- సింగరేణి సీఎండీ వాహనాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తుల యత్నం
- వెళ్లిపోయిన సీఎండీ...
- గంట పాటు రోడ్డుపై బైఠాయింపు
టేకులపల్లి : కోయగూడెం ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల వలన వచ్చే దుమ్ము, ధూళితో తమ ప్రాణాలు పోతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి సీఎండీ శ్రీధర్ వాహనాన్ని సోమవారం పెట్రాంచెలక స్టేజీ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. సీఎండీ కేఓసీని సందర్శించి తిరిగి వస్తుండగా గ్రామస్తులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే వేగంగా వాహనం వారిని దాటి వెళ్లిపోవడంతో వెనుక వస్తున్న డెరైక్టర్లు,మిగిలిన అధికారుల వాహనాలను అడ్డుకున్నారు.
రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్‌రావు, ఎంపీపీ భూక్య లక్ష్మి, సొసైటీ అధ్యక్షులు వాంకుడోత్ పూన్యా, కోయగూడెం సర్పంచ్ పూనెం సురేందర్ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సైలు బత్తుల సత్యనారాయణ, ముత్తా రవికుమార్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. కానీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంట పాటు ఆందోళన కొనసాగించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆందోళన ఉధృతం అవుతుండటంతో పోలీసులు, కేఓసీ పీఓ అభ్యర్ధన మేరకు సింగరేణి డెరైక్టర్లు కారు దిగి వచ్చి వారితో మాట్లాడారు.
వారం రోజుల్లో పెట్రాంచెలక స్టేజీ నుంచి టేకులపల్లి రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డి ప్రసాద్, గణితి కోటేశ్వరరావు, ఎండీ రాసుద్దీన్, నోముల భానుచందర్, జమీల్, శ్రీనివాస్, ప్రకాశ్, శంకర్, మారుతీరావు,రెడ్యానాయక్ పాల్గొన్నారు.