ఉసురు తీసిన ఊయల
చింతపల్లి రూరల్, న్యూస్‌లైన్: ఉయ్యా లంటే ఇష్టపడని చిన్నారులెవ రు? ఆ పసిపాప కూడా సరదాగా ఉయ్యాల ఊగింది.. అయితే గాలిలో కేరింతలు కొట్టించిన ఉయ్యాల తాడే ఆమెకు ఉరితాడయింది. ప్రాణాలు హరించిం ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. పండగ కోసం దుస్తులు కొనడానికి సంతకు వెళ్లి ఇంటికి వచ్చిన వారికి గడపలో ఘోరం కనిపించింది. మండలంలోని చినగెడ్డ గ్రామానికి చెందిన వంతాల సింహచలం, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
రెండేళ్ల చిన్న కుమార్తె మంచిచెడ్డలు బాధ్యతను ఆరేళ్ల పెద్ద కూతురికి అప్పగించి వారు చింతపల్లి వారపు సంతకు బయల్దేరారు. ఇంటి గడపలో ఉయ్యాలతో ఆడుకుంటున్న పసిపాపను వదిలి అక్క బయటకు వెళ్లింది. ఉయ్యాలతో ఆడుకుంటున్న చిన్నారి మెడ చుట్టూ తాడు చుట్టుకు పోయింది. అదే ఉరితాడు మాదిరిగా మారింది. దాంతో ఆమె అచేతనమైంది. సంత నుంచి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన ఘోరం కనిపించింది.
వారు హుటాహుటిన రెండు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. చిన్నారి కూతురు మరి తిరిగిరాదని తెలిసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.