జర్వాల గండం
ఎన్నడూ లేనివిధంగా జ్వరాల తీవ్రత విషమించింది. విషజ్వరాలు.. డెంగీతో జనం వణికిపోతున్నారు. జ్వరమొస్తేనే ప్రాణం పోతుందేమోననే భయాందోళనలు అలుముకున్నాయి. మంగళవారం ఒకేరోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జ్వరాలతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో జిల్లావ్యాప్తంగా జ్వరాలతో చనిపోయిన వారి సంఖ్య 35కు చేరింది. - సాక్షిప్రతినిధి, కరీంనగర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
పండుగకు ముందే యైటింక్లయిన్‌కాలనీ సమీపంలోని న్యూమారేడుపాక గ్రామంలో డెంగీతో నలుగురు ప్రాణాలు కోల్పోవటం విషాదం రేకెత్తించింది. పండుగ తర్వాతే అదే వరుస కొనసాగుతోంది. కోరుట్ల పట్టణంలో సోమ, మంగళ వారాల్లో.. ఒకేరోజు వ్యవధిలో వివిధ ఆసుపత్రుల్లో ముగ్గురు జ్వరాలతో మరణించారు. రోజుకు రెండు వందల మందికి పైగా జ్వరపీడితులు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొం దుతున్నారు.
గత రెండు వారాల్లో అత్యధికంగా కోరుట్ల నియోజకవర్గంలోనే పది మంది, రామగుండం నియోజకవర్గంలో ఏడుగురు జ్వరాల బారినపడి కన్నుమూశారు. జిల్లా కేంద్రంలో పాటు అన్ని పట్టణాలు, పల్లెల్లో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసి పోయాయి. బతుకమ్మ, దసరా పండుగలు... వరుసగా వచ్చిన సెలవు దినాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లన్నీ రోగులతో కిటకిటలాడాయి. శని, ఆదివారాల్లో వీకెండ్ విహారానికి వైద్యసేవలు బంద్ చేసే డాక్టర్లు సైతం వారం రోజులుగా రోగుల రద్దీతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 687 మంది అవుట్ పేషంట్లు చికిత్స పొందగా.. అందులో 96 మంది జ్వరపీడితులు ఇన్ పేషెంట్లుగా చేరారు. జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటే... వైద్య ఆరోగ్య శాఖ తేలిగ్గా తోసిపారేస్తోంది. అసలు డెంగీ మరణాలు, విష జ్వరాలతో ఎవరూ చనిపోలేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యమిస్తోంది. ప్రజలే వివిధ అనారోగ్య కారణాలతో చనిపోయారని కుంటిసాకులు వెతుకుతోంది. నియోజకవర్గం
మృతుల సంఖ్య
కోరుట్ల 10
జగిత్యాల 02
హుస్నాబాద్ 03
హుజురాబాద్ 01
పెద్దపల్లి 02
కరీంనగర్ 02
సిరిసిల్ల 01
గోదావరిఖని 07
చొప్పదండి 02
మానకోండూర్ 01
ధర్మపురి 04
మొత్తం 35