుష్ఫలితాలు... కుక్క కాటు వల్ల వైరస్ కాలు నుంచి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది. రేబీస్ సోకిన వారిలో మొదటి దశలో జ్వరం, తల నొప్పి, వాంతులు, వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించ లేకపోవడం, నోటిలోంచి నురుగ రావడం, మంచి నీరు తాగితే గొంతు పట్టేయడం, గాలి వీచినప్పుడు ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు రెండో దశలో కనిపిస్తాయి. ఇక మూడో దశలో పూర్తిగా కోమా లోకి వెళ్లిపోయి, రెండు మూడు రోజుల్లో మరణిస్తారు. ఈ జాగ్రత్తలు పాటించాలి వీధి కుక్కలను సాధ్యమైనంత వరకు నియంత్రించాలి. ఒక వేళ కుక్క కరిస్తే వెంటనే ధారగా కారుతున్న నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. రక్తం కారుతున్నా...గాయంపై కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటివి పూయకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి, యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. కుక్కలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. వీధి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతంలో తిరగకపోవడమే మంచిది. ఇంట్లో ఉన్న కుక్కలకు ప్రతి మూడు మాసాలకు ఒకసారి తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించాలి. -
జూదం..కబళిస్తున్న ప్రాణం
రిక్రియేషన్ పేరిట జోరుగా జూదం ఏటా రూ. కోట్లలోనే లావాదేవీలు ఎట్టకేలకు మేల్కొన్న సిటీ పోలీసులు కఠిన చర్యలకు కమిషనర్ ఆదేశం జూదం..మొదట్లో సరదా..మితి మీరితే వ్యసనం..ఇందులో చిక్కుకుని సమస్యల వలయంలోకి వెళ్తున్నారు. ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నారు. తేరుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. దీనికి ధనికులే కాదు, మధ్య తరగతి వారూ బలవుతున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా..గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: క్లబ్బుల్లో రిక్రియేషన్ పేరిట జోరుగా సాగుతున్న జూదం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. పేకాటకు బానిసై సర్వం కోల్పోయిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి శుక్రవారం సాక్షాత్తు రాజ్‌భవన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరంలోని పేకాట క్లబ్బుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రకటించిన నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బోయిన్‌పల్లిలోని జీవీఆర్ ఫ్యామిలీ క్లబ్‌పై కొరడా ఝుళిపించారు. క్లబ్‌ను సీజ్ చేయడంతో పాటు ఆందోళనకు దిగిన ఉద్యోగులతో పాటు యజమానినీ అరెస్టు చేయించారు. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుసపెట్టి దాడులు చేస్తూ ఇలాంటి క్లబ్బులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చితికిపోతున్న వందల కుటుంబాలు ఈ జూద క్రీనీడలో వందల కుటుంబాలు చితికిపోతున్నాయి. వ్యసనపరుల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ రిక్రియేషన్ క్లబ్స్ అహ్లాదం ముసుగులో జూద గృహాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ చట్రంలో చిక్కుకుని ధనవంతులతో పాటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు విలవిలలాడుతున్నారు. సర్వ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. విషయం ఇంతటితో ఆగకుండా వారి కుటుంబాలనూ నడి రోడ్డుపై పడేస్తున్నాయి. చట్ట విరుద్ధమని తెలిసినా అనేక క్లబ్బులు రాజకీయ, అధికార అండదండలతో యథేచ్ఛగా పేకాటను నడుపుతున్నాయి. వీటిలో జూదరులకు రాజభోగాలతో పాటు ఫైనాన్సియర్లనూ సమకూరుస్తున్నారు. వెరసి సిటీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి తరలివస్తున్న పేకాట రాయుళ్లకు స్వర్గాధామంగా మారింది. ఈ క్లబ్బుల బారినపడి మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు అనేకం ఆర్థికంగా చితికిపోతున్నాయి. సిటీలో 70కి పైగానే క్లబ్బులు... నగర పోలీసుల లెక్కల ప్రకారం సిటీలో దాదాపు 30 రిక్రియేషన్ క్లబ్స్ ఉన్నాయి. వీటికి తోడు చిన్నా, పెద్దా అన్నీ కలిపి దాదాపు 70కి పైగా క్లబ్బులు పేకాటను జోరుగా నిర్వహిస్తున్నాయి. ఇందులో కొన్ని ‘రిక్రియేషన్’ పేర అనుమతి తీసుకున్నవి కాగా మరికొన్నింటికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతి ఉన్న వాటిపై పోలీసులు దాడి చేయరన్న ప్రచారం ఉండటంతో ఇవి పేకాట రాయుళ్లతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఇందులో రెండు ప్రధాన రిక్రియేషన్ క్లబ్బుల ఆధాయం కేవలం పేకాట నిర్వహణతోనే రూ.50 కోట్లకు పైనే. పేకాటను నిర్వహించే ఇతర క్లబ్బులు ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆర్జిస్తున్నాయని అంచనా. మొత్తం క్లబ్బుల్లో వార్షిక టర్నోవర్ వందల కోట్లలోనే ఉంటోంది. సభ్యత్వం తీసుకుని..సర్వం పొగొట్టుకుంటున్నారు పేకాటకు బానిసైన అనేక మంది నగరంలోని వివిధ క్లబ్బుల్లో సభ్యత్వాలు తీసుకుని మరీ సర్వం పొగొట్టుకుంటున్నారు. ఈ సభ్యులు అనునిత్యం ఒకటి కాకుంటే మరో క్లబ్బులో పేకాట ఆడుతూ గడిపేస్తున్నారు. ఉదయమే రావడం, రాత్రి వరకూ పేకాట ఆడటం అలవాటుగా మారిపోతోంది. కొందరైతే రోజుల తరబడి వాటిలోనే గడుపుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. అక్కడే అనేక మంది నుంచి అప్పటికే అప్పులు తీసుకుని మరీ జూదానికి ‘సమర్పిస్తున్నారు’. ఈ రకంగా అన్నీ పోగొట్టుకుని, నిత్యం నరకం చవిచూస్తే జీవచ్ఛవాలుగా బతికే ‘క్లబ్స్ బాధితులు’ సిటీలో ఎందరో ఉంటున్నారు. పేకాటకు బానిసై ఆత్మహత్యాయత్నం పంజగుట : తాగుడు, పేకాటకు బానిసైన వ్యక్తి.. తనలా మరొకరు కాకూడదంటూ రాజ్‌భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ‘కుటుంబ పోషణ భారమైంది.. పోయిన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకునేందుకు డబ్బు లేదు.. ఎదిగొచ్చిన కూతురు పెళ్లి చేయలేకపోతున్నాను’అంటూ కేకలు వేస్తూ శుక్రవారం సాయంత్రం పురుగులు మందు తాగాడు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతన్ని యశోద ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూల్ టౌన్-1కు చెందిన రాజేంద్రకుమార్ (52) అదే జిల్లా ఎమ్మిగనూరులో కండక్టర్. మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడంటూ 2009లో సస్పెండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు. ఇక్కడ కూడా బోయినపల్లిలోని ఓ క్లబ్లో తరచూ పేకాడుతూ ఉన్న ఆస్తినీ పోగొట్టుకున్నాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వద్దకు వచ్చి నగరంలో ఉన్న పేకాట క్లబ్లనన్నింటిని మూయించాలని నినాదాలు చే స్తూ పురుగుల మందుతాగాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రకుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు. సూసైడ్ నోట్లో.. సాక్షి,సిటీబ్యూరో: రాజేంద్రకుమార్ (52) రాసిన సూసైడ్‌నోట్ సారాంశం.. ‘‘క్రిస్టాల్, జీవీఆర్, నేనిైెహ టెక్ క్లబ్‌ల్లో 14 ఏళ్లపాటు పేకాట ఆడి రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాను. అస్తులు కరిగిపోయాయి, అప్పులెక్కువయ్యాయి. నా చావు అందరికి కనివిప్పు కావాలి, క్లబ్బులను మూసివేయించాలి’’ -
ప్రాణాలు నిలపండి!
ఎంజీఎంలో వైద్య సిబ్బంది కొరత తీర్చండి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన 29 వైద్యుల పోస్టులు ఖాళీ.. పరికరాలున్నా.. అందని సేవలు మూడేళ్లుగా నిలిచిన గుండె శస్త్ర చికిత్సలు సాక్షిప్రతినిధి, వరంగల్ : మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనాలపై కలెక్టర్ జి.కిషన్ స్పందించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే ఎంజీఎంను చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు. ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిని కోరారు. వైద్య సేవల్లో అంతరాయంతో పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంజీఎం ఆస్పత్రిని 690 పడకల నుంచి వెయ్యి పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వివిధ కేటగిరీల్లో కలిపి మంజూరైన 291 పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఈ నెల 19న జరిగిన ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ వైద్యులు, వైద్య సిబ్బంది కొరతపైనే ప్రధానంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వైద్యులు లేక..మరణాలు ఎంజీఎంలో వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పేద వర్గాలకు సంజీవనిగా ఉండాల్సిన ఎంజీఎంలో వైద్య సేవల్లో లోపాలు ఉంటున్నాయి. ఎంజీఎంలో 47 మంది వైద్యులకు గాను.. ఇప్పుడు 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్డియాలజీ, న్యూరోసర్జన్, వాస్కిలర్సర్జన్, ఎండ్రొకనాలజిస్ట్లు, ఇతర సాధారణ వైద్యులు లేరు. పేద ప్రజలకు రోగం వస్తే నయంకాని పరిస్థితి ఉంది. అసలే తక్కువ మంది వైద్యులు ఉన్నారంటే.. వీరిలో కొందరు రాజకీయ పలుకుబడితో డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రేడియోథెరపీ, కృత్రిమ శ్వాస ఇచ్చి ప్రాణాలు నిలిపే వెంటిలేటర్లు, రక్త పరీక్షలు నిర్వహించే ఏబీజీ మిషన్ పని చేయకపోవడంతో సరైన వైద్య సేవలు అందడం లేదు. ప్రధానమైన కార్డియాలజీ(గుండె) విభాగం అధ్వానంగా ఉంది. పర్మినెంట్ కార్డియాలజీస్టును కేటాయించినా.. ఆయన డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. మూడేళ్లుగా గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై ఎంతో మంది క్షతగాత్రులు నిత్యం ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి వెంటనే వైద్యచికిత్సలు చేయాల్సి ఉంటుంది. తలకు గాయాలైన వారికి శస్త్ర చికిత్సలు చేయాలంటే న్యూరోసర్జన్ తప్పని సరిగా ఉండాల్సిందే. ఎంజీఎం ఆస్పత్రిలో న్యూరోసర్జన్ వైద్యుడు లేకపోవడంతో ఎంతో మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. -
ఉసురు తీసిన ఊయల
చింతపల్లి రూరల్, న్యూస్‌లైన్: ఉయ్యా లంటే ఇష్టపడని చిన్నారులెవ రు? ఆ పసిపాప కూడా సరదాగా ఉయ్యాల ఊగింది.. అయితే గాలిలో కేరింతలు కొట్టించిన ఉయ్యాల తాడే ఆమెకు ఉరితాడయింది. ప్రాణాలు హరించిం ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. పండగ కోసం దుస్తులు కొనడానికి సంతకు వెళ్లి ఇంటికి వచ్చిన వారికి గడపలో ఘోరం కనిపించింది. మండలంలోని చినగెడ్డ గ్రామానికి చెందిన వంతాల సింహచలం, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండేళ్ల చిన్న కుమార్తె మంచిచెడ్డలు బాధ్యతను ఆరేళ్ల పెద్ద కూతురికి అప్పగించి వారు చింతపల్లి వారపు సంతకు బయల్దేరారు. ఇంటి గడపలో ఉయ్యాలతో ఆడుకుంటున్న పసిపాపను వదిలి అక్క బయటకు వెళ్లింది. ఉయ్యాలతో ఆడుకుంటున్న చిన్నారి మెడ చుట్టూ తాడు చుట్టుకు పోయింది. అదే ఉరితాడు మాదిరిగా మారింది. దాంతో ఆమె అచేతనమైంది. సంత నుంచి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన ఘోరం కనిపించింది. వారు హుటాహుటిన రెండు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. చిన్నారి కూతురు మరి తిరిగిరాదని తెలిసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.