టైటాన్‌ ఆశలు జల సమాధి Titanic sub destroyed in catastrophic implosion, all five aboard dead | Sakshi
Sakshi News home page

టైటాన్‌ ఆశలు జల సమాధి.. తునాతునకలైనట్లు అధికారిక ప్రకటన

Published Fri, Jun 23 2023 5:27 AM | Last Updated on Fri, Jun 23 2023 11:34 AM

Titanic sub destroyed in catastrophic implosion, all five aboard dead - Sakshi

దుబాయ్‌/బోస్టన్‌: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉదంతం.. విషాదాంతం అయ్యింది. అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ ఓడ శకలాలను తిలకించడానికి టైటాన్‌ మినీజలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లే!. టైటాన్‌ శకలాలను టైటానిక్‌ సమీపంలోనే గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ఉత్కంఠగా అన్వేషణ కొనసాగుతున్న తరుణంలో.. ప్రాణవాయువు(ఆక్సిజన్‌) ముగిసిపోయే అంచనా గడువు దగ్గరపడుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడంది. 

తాము నీటి అడుగుకు పంపించిన రిమోటెడ్‌ ఆపరేటెడ్‌ వెహికిల్‌.. శకలాలను గుర్తించిందని వెల్లడించింది. అవి టైటాన్‌వేనని భావిస్తున్నట్లు తెలిపింది. ‘తమ సంస్థ చీఫ్‌ పైలట్.. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టాక్టన్‌ రష్, ప్రయాణికులైన షహ్‌జాదా దావూడ్, ఆయన కొడుకు సులేమాన్‌ దావూద్, హామిష్‌ హార్డింగ్, పౌల్‌–హెన్రీ నర్గియెలెట్‌ మృతి చెందారు’అని ఓషన్‌ గేట్‌ తెలిపింది. అయితే, వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు.

ఆదివారం ఉదయం బయలుదేరిన సమయంలో టైటాన్‌లో దాదాపు 96 గంటలపాటు మాత్రమే శ్వాసించేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉంది. ఆ సమయం కూడా ముగిసిపోయింది. గురువారం ఉదయానికల్లా జలాంతర్గామిలో ఆక్సిజన్‌ ఇక పూర్తిగా నిండుకున్నట్లే. అయితే, టైటాన్‌ గల్లంతైన రోజే వారు మరణించారా? అంటే..ఆ పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టైటాన్‌ ఆదివారం ఉదయం కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. టైటాన్‌ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ఒక పెద్ద సవాలుగా మారింది. అమెరికా కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సముద్రంలో టైటాన్‌ కోసం తీవ్ర అన్వేషణ కొనసాగించింది. సెర్చ్‌ ఆపరేషన్‌ కోసం మరిన్ని నౌకలు, విమానాలను, ఇతర పరికరాలను రంగంలోకి దించారు. ఫ్రెంచ్‌ పరిశోధక సంస్థ కెమెరాలు, లైట్లతో కూడిన డీప్‌–డైవింగ్‌ రోబోట్‌ను సముద్రంలోకి పంపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement