అమ్మను చంపేసింది !
► దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి..
► కె.నరసాపురంలో విషాదఛాయలు
మృత్యుకుంట
ఔను అమ్మను మృత్యుకుంట మింగేసింది. బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడిపోయిన అమ్మ ప్రాణాలు వదిలేసింది. ఇద్దరు బిడ్డలను అనాథను చేసి వెళ్లిపోయింది. అమ్మకు ఏమైందో, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక ఆ పసి కూనలు అమాయక చూపులతో అందరినీ చూస్తూ ఉండిపోవడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. అయ్యో.. పాపం.. అంటూ సానుభూతి చూపారు. - పరిగి
పరిగి మండలం కె.నరసాపురానికి చెందిన వాల్మీకి రామచంద్ర భార్య అనిత(24) గ్రామ శివార్లలోని నీటి కుంటలో పడి ప్రమాదవశాత్తు శుక్రవారం మరణించారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన కుంట ఒడ్డునున్న బట్టలు ఉతికే క్రమంలో కాలుజారి కుంటలో పడిపోయింది. ఆ తరువాత ఊపిరాడక ప్రాణాలు వదిలింది. అమ్మకు ఏమైంది.. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు సహా ఊరంతా నీటి కుంట వద్దకు చేరుకున్నారు. అందరి మధ్య నిర్జీవంగా ఉన్న తల్లిని చూస్తూ ఆమె ఇద్దరు బిడ్డలు ప్రసాద్(5), మారుతి(3) అందరి వైపు అమాయక చూపులు చూడటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తల్లికి ఏమైందో కూడా అర్థం కాక వారలా దిక్కులు చూస్తూ ఉండిపోయారు. అమ్మ ఎందుకు మాట్లాడటం లేదో, ఎందుకు తమను దగ్గరికి తీసుకోవడం లేదో అర్థం కాక ఆ చిన్నారులు ఏడుపు మొహంతో ఉండిపోవడం చూసిన వారి హృదయాలు బరువెక్కాయి.
ఇక అమ్మ తిరిగి రాదనే విషయం ఆ పిల్లలకు ఎలా చెప్పాలో అర్థం కాక అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న సర్పంచ్ మైలారప్ప, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి తదితరులు అనిత మృతదే హాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.