ప్రాణమా! వీడ్కోలు! | Fear of death | Sakshi
Sakshi News home page

ప్రాణమా! వీడ్కోలు!

Published Thu, Oct 30 2014 10:49 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

Fear of death

మృత్యువు తరుముతుంటే భయంతో దాక్కుంటారు దాదాపు అందరూ. ఆవేశంలో అనాలోచితంగా ప్రాణాలు తీసుకుంటారు కొందరు.  కానీ అమెరికాకు చెందిన బ్రిటనీ మేనార్డ్ ఈ రెండూ చేయలేదు. తనను కబళిస్తానన్న మృత్యువును ముందుగానే ఆహ్వానించింది. జీవించాలనే ఆశ ఉన్నా... జీవించే అవకాశం లేక నిండు జీవితాన్ని అంతం చేసు కోవాలని నిర్ణయించుకుంది. ఆమెది ఆవేశంలో చేసుకుంటోన్న ఆత్మహత్య కాదు. అయినవాళ్లకి తనవల్ల ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం, ఆత్మ శాంతి కోసం చేసుకుంటోన్న సగౌరవ స్వీయహత్య!
జనవరి 1, 2014.  నిదుర తెరలను తొలగించుకుని బలవంతంగా కళ్లు తెరిచింది ఇరవై తొమ్మిదేళ్ల బ్రిటనీ మేనార్డ్. ఇంకా మత్తుగానే ఉన్న కన్నుల ముందు ఏదో రూపం అస్పష్టంగా కదలాడింది. ఆమెకు తెలుసు అక్కడున్నది ఎవరో. అందుకే ఆమె పెదవులు ఆనందంగా విచ్చుకున్నాయి. మరుక్షణం ఆమె నుదుటి మీద ఓ వెచ్చని స్పర్శ! ''హ్యాపీ న్యూ ఇయర్ డియర్'' అంటూ ఓ తీయని స్వరం చెవులకు మంద్రంగా సోకింది. ఆ స్పర్శ, ఆ స్వరం... ఆమెకెంతో ఇష్టమైన వ్యక్తివి. ఆమె భర్త... డ్యాన్ డియాజ్‌వి! ''థాంక్యూ డ్యాన్... విష్ యూ ద సేమ్'' అంది నవ్వుతూ.
 
బ్రిటనీకి న్యూ ఇయర్ డే అంటే చాలా ఇష్టం. పాతకు గుడ్‌బై చెప్పి కొత్తకు స్వాగతం పలికే ఆ రోజును ఎప్పుడూ ప్రత్యేకంగా జరుపు కుంటుంది. ఈసారి కూడా ఎంతో సంతోషంగా గడపాలనుకుంది. అయితే మధ్యాహ్నం కావస్తుండగా... ఆమెకు ఉన్నట్టుండి తలనొప్పి మొదలైంది. 'ఎందుకో ఈ మధ్య తరచు తలనొప్పి వస్తోంది. ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గినట్టే ఉంటోంది కానీ మళ్లీ మామూలే. ఇవాళ కూడా రావాలా ఈ తలనొప్పి'  విసుక్కుంటూ, పెయిన్ కిల్లర్ వేసుకుని మళ్లీ పనిలో పడింది. కానీ ప్రతి సారిలా ఈసారి నొప్పి తగ్గలేదు. అంతకంతకూ పెరిగి, తట్టుకోలేని స్థితికి చేరుకుంది. దాంతో హాస్పిటల్‌కు బయలుదేరింది బ్రిటనీ. కానీ ఆమెకి తెలీదు... తన జీవితాన్ని అల్లకల్లోలం చేసే భయంకరమైన నిజమొకటి త్వరలో తెలియనుందని!

 సారీ మిసెస్ డియాజ్... మీకు బ్రెయిన్ క్యాన్సర్... అశనిపాతంలా తాకింది బ్రిటనీని ఆ మాట! కలల కోటలు కళ్ల ముందే కూలిపోతున్న ఫీలింగ్. వెంటనే సర్జరీకి ఏర్పాట్లు జరిగాయి. మెదడులో ఉన్న ట్యూమర్‌ని ఆపరేషన్ చేసి తొలగించారు వైద్యులు. కానీ దురదృష్టం... మూడు నెలలు తిరిగేసరికి ట్యూమర్ మళ్లీ వచ్చేసింది. ఈసారి దాన్ని నియంత్రించడం తమ వల్ల కాదని డాక్టర్లకు తెలిసిపోయింది. చివరి ప్రయత్నంగా రేడియేషన్ చేద్దామన్నారు. అయినా ప్రాణం నిలుస్తుందా అంటే... ఆ నమ్మకం కూడా ఇవ్వలేమన్నారు డాక్టర్లు. ఇక ఏం చేసినా మరణం తప్పదని, ఆ మరణం తనను చేరేలోపు నరక యాతన పడక తప్పదని తెలియగానే... ఎవరూ ఊహించని ఒక కఠోర నిర్ణయాన్ని తీసుకుంది బ్రిటనీ. మరణానికి తానే ఆహ్వానం పలకాలనుకుంది. దానికోసం ఆమె ఎంచుకున్న మార్గం... డెత్ విత్ డిగ్నిటీ! అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థుల కోసం ఏర్పాటు చేసిన చట్టమిది. నరకయాతన పడి మరణించ కుండా, అంతా బాగున్నప్పుడే అనాయాసంగా, హుందాగా చనిపోవడానికి వీలు కల్పించే వరం! సరిగ్గా ఆ వరాన్నే కోరుకుంది బ్రిటనీ. వ్యాధి ముదిరిపోయి, ఒళ్లు గుల్ల అయిపోయి, తీసుకుని తీసుకుని చనిపోయే దుర్భర పరిస్థితి తనకి వద్దు. తనవాళ్ల మధ్య, తనను ప్రేమించేవాళ్ల చేరువలో ప్రశాంతంగా కన్నుమూయాలి. ఏ నొప్పీ లేకుండా ప్రాణాలు వదిలేయాలి. అందుకే తన మరణానికి తానే ముహూర్తం పెట్టుకుంది. ఆ ముహూర్తం ఎప్పుడో కాదు... రేపే (నవంబర్1). ఈ రోజు తన భర్త పుట్టిన రోజును ఘనంగా సెలెబ్రేట్ చేసి, రేపు తన ఇంట్లో.. తల్లి, తండ్రి, భర్త, స్నేహితుల మధ్య తనువు చాలించనుంది!
 
బ్రిటనీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యమైనది కాదు. జీవించాలనే కోరిక ఉన్నా, విధి లేకనే తన జీవితాన్ని అంతం చేసుకుంటోంది. అది ఎంత కష్టతరమైన, దుఃఖపూరితమైన స్థితో తెలియంది కాదు. ఆమె పరిస్థితే అంత వేదనాభరితమంటే...  ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి అంతకంటే దయనీయం. నిన్నటి వరకూ నవ్వుతూ తిరిగిన మనిషి, తమకెంతో ప్రియమైన మనిషి తమ కళ్లముందే ప్రాణాలు తీసుకుంటుంటే... నిస్స హాయంగా నిలబడి చూస్తూ ఉండటంకన్నా బాధాకరస్థితి మరొకటి ఉండదు. మనసుల్ని మెలిపెట్టే ఆ భయంకర వేదనను తట్టుకునే శక్తిని భగవంతుడే వారికి ప్రసాదించాలి. లేదంటే తనవారి కోసమైనా మరి కొన్నాళ్లు జీవించాలన్న కోరికను బ్రిటనీ మనసులో కలిగించాలి. ఆమె జీవితాన్ని మరికొన్నాళ్లు పొడిగించాలి!!  
 
నాకు చనిపోవాలని లేదు. కానీ చనిపోక తప్పని పరిస్థితి. నేను ఆత్మహత్య చేసుకోవడం లేదు. కృశించి కన్నుమూయకుండా, మంచాన పడి నా వాళ్లతో సేవ చేయించుకోకుండా... అంతా బాగున్నప్పుడే గౌరవంగా, ప్రశాంతంగా వెళ్లిపోతున్నాను... అంతే! ఇవే నా చివరి మాటలు. ఇక మీదట నేను ఎవరితోనూ మాట్లాడను. కన్నుమూసే వరకూ మా వాళ్లతోనే సంతోషంగా గడుపుతాను. బ్రిటనీ, 2014 అక్టోబర్ 22.
 
డెత్ విత్ డిగ్నిటీ చట్టం క్రూరంగా అనిపిస్తోందని, రద్దు చేయమని అంటున్నారు. ఎందుకు రద్దు చేయాలి? మరణ యాతన నుంచి విముక్తి కల్పించే ఈ చట్టం అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని దేశాల్లోనూ కూడా ఉండాలి. అందుకే నేను నా పేరుతో బ్రిటనీ మేనార్డ్ ఫండ్ ఏర్పాటు చేశాను. దీనిలోని ప్రతి పైసానీ డెత్ విత్ డిగ్నిటీ చట్టాన్ని ప్రపంచమంతా విస్తరింపజేయ డానికి ఉపయోగించాలి. నాలాంటి వాళ్లందరికీ ప్రశాంతంగా చనిపోయే అవకాశాల్ని కల్పించాలి. ఇదే నా చివరి కోరిక!
బ్రిటనీ మేనార్డ్ కొద్ది రోజుల క్రితం చెప్పిన మాటలు

 
మనదేశంలో ప్యాసివ్ యుథనేషియాని 2011లో చట్టబద్ధం చేశారు. దీని ప్రకారం ఏళ్లపాటు అచేతనావస్థలో ఉండి అవస్థ పడుతున్నవారికి లైఫ్ సపోర్ట్‌ను తొలగించవచ్చు. ఇదే కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్). అయితే డెత్ విత్ డిగ్నిటీ ఇందుకు భిన్నం. బాధాకరమైన మరణం తప్పదని తేలిన రోగులు తమంతట తాముగా ముందే ప్రాణాలు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుందీ చట్టం. అమెరికాలోని ఆరెగాన్, వాషింగ్టన్, వెర్మాంట్ రాష్ట్రాలలో మాత్రమే ఉందిది. వీటిలో ఏదో ఒక రాష్ట్రంలో రోగి నివసిస్తున్నట్టు ఆధారాలు చూపించాలి. తర్వాత ఆ వ్యక్తిని సైకియాట్రిస్టు దగ్గరకు పంపిస్తారు. కౌన్సెలింగ్ ద్వారా రోగి మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు సైకియాట్రిస్ట్. అప్పటికీ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటే, నొప్పి తెలియకుండా ప్రాణాలు తీసే ట్యాబ్లెట్లను (వంద ట్యాబెట్లను నీటిలో కరిగించి తీసుకోవాలి) సూచిస్తారు. అయితే మందు ఆ వ్యక్తే స్వయంగా తీసుకోవాలి తప్ప వేరెవ్వరూ కలిపి ఇవ్వకూడదు!
 
భార్య చివరి కోరికను తీర్చడం కోసం డెత్ విత్ డిగ్నిటీ చట్టం అమలులో ఉన్న ఆరెగాన్ రాష్ట్రంలో స్థిరపడటానికి నిర్ణయించుకున్నాడు డ్యాన్. అక్కడ ఆస్తులు కొన్నాడు. లెసైన్సులు సంపాదించాడు. ప్రభుత్వం కోరిన అన్ని డాక్యుమెంట్లనూ సమర్పించాడు. బ్రిటనీని సంతోషంగా ఉంచుతానని పెళ్లి సమయంలో ప్రమాణం చేశాను. సంతోషంగా మరణించ నివ్వు అని అడిగితే ఎలా కాదనగలను  అంటున్నాడు డ్యాన్. ఇవన్నీ చేయడానికి అతడు ఎంత మథనపడి ఉండాలి? మనసును ఎంతగా చంపుకుని ఉండాలి! హ్యాట్సాఫ్ డ్యాన్!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement