Artsy
-
ఉయ్యాల.. జంపాల
పుట్టపర్తి టౌన్: ఏడు పదుల వయస్సులో ఓ బామ్మ పదేళ్ల పిల్లలా తొక్కుటూయల ఊగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పుట్టపర్తి నగర పంచాయతీ బ్రాహ్మణపల్లికి చెందిన జయమ్మ వయస్సు 76 ఏళ్లు. ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె సంతానం. ఈ వయస్సులోనూ జయమ్మ తన పనులు తానే చేసుకుంటోంది. వంట కూడా స్వయంగా వండుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే ఇంటి వద్దనున్న చింత చెట్టుకు తొక్కుటూయల వేసి అతివేగంగా ఊగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాగులు, కొర్రలు, జొన్నలు, సంగటి, ఆకుకూరలు తినడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నట్లు జయమ్మ చెబుతోంది. రోజూ వ్యాయామం, ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలిపారు. -
ఉయ్యాల ఊగితే..మాంచి నిద్ర!
రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ మధ్యకాలంలో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా? అయితే ఒక పనిచేయండి. ఇంట్లో ఓ ఉయ్యాల వేయించుకోండి. ఎంచక్కా దానిపైనే ఊగుతూ నిద్రపోండి. మీ సమస్యలు ఉపశమించే అవకాశం ఉంది. అదెలా అని ఆశ్చర్యపోవద్దు. స్విట్జర్లాండ్, జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన రెండు వేర్వేరు అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఉయ్యాలపై ఊగడం నిద్రను ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుందట. మాములు పరిస్థితుల్లో కూడా బాగా నిద్రపోయే వారు కొంతమందిని ఎన్నుకుని తాము ప్రయోగాలు చేశామని.. ఉయ్యాల ఊపులకు వీళ్లు చాలా తొందరగా నిద్రలోకి జారుకోవడమే కాకుండా.. ఎక్కువ సమయం దీర్ఘనిద్రలో ఉన్నట్లు తెలిసిందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లారెన్స్ బేయర్ తెలిపారు. అలాగే కొన్ని పదాలను గుర్తుపెట్టుకుని మళ్లీ చెప్పాల్సిందిగా కోరే పరీక్షలోనూ వీరు విజయం సాధించారని తద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు తాము ఒక అంచనాకు వచ్చామని వివరించారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లోనూ దాదాపు ఇదే ఫలితాలు రావడం విశేషం. ఎలుకలను నిద్ర పుచ్చేందుకు వీరు కదిలే పంజరాలను ఉపయోగించారు. -
ఉయ్యాలే ఉరి తాడైంది
► మెడకు చీర బిగుసుకుని బాలుడి దుర్మరణం ► ఆరేళ్ల బాలుడు ఆటాడుతుండగా ఘటన గుండుగొలనుకుంట (ద్వారకాతిరుమల) : ఉయ్యాలే ఉరితాడయింది.. ఆ బాలుడి పాలిట అది యమపాశంగా మారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ.. పాడుతూ సరదాగా గడిపిన ఆ బాలుడి మెడకు ప్రమాదవశాత్తు ఉయ్యాలగా వేసిన చీర బిగుసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన మండలంలోని గుండుగొలనుకుంట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతుని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడేపల్లి విఘ్నేశ్వరరావు, రత్నసుధ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. వీరు కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇందులో పెద్ద కుమారుడు షణ్ముఖసాయి(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజులానే షణ్ముఖసాయిని పాఠశాలకు పంపి, వారి తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లారు. అయితే పాఠశాలకు క్రిస్మస్ సెలవులు కావడంతో ఆ బాలుడు ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో అలవాటు ప్రకారం ఎప్పుడు ఆడుకునే పక్కింటికి వెళ్లాడు. ఆ ఇంటి వద్ద కూడా ఎవరూ లేరు. ఇదిలా ఉంటే ఆ ఇంటి వారు తమ చంటిపిల్లలను నిద్రపుచ్చేందుకు వరండాలో వేసిన చీర ఉయ్యాలను బాలుడు షణ్ముఖసాయి చూశాడు. ఉయ్యాలగా ఉన్న చీరను మధ్యకు ముడివేసి ఉండడాన్ని గమనించి ఊగేందుకు వీలుగా లేదని దాన్ని పట్టుకుని కొద్దిసేపు ఆటలాడాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మంచం ఎక్కి ముడివేసి ఉన్న చీరలో తలపెట్టి కిందకు దూకాడు. దీంతో మెడకు చీర బిగుసుకుని ఉరిపడటంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళుతున్న పలువురు బాలుడు ఊగుతుండడాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూడగా, అప్పటికే మృతిచెందాడు. ఆశతో కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, వైద్యులు అప్పటికే బాలుడు చనిపోయినట్టు నిర్ధారించారు. షణ్ముఖసాయి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఉసురు తీసిన ఊయల
చింతపల్లి రూరల్, న్యూస్‌లైన్: ఉయ్యా లంటే ఇష్టపడని చిన్నారులెవ రు? ఆ పసిపాప కూడా సరదాగా ఉయ్యాల ఊగింది.. అయితే గాలిలో కేరింతలు కొట్టించిన ఉయ్యాల తాడే ఆమెకు ఉరితాడయింది. ప్రాణాలు హరించిం ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. పండగ కోసం దుస్తులు కొనడానికి సంతకు వెళ్లి ఇంటికి వచ్చిన వారికి గడపలో ఘోరం కనిపించింది. మండలంలోని చినగెడ్డ గ్రామానికి చెందిన వంతాల సింహచలం, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండేళ్ల చిన్న కుమార్తె మంచిచెడ్డలు బాధ్యతను ఆరేళ్ల పెద్ద కూతురికి అప్పగించి వారు చింతపల్లి వారపు సంతకు బయల్దేరారు. ఇంటి గడపలో ఉయ్యాలతో ఆడుకుంటున్న పసిపాపను వదిలి అక్క బయటకు వెళ్లింది. ఉయ్యాలతో ఆడుకుంటున్న చిన్నారి మెడ చుట్టూ తాడు చుట్టుకు పోయింది. అదే ఉరితాడు మాదిరిగా మారింది. దాంతో ఆమె అచేతనమైంది. సంత నుంచి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన ఘోరం కనిపించింది. వారు హుటాహుటిన రెండు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. చిన్నారి కూతురు మరి తిరిగిరాదని తెలిసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.