ఒబామాను నిలదీసి క్షమాపణలు డిమాండ్!
టోక్యో: అమెరికా అణుబాంబు దాడికి గురై బాధితులుగా మిగిలిన పలువురు జపానీయుల ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవాలనుకుంటున్నారు. ఆయనను కలిసే సందర్భంగా వారి దీనగాధను చెప్పడమే కాకుండా తమ ప్రజలకు క్షమాపణలు డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. టోక్యోలోని ఓ జాతీయ సంఘానికి చెందిన ఇద్దరు నాయకులు ప్రధానంగా ఈ డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగాసాకిపై అమెరికా అణుబాంబులు వేసిన విషయం తెలిసిందే.
దీంతో వేలమంది ప్రాణాలుకోల్పోవడమే కాకుండా ఎంతోమంది వికలాంగులుగా మారారు. ఇప్పటికీ ఆ బాంబు ప్రభావం అక్కడ ఉంది. తన పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఒబామా సెంట్రల్ జపాన్ లో జరగనున్న జీ-7 సమావేశానికి ఈ నెల 27న హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే హిరోషిమా పట్టణంలో పర్యటించనున్నారు. తద్వారా హిరోషిమాను సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలవబోతున్నారు. కాగా, ఒక వేళ హిరోషిమా బాధితుల తరుపున వచ్చేవారితో ఒబామా సమావేశం అయినా క్షమాపణలు మాత్రం చెప్పబోరని వాషింగ్టన్ అధికారులు చెప్పారు.