ఆశ తీరకుండానే.. అనంతలోకాలకు!
► పొలం దున్నడానికి వెళ్లి యువకుడి మృత్యువాత
► పెద్దగూడెంలో విషాదఛాయలు
ఆ యువకుడు కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. నాలుగురోజుల క్రితమే సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు.. మొదటి కిరాయిగా ఓ పొలంలో వాహనంతో దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు దాని కిందే పడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.. ఈ సంఘటతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
వనపర్తి రూరల్ : మండలంలోని పెద్దగూడేనికి చెందిన ముష్టి కొండన్న (29) వృత్తిరీత్యా డ్రైవర్. ఈయనకు భార్య రాధతోపాటు మూడేళ్ల కుతూరు ఉంది. కొన్నేళ్లుగా వేరేవారి ట్రాక్టర్‌పై పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా, నాలుగు రోజుల క్రితమే ప్రైవేట్ ఫైనాన్‌స లో రూ.7.5 లక్షలు అప్పు తీసుకుని సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు. మొదటి కిరాయిగా ఆదివారం ఉదయం శివారులోని ఓ రైతు పొలంలో దుక్కి దున్నడానికి వెళ్లాడు.
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అక్కడ రాయిపై నుంచి వాహనం ఎక్కడంతో దాని టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకుని బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. హుటాహుటిన అనంతరం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ శంకర్‌నాయక్, సర్పంచ్ జానకీకొండన్న, ఎంపీటీసీ సభ్యుడు నరసింహగౌడ్ తదితరులు పరామర్శించారు.