సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన చిన్నారి ఇందు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. కాగా ఇందు పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించిన వైద్యులు.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా..? తనే ఆడుకుంటూ పడిందా అనేది తేలాల్సి ఉంది.
దమ్మాయిగూడలో ఉద్రిక్తత
దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు మృతిపై స్పఫ్టత ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగింది?
మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్‌మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
దీంతో స్కూల్ హెడ్‌మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ‍్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment