- ఎంజీఎంలో వైద్య సిబ్బంది కొరత తీర్చండి
- రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ
- ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన
- 29 వైద్యుల పోస్టులు ఖాళీ..
- పరికరాలున్నా.. అందని సేవలు
- మూడేళ్లుగా నిలిచిన గుండె శస్త్ర చికిత్సలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనాలపై కలెక్టర్ జి.కిషన్ స్పందించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే ఎంజీఎంను చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు.
ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిని కోరారు. వైద్య సేవల్లో అంతరాయంతో పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంజీఎం ఆస్పత్రిని 690 పడకల నుంచి వెయ్యి పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వివిధ కేటగిరీల్లో కలిపి మంజూరైన 291 పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు.
పోస్టులు భర్తీ చేయకపోవడంతో వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఈ నెల 19న జరిగిన ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ వైద్యులు, వైద్య సిబ్బంది కొరతపైనే ప్రధానంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
వైద్యులు లేక..మరణాలు
ఎంజీఎంలో వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పేద వర్గాలకు సంజీవనిగా ఉండాల్సిన ఎంజీఎంలో వైద్య సేవల్లో లోపాలు ఉంటున్నాయి. ఎంజీఎంలో 47 మంది వైద్యులకు గాను.. ఇప్పుడు 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్డియాలజీ, న్యూరోసర్జన్, వాస్కిలర్‌సర్జన్, ఎండ్రొకనాలజిస్ట్‌లు, ఇతర సాధారణ వైద్యులు లేరు. పేద ప్రజలకు రోగం వస్తే నయంకాని పరిస్థితి ఉంది. అసలే తక్కువ మంది వైద్యులు ఉన్నారంటే.. వీరిలో కొందరు రాజకీయ పలుకుబడితో డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారు.
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రేడియోథెరపీ, కృత్రిమ శ్వాస ఇచ్చి ప్రాణాలు నిలిపే వెంటిలేటర్లు, రక్త పరీక్షలు నిర్వహించే ఏబీజీ మిషన్ పని చేయకపోవడంతో సరైన వైద్య సేవలు అందడం లేదు. ప్రధానమైన కార్డియాలజీ(గుండె) విభాగం అధ్వానంగా ఉంది. పర్మినెంట్ కార్డియాలజీస్టును కేటాయించినా.. ఆయన డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. మూడేళ్లుగా గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి.
రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై ఎంతో మంది క్షతగాత్రులు నిత్యం ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి వెంటనే వైద్యచికిత్సలు చేయాల్సి ఉంటుంది. తలకు గాయాలైన వారికి శస్త్ర చికిత్సలు చేయాలంటే న్యూరోసర్జన్ తప్పని సరిగా ఉండాల్సిందే. ఎంజీఎం ఆస్పత్రిలో న్యూరోసర్జన్ వైద్యుడు లేకపోవడంతో ఎంతో మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.