నా మనవడికి ఏమయ్యిందయ్యా?
దేవరాయబొట్లవారిపాలెం(పెదకాకాని): పెళ్లయిన 26 రోజులకే రోడ్డు ప్రమాదంలో నూతన వధూవరులకు నూరేళ్ళు నిండటంతో దేవరాయబొట్లవారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. మండల పరిధిలోని వెంకటకృష్ణాపురం గ్రామ పరిధిలోని దేవరాబొట్లవారిపాలెం 100 ఇళ్ళు, 400 మంది జనాభా ఉన్న చిన్న గ్రామం. ఇటీవల పెళ్ళైన నూతన వధూవరులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్త తెలియగానే గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన కొండా చిన నరసింహారావు, కాశులమ్మ దంపతులకు నలుగురు సంతానం. కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇద్దరు కూతుళ్లకు గతంలోనే వివాహమైంది. మూడవ సంతానం పెదబాబు. నాలుగో సంతానం రామారావు. పెదబాబు తండ్రికి తోడుగా వ్యవసాయ కూలీ పనులకు వెళుతుండగా రామారావు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.
పెదబాబుకు ఏప్రిల్ 22న చిలకలూరిపేటకు చెందిన నీలిమతో వివాహమైంది. నూతన దంపతులు అత్తగారింటికి వెళ్లేందుకు బుధవారం చిలకలూరిపేట బయలు దేరారు. మార్గం మధ్యలో గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.గ్రామంలోని పెద్దలు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అంతా గుంటూరు మార్చురీకి తరలివెళ్లారు. మృతుడు చినబాబు అమ్మమ్మ ఏం జరిగిందో తెలియక ఇంటికి వచ్చిన వారందరినీ నా మనమడికి ఏమయ్యిందయ్యా అంటూ అందోళనగా అడుగుతోంది. పెళ్ళైన 26 రోజులకే నూరేళ్ళు నిండాయా అంటూ స్థానికులు కన్నీటి పర్వమయ్యారు.