ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: లైంగిక హింస, యాసిడ్ దాడి వంటి కేసుల బాధితులకు వైద్యం అందించే విషయమై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయా కేసుల బాధితులకు వైద్యం నిరాకరించడమే నేరమేనని స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితిలో గుర్తింపు పత్రాలు తేవాలంటూ ఆస్పత్రులు, వైద్య నిపుణులు పట్టుబట్టడం సరికాదని పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇటువంటి బాధితులకు ఉచితంగా వైద్య సాయం అందించాల్సిందేనని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంది. లేనట్లయితే బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. ఆస్పత్రులతోపాటు వైద్య చికిత్సలు అందించే అన్ని రకాల కేంద్రాలకు ఇదే సూత్రం వర్తిస్తుందని వివరించింది.
ఆయా కేసుల బాధితులకు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే కాదు, అవసరమైన ఇతర నిర్థారణ పరీక్షలు, ఆస్పత్రిలో చేర్చుకోవడం, ఔట్ పేషెంట్‌గా వైద్యం అందించడం, సర్జరీ, భౌతిక, మానసిక కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ వంటి సేవలను కూడా అందించాలని తెలిపింది. తక్షణమే ఈ విషయాన్ని వైద్యులు, పరిపాలన సిబ్బంది, అధికారులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వంటి అందరికీ చేరేలా ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి, లైంగికదాడి మైనర్ బాధితులు, ఇతరులకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment