లండన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్‌లో రెండేళ్లలో ఏకంగా 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికారిక లెక్కల్లోకి రాని కోవిడ్ మృతుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని పేర్కొంది. 2020 జనవరి–2021 డిసెంబర్ మధ్య మరణించిన వారి సంఖ్య కేంద్రం వెల్లడించిన లెక్కల కంటే ఏకంగా 8 రెట్లు ఎక్కువని తెలిపింది. 2021 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 22.3 శాతం భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది.
రెండేళ్ల కాలంలో కరోనా మృతులపై 191 దేశాల గణాంకాలతో లాన్సెట్ నివేదిక రూపొందించింది. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 59.4 లక్షల మంది కరోనాకు బలైనట్టు అధికారిక గణాంకాలున్నాయి. కానీ వాస్తవానికి 1.82 కోట్ల మంది మరణించినట్టు అధ్యయనంలో తేలినట్టు లాన్సెట్ వెల్లడించింది. భారత్‌లో కరోనాతో రెండేళ్లలో 4.89 లక్షల మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించిందని, కానీ వాస్తవానికి 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు తేలిందని వివరించింది. భారత్ తర్వాత అమెరికా (11.3 లక్షల మరణాలు), రష్యా (10.7 లక్షలు), మెక్సికో (7.98 లక్షలు), బ్రెజిల్ (7.36 లక్షలు), ఇండోనేసియా (7.36 లక్షలు), పాకిస్తాన్ (6.64 లక్షలు) ఉన్నట్టుగా వివరించింది.
తప్పుడు సమాచారం: కేంద్రం
లాన్సెట్ లెక్కల్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆ సంస్థ విశ్లేషణలు, అంచనాలు ఊహాజనితాలని విమర్శించింది. కరోనా మరణాల లెక్కలు సేకరించే పద్ధతిలో తప్పులు దొర్లాయని ఆ నివేదిక రచయితలే అంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment