భౌ బోయ్ | Dogs in the city, randomized excursion | Sakshi
Sakshi News home page

భౌ బోయ్

Published Sat, Aug 9 2014 4:26 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

భౌ బోయ్ - Sakshi

భౌ బోయ్

  •      నగరంలో శునకాల స్వైర విహారం
  •      గుంపులుగా తిరుగుతూ జనంపై దాడి
  •      ఏటా పెరుగుతున్న కుక్క కాటు బాధితులు, మరణాలు
  •      స్పందించని అధికారులు
  •      మల్కాజిగిరిలో చిన్నారిపై దాడితో ఆందోళన
  • సిటీ బ్యూరో, న్యూస్‌లైన్: ‘గ్రేటర్’లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా తిరుగుతూ కనిపించే వారందరిపై దాడి చేస్తున్నాయి. వీటి బారిన పడి, ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుక్కల దాడిలో ప్రాణాలు కో ల్పోతున్న వారి సంఖ్య భీతిగొల్పుతోంది. శుక్రవారం మల్కాజ్‌గిరిలో రెండున్నరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

    ఆ చిన్నారి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. రక్తమోడుతున్న బాలుని తీసుకొని కుటుంబ సభ్యులు రెండు ఆస్పత్రులకు తిరిగినా అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం రాజధాని నగరంలో వైద్యసేవల తీరుకు దర్పణం పడుతోంది. ఇక్కడ... అక్కడ...అని తేడా లేకుండా నగరమంతటా కుక్కల బెడద తీవ్రంగా వేధిస్తోంది. బాటసారులతో పాటు వాహనదారులూ కుక్క కాటుకు గురవుతున్నారు.

    ముఖ్యంగా రాత్రి పూట విధులు నిర్వహించి ఇళ్లకు వెళుతున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఏ కుక్క ఎటు నుంచి మీద పడుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. వీటి కారణంగా రాత్రి వేళల్లో  ఎవరూ ఒంటరిగా కాలు బయట పెట్టలేని దుస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. వీటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి చర్యలూ కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటిని దూరంగా తరలించాలని తాము చేస్తున్న విజ్ఞప్తులు పట్టించుకునే వారే లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
     
    పేరుకే శస్త్ర చికిత్సలు

    వీధి కుక్కల వల్ల ప్రజలకు హాని జరుగకుండా ఉండేం దుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఐదు శస్త్రచికిత్స కేంద్రాల ద్వారా ఏటా దాదాపు  80 వేల కుక్కలకు టీకాలు, నెలకు రెండువేల కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని అంటున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే అధికారుల మాటలపై సందేహాలు రేకెత్తేలా ఉంది. శస్త్ర చికిత్సల సంగతి అటుం చి... వాటిని దూర ప్రాంతాలకు తరలించాలని జనం ముక్తకంఠంతో కోరుతున్నారు. గడచిన పదేళ్లలో నగరంలో కుక్కకాటుతో దాదాపు 40 మంది మృతి చెందారు. ఏటా దాదాపు ఐదు వేల మంది కుక్కకాటు బారిన పడుతున్నారు.
     
    కుళ్లిన ఆహార పదార్థాల వల్లనేనట...

    గ్రేటర్‌లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్తకుప్పలు.. వాటిలోని కుళ్లిపోయిన ఆహార పదార్థాలను కుక్కలు తినడం వల్ల ప్రకోపం పెరిగి ప్రజలపై దాడి చేస్తాయని పశువైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాక ఆగస్టు-నవంబర్ నెలల మధ్య కుక్కల సంతానోత్పత్తి సమయమైనందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గతంతో పోలిస్తే గ్రేటర్‌లో కుక్కల బెడద తగ్గిందని అధికారులు చెబుతుండగా... నెలకు దాదాపు రెండువేల మంది నారాయణగూడలోని ఐపీఎంకు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఐపీఎంకు వచ్చేవారిలో నగర ప్రజలే కాక పొరుగు జిల్లాల వారు కూడా ఉంటున్నారని అధికారులు అంటున్నారు.   
     
    రోజూ ఫిర్యాదులు...
    తమ ప్రాంతంలో కుక్కలు తిరుగుతున్నాయంటూ రోజుకు వంద మందికి పైగా జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేస్తున్నారు. కుక్క కాటు బాధితుల సంఖ్య కూడా రోజుకు వందకుపైగానే ఉంటున్నట్టు ఓ అధికారి చెప్పారు.
         
    గ్రేటర్‌లో ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల కుక్కలు ఉండవచ్చునని అంచనా.
         
    కుక్క క రిచిన వారికి అవసరమైన యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు నారాయణగూడలోని ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో అందుబాటులో ఉన్నాయని జీహెచ్‌ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.
         
    యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనల మేరకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు(స్టెరిలైజేషన్) ద్వారా మాత్రమే ప్రజలకు కుక్కల నుంచి హాని లేకుండా చేయాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్సల కేంద్రాలు ఆటోనగర్, అంబర్‌పేట, చుడీబజార్, జీడిమెట్ల, పటాన్‌చెరులలో ఉన్నాయి.
         
    మల్కాజిగిరిలో కుక్కల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అసిస్టెంట్  డెరైక్టర్ డాక్టర్ గోవర్థన్‌రెడ్డి చెప్పారు. అక్కడ నిత్యం తమ  విభాగానికి చెందిన రెండు వాహనాలు తిరుగుతున్నాయన్నారు.
     
    వీధి కుక్కలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను గ్రేటర్‌లోని  దిగువ నెంబర్లకు తెలియజేయవచ్చు.
         
    ఈస్ట్‌జోన్-9000554767, 9989930359
         
    సౌత్‌జోన్- 9989930358,
         
    సెంట్రల్‌జోన్-9704456521, 9989930356
         
    వెస్ట్‌జోన్-9000901937
         
    నార్త్‌జోన్-9704456520, 9989930397
     
    ఇదీ పరిస్థితి : సాక్షి, సిటీబ్యూరో: కుక్క కాటుకు సంబంధించి గత ఏడాది ఫీవర్ ఆస్పత్రిలో అత్యధికంగా 11621 కేసులు నమోదు కాగా, వీరిలో 23 మందికి రేబిస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదువేలకు పైగా కుక్కకాటు కేసులు నమోదు కాగా, పది మంది రేబిస్ బారిన పడ్డారు. ఇదే ఆస్పత్రిలో గురువారం 47 కేసులు కాగా, శుక్రవారం 28 కేసులు నమోదవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
     
    ఇవీ దుష్ఫలితాలు...

    కుక్క కాటు వల్ల వైరస్ కాలు నుంచి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది. రేబీస్ సోకిన వారిలో మొదటి దశలో జ్వరం, తల నొప్పి, వాంతులు, వంటి లక్షణాలు   కనిపిస్తాయి. పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించ లేకపోవడం, నోటిలోంచి నురుగ రావడం, మంచి నీరు తాగితే గొంతు పట్టేయడం, గాలి వీచినప్పుడు ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు రెండో దశలో కనిపిస్తాయి. ఇక మూడో దశలో పూర్తిగా కోమా లోకి వెళ్లిపోయి, రెండు మూడు రోజుల్లో మరణిస్తారు.
     
    ఈ జాగ్రత్తలు పాటించాలి

    వీధి కుక్కలను సాధ్యమైనంత వరకు నియంత్రించాలి.
         
    ఒక వేళ కుక్క కరిస్తే వెంటనే ధారగా కారుతున్న నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి.
         
    రక్తం కారుతున్నా...గాయంపై కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటివి పూయకూడదు.
         
    ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి, యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
         
    కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి.
         
    కుక్కలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
         
    వీధి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతంలో తిరగకపోవడమే మంచిది.
         
    ఇంట్లో ఉన్న కుక్కలకు ప్రతి మూడు మాసాలకు ఒకసారి తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement