Sad shadows
-
అమ్మను చంపేసింది !
► దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి.. ► కె.నరసాపురంలో విషాదఛాయలు మృత్యుకుంట ఔను అమ్మను మృత్యుకుంట మింగేసింది. బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడిపోయిన అమ్మ ప్రాణాలు వదిలేసింది. ఇద్దరు బిడ్డలను అనాథను చేసి వెళ్లిపోయింది. అమ్మకు ఏమైందో, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక ఆ పసి కూనలు అమాయక చూపులతో అందరినీ చూస్తూ ఉండిపోవడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. అయ్యో.. పాపం.. అంటూ సానుభూతి చూపారు. - పరిగి పరిగి మండలం కె.నరసాపురానికి చెందిన వాల్మీకి రామచంద్ర భార్య అనిత(24) గ్రామ శివార్లలోని నీటి కుంటలో పడి ప్రమాదవశాత్తు శుక్రవారం మరణించారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన కుంట ఒడ్డునున్న బట్టలు ఉతికే క్రమంలో కాలుజారి కుంటలో పడిపోయింది. ఆ తరువాత ఊపిరాడక ప్రాణాలు వదిలింది. అమ్మకు ఏమైంది.. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు సహా ఊరంతా నీటి కుంట వద్దకు చేరుకున్నారు. అందరి మధ్య నిర్జీవంగా ఉన్న తల్లిని చూస్తూ ఆమె ఇద్దరు బిడ్డలు ప్రసాద్(5), మారుతి(3) అందరి వైపు అమాయక చూపులు చూడటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తల్లికి ఏమైందో కూడా అర్థం కాక వారలా దిక్కులు చూస్తూ ఉండిపోయారు. అమ్మ ఎందుకు మాట్లాడటం లేదో, ఎందుకు తమను దగ్గరికి తీసుకోవడం లేదో అర్థం కాక ఆ చిన్నారులు ఏడుపు మొహంతో ఉండిపోవడం చూసిన వారి హృదయాలు బరువెక్కాయి. ఇక అమ్మ తిరిగి రాదనే విషయం ఆ పిల్లలకు ఎలా చెప్పాలో అర్థం కాక అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న సర్పంచ్ మైలారప్ప, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి తదితరులు అనిత మృతదే హాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
ఆశ తీరకుండానే.. అనంతలోకాలకు!
► పొలం దున్నడానికి వెళ్లి యువకుడి మృత్యువాత ► పెద్దగూడెంలో విషాదఛాయలు ఆ యువకుడు కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. నాలుగురోజుల క్రితమే సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు.. మొదటి కిరాయిగా ఓ పొలంలో వాహనంతో దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు దాని కిందే పడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.. ఈ సంఘటతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వనపర్తి రూరల్ : మండలంలోని పెద్దగూడేనికి చెందిన ముష్టి కొండన్న (29) వృత్తిరీత్యా డ్రైవర్. ఈయనకు భార్య రాధతోపాటు మూడేళ్ల కుతూరు ఉంది. కొన్నేళ్లుగా వేరేవారి ట్రాక్టర్‌పై పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా, నాలుగు రోజుల క్రితమే ప్రైవేట్ ఫైనాన్స లో రూ.7.5 లక్షలు అప్పు తీసుకుని సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు. మొదటి కిరాయిగా ఆదివారం ఉదయం శివారులోని ఓ రైతు పొలంలో దుక్కి దున్నడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అక్కడ రాయిపై నుంచి వాహనం ఎక్కడంతో దాని టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకుని బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. హుటాహుటిన అనంతరం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ శంకర్‌నాయక్, సర్పంచ్ జానకీకొండన్న, ఎంపీటీసీ సభ్యుడు నరసింహగౌడ్ తదితరులు పరామర్శించారు. -
నా మనవడికి ఏమయ్యిందయ్యా?
దేవరాయబొట్లవారిపాలెం(పెదకాకాని): పెళ్లయిన 26 రోజులకే రోడ్డు ప్రమాదంలో నూతన వధూవరులకు నూరేళ్ళు నిండటంతో దేవరాయబొట్లవారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. మండల పరిధిలోని వెంకటకృష్ణాపురం గ్రామ పరిధిలోని దేవరాబొట్లవారిపాలెం 100 ఇళ్ళు, 400 మంది జనాభా ఉన్న చిన్న గ్రామం. ఇటీవల పెళ్ళైన నూతన వధూవరులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్త తెలియగానే గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన కొండా చిన నరసింహారావు, కాశులమ్మ దంపతులకు నలుగురు సంతానం. కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇద్దరు కూతుళ్లకు గతంలోనే వివాహమైంది. మూడవ సంతానం పెదబాబు. నాలుగో సంతానం రామారావు. పెదబాబు తండ్రికి తోడుగా వ్యవసాయ కూలీ పనులకు వెళుతుండగా రామారావు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. పెదబాబుకు ఏప్రిల్ 22న చిలకలూరిపేటకు చెందిన నీలిమతో వివాహమైంది. నూతన దంపతులు అత్తగారింటికి వెళ్లేందుకు బుధవారం చిలకలూరిపేట బయలు దేరారు. మార్గం మధ్యలో గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.గ్రామంలోని పెద్దలు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అంతా గుంటూరు మార్చురీకి తరలివెళ్లారు. మృతుడు చినబాబు అమ్మమ్మ ఏం జరిగిందో తెలియక ఇంటికి వచ్చిన వారందరినీ నా మనమడికి ఏమయ్యిందయ్యా అంటూ అందోళనగా అడుగుతోంది. పెళ్ళైన 26 రోజులకే నూరేళ్ళు నిండాయా అంటూ స్థానికులు కన్నీటి పర్వమయ్యారు.