సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుదారుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాము చేయించుకున్న చికిత్సలు, వైద్య పరీక్షల వివరాలను లబ్దిదారులు ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో ఎప్పుడైనా మెడికల్ రిపోర్టులు అవసరమైతే ఈ యాప్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. కార్డుదారులకు అవసరమైన చికిత్సలు ఏఏ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయో తెలియజేసే వివరాలన్నీ ఈ యాప్‌లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు చేపట్టిన మొదటి విడత ఇంటింటి సర్వే సమయంలోనే.. ఈ యాప్‌ను ఆరోగ్యశ్రీ కార్డుదారులు తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు కేటాయించిన క్లస్టర్ల పరిధిలోని లబ్దిదారుల ఫోన్లలో దీనిని డౌన్‌లోడ్ చేయించి.. దాని ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు నంబర్ లేదా సంబంధిత కుటుంబసభ్యుని ఆధార్ నంబర్‌ను యాప్‌లో నమోదు చేస్తే.. ఆ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ వివరాలన్నీ అందులో ప్రత్యక్షమవుతాయి.
వారంతా ఈ పథకం ద్వారా పొందిన చికిత్సల వివరాలను తెలుసుకోవచ్చు. చికిత్స సమయంలో జరిగిన వైద్య పరీక్షల రిపోర్టులు కూడా అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా ఆ వైద్య పరీక్షల రిపోర్టులు అవసరమైతే ఈ యాప్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించినందుకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించిందన్న వివరాలను కూడా వారు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు.
నెల్లూరు జిల్లాలో అత్యధికం..
వలంటీర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుదారుల మొబైల్‌ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్‌కు సంబంధించిన కార్యక్రమం నవంబర్ 29 వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించిన పురోగతిని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 6,83,635 మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఈ యాప్‌ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్నారు. బుధవారం ఒక్క రోజే 1,81,507 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లక్ష మందికి పైగా, ఏలూరు జిల్లాలో 99,427 మంది, కాకినాడ జిల్లాలో 85,166 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment