Rajendra Kumar
-
లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నీలేష్ , గోపాల్, డాక్యా, రాజేందర్లు ఈ నెల 4న రాత్రి హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసినప్పుడు వారిని మరో ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలతో గుర్తించారు. వారిని నవాబ్‌పేట్, షాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్గా నిర్ధారించారు. డాక్యా, రేణుకల విచారణలోనూ ఇదే విషయం రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ అభ్యర్థులిద్దరూ ప్రశ్నపత్రాన్ని రూ.18 లక్షలకు కొనేందుకు డాక్యా, ఇతరులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.10 లక్షల వరకు చెల్లించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌లోని సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య... ప్రశాంత్, రాజేంద్రకుమార్లతోపాటు పలువురు ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో దళారిగా వ్యవహరించాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి ఆధారాలు లభించాక అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తోంది. మరోవైపు గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల విచారణ కొనసాగుతోంది. ఆదివారం మరో 20 మంది అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు విచారించిన వారి సంఖ్య 50 దాటింది. అడ్డదారి తొక్కి.. అడ్డంగా బుక్కయ్యి.. షాద్‌నగర్ రూరల్: సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన రాజేంద్రకుమార్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నేరేళ్ల చెరువు గ్రామం. నిరుపేదలైన లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ దంపతుల నలుగురు సంతానంలో అతను పెద్ద కొడుకు. రాజేంద్రకుమార్ కొన్నేళ్లు ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం అప్పులు చేసి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే కచ్చి తంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడంతోపాటు ఇతరుల వద్ద అప్పు చేసి రూ.5 లక్షలకు డాక్యా నాయక్ ద్వారా ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ బండారాన్ని సిట్ నిగ్గుతేల్చడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 8 గంటలపాటు నిందితుల విచారణ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కోర్టు అదనపు కస్టడీకి అనుమతించడంతో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారిని ప్రశ్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం నుంచి సీసీఎస్‌కు తరలించారు. సోమ, మంగళవారాల్లోనూ వారిని విచారించనున్నారు. -
‘మరో మూడేళ్లలో పోలవరం పూర్తి’
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో మూడేళ్ళు పడుతుందని ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో రాజేంద్ర కుమార్ జైన్ అన్నారు. కాఫర్ డ్యాం పాక్షికంగానే పూర్తైందని పేర్కొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం ముగిసన నేపథ్యంలో రాజేంద్ర కుమార్ జైన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... కాఫర్ డ్యాం రక్షణ పనుల పురోగతి, వరద అంచనా వ్యవస్థలపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల వరదను అంచనా వేస్తున్నామని...దీని వలన కాఫర్ డ్యాంకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అయితే వరదలు రాకముందే పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్తున్నామని తెలిపారు. ఇంకా ఆడిట్ జరుగుతూనే ఉంది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ. 6,700 కోట్లు విడుదలయ్యాయని సీఈవో రాజేంద్ర కుమార్ జౌన్ పేర్కొన్నారు. నిధుల కోసం రాష్ట్రం నుంచి కేంద్రానికి బిల్లులు పంపే విషయంలో కొన్ని ఫార్మాలిటీస్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయంపై కేంద్రం ఆడిట్ చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్ అండ్ ఆర్ కింద రూ. 1300 కోట్ల వ్యయంపై ఇంకా ఆడిట్ జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచడంపై కేంద్ర పరిధిలోని ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని.. ఈ విషయంపై ఇప్పటికే ఒక మీటింగ్ కూడా జరిగిందని తెలిపారు. పెరిగిన అంచనా వ్యయాలపై మరిన్ని వివరాలు ఇవ్వాలని ఈ కమిటీ రాష్ట్రాన్ని కోరినట్లు వెల్లడించారు. -
సీఎంను ఇరికించాలని ఒత్తిడి చేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను ఇరికించాల్సిందిగా సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, ఆత్మహత్యకు పాల్పడిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీకే బన్సాల్ కుటుంబాన్ని ఇలాగే వేధించారని ఆరోపించారు. ముందస్తుగా పదవీవిరమణ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఆయన ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ విషయాలను ప్రస్తావించారు. అవినీతి కేసులో కేజ్రీవాల్‌కు ప్రమేయం ఉన్నట్టు వాంగ్మూలం ఇస్తే కేసు నుంచి తన పేరు తొలగిస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్టు రాజేంద్ర కుమార్ వెల్లడించారు. సీబీఐ అధికారుల వేధింపులు భరించలేకే బన్సాల్ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని లేఖలో ప్రస్తావించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'సీబీఐ తన కార్యాలయంపై దాడి చేసింది. కేసులో నన్ను ఇరికించాల్సిందిగా అధికారిని ఒత్తిడి చేసింది. మోదీజీ మేమంటే ఎందుకింత భయపడుతున్నారు?' అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారనడానికి రాజేంద్ర కుమార్ వ్యాఖ్యలే నిదర్శనమని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలపై తొమ్మిది సీబీఐ కేసులున్నాయని, మంత్రి సత్యేంద్ర జైన్ త్వరలో అరెస్ట్ చేస్తారని మాట్లాడుకుంటున్నారని చెప్పారు. గతేడాది జూలైలో ఓ అవినీతి కేసులో రాజేంద్ర కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా రాజేంద్ర కుమార్ ఆరోపణలను సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని వివరణ ఇచ్చారు. -
యువతిని స్క్రూడ్రైవర్లతో పొడిచి చంపారు..
గుర్తుతెలియని యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బెంగుళూరు నగరంలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. తుమకూరు- బెంగళూరు నాలుగో నంబర్ జాతీయ ర హదారిలోని హనుమంతపుర గేట్ వద్ద యువతి మృతదేహం కన్పించడంతో ఓ వ్యక్తి డాబస్‌పేటే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డీవైఎస్పీ రాజేంద్రకుమార్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతి టీషర్ట్, ఫ్యాంటు ధరించి ఉందని, వయసు 20-22 ఏళ్లు ఉంటుందని, మృతదేహం రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తెల్లవారుజామున జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. స్క్రూ డ్రైవర్లతో పొడిచి, రాడ్లతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. యువతి అత్యాచారానికి గురైనట్లు ప్రాథమికంగా తేలిందని వైద్యులు తెలిపారు. పరిచయస్తులే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక కిడ్నాప్ చేసి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
రాజేంద్ర కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజేంద్ర కుమార్ తరపున లంచాలు తీసుకున్నట్టు ఆయన సన్నిహితుడు అశోక్ కుమార్ ఒప్పుకున్నాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయన తరపున భారీగా లంచాలు అందుకున్నట్టు చెప్పాడని తెలిపాయి. లంచం కేసులో రాజేంద్ర కుమార్ ప్రమేయంపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేట్టారు. మరోవైపు రాజేంద్ర కుమార్ ను ముఖ్య కార్యదర్శి నుంచి సస్పెండ్ చేసినట్టు ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఎవరైనా 48 గంటలకు మించి పోలీసు కస్టడీలో ఉంటే ఆ అధికారిని సస్పెండ్ చేయాలని చట్టాలు చెబుతున్నాయని తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ సహా ఐదుగురిని 5 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మంగళవారం సీబీఐ కోర్టు అంగీకరించింది. ఈ ఐదుగురిని సోమవారం సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో డిప్యూటీ సెక్రటరీ తరుణ్ శర్మ, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. -
కేజ్రీవాల్ కు షాక్
న్యూఢిల్లీ: హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నరేంద్ర మోదీ సర్కారు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో రాజేంద్ర కుమార్ తో పాటు మరో నలుగురిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో గతేడాది ఢిల్లీ సెక్రటేరియట్ లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. తమ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు ఢిల్లీ సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ తీసుకెళ్లడంపై అప్పట్లో కేజ్రీవాల్ తప్పుబట్టారు. కక్ష సాధింపులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇదంతా చేయించారని ఆరోపించారు. రాజేంద్ర కుమార్ ఎటువంటి తప్పు చేయలేదని వెనుకేసువచ్చారు. రాజేంద్ర కుమార్ అరెస్ట్ పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయికి దిగజారిపోవడం తాను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. -
ఒకే రోజు మధిరలో మూడు ఆత్మహత్యలు
మధిరలో ఒకే రోజు మూడు ఆత్మహత్యా సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు..మధిర మండలం మాడుపల్లిలో రాజేంద్రకుమార్(27) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధిర పట్టణంలోని నడకవీధిలో జ్యోతిర్మయి(28) అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదు అని సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. మధిర మండలాఫీసు రోడ్డులో రామకృష్ణ(23) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'సీఎం ఆఫీస్' ఫైళ్ల అప్పగింతపై సందిగ్ధత
- దస్త్రాలు తిరిగిచ్చేలా సీబీఐని ఆదేశించాలని వాదించిన ఢిల్లీ సర్కార్ - లోతైన విచారణ అవసరమన్న హైకోర్టు న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 'ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు' కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రటరీ) రాజేంద్ర కుమార్ కార్యాలయం నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొంది. 'సీఎం ఆఫీస్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్లను సీబీఐ తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలా లేక విచారణ ముగిసేవరకు తనవద్దే ఉంచుకోవాలా? అనే ప్రశ్నకు జవాబు వెతకాల్సిఉంది' అని సోమవారం హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చేందుకు వీలుగా స్వాధీనం చేసుకున్న ఫైళ్ల కాపీలను తనకు అందించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదావేసింది. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించడం దేశవ్యాప్తంగా రాజకీయప్రకంపనలు సృస్టించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫైళ్లలో కీలక సమాచారం ఉందని, వెంటనే వాటిని తమకు అప్పగించాలని ఢిల్లీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించిన దరిమిలా విచారణ కొనసాగుతున్నది. -
కేజ్రీవాల్ కేబినెట్ మీటింగ్ ఫైల్స్ కూడా..
ఢిల్లీ: సీబీఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్‌కు సంబంధించిన దస్త్రాలను సైతం సీజ్ చేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. డీడీసీఏ ఫైల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ సీజ్ చేసిందన్నారు. సీబీఐ తమకు అవసరం లేనటువంటి ఫైళ్లను ఎందుకు స్వాధీనం చేసుకుందని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ నిర్వహించిన దాడులతో కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం డీడీసీఏ పనితీరుపై దర్యాప్తు జరుపుతుండటం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి భయం కలిగిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అరుణ్ జైట్లీ రాజ్యసభలో సీబీఐ దాడులపై చేసిన ప్రకటన, సభను తప్పుదోవ పట్టించేలా ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజేంద్ర కుమార్ ఆఫీస్‌పై జరిగిన దాడులు కేవలం తనను లక్ష్యంగా చేసుకొనే జరిగాయని అన్నారు. -
'సోదాలకు ఇది సరైన సమయం కాదు'
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి ధిక్కారస్వరం వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయంపై సీబీఐ దాడులు చేయడాన్ని తప్పుపట్టారు. సీబీఐ సోదాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. దాడులు చేయాల్సిందిగా ఎవరు సలహా ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో టైమ్ చాలా ముఖ్యమని, దాడులు చేసేందుకు ఇది కచ్చితంగా తగిన సమయం కాదని చెప్పారు. కేజ్రీవాల్‌కు పాపులారిటీనే కాదు మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అంటూ శత్రుఘ్న సిన్హా ప్రశంసించారు. కాగా సీబీఐ దాడుల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై కేజ్రీవాల్ వాడిన భాషను శత్రుఘ్న సిన్హా తప్పుపట్టారు. మోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ నిందించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు చేయడంతో ఆప్, బీజేపీ నాయకుల మధ్య మాటలయుద్ధం ముదిరింది. -
ఉప్పందించింది ఆమ్ ఆద్మీ పార్టీ మనిషే!
సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్ అవినీతి గురించి సీబీఐకి ఉప్పందించింది ఎవరో బయటివాళ్లు కారు.. స్వయానా ఆమ్ ఆద్మీ పార్టీ మనిషే. ఆయన పేరు ఆశిష్ జోషి. ఆప్ ప్రభుత్వం ఆయనను ఢిల్లీ డైలాగ్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. ఇండియన్ పోస్ట్ అండ్ టెలికం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ అధికారి అయిన ఆశిష్.. రాజేంద్రకుమార్ అవినీతిపై తొలుత ఏసీబీ చీఫ్ ఎంకే మీనాకు ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదును చూసిన ఏసీబీ.. ఇది తమ స్థాయి కాదని సీబీఐకి పంపింది. దాంతో సీబీఐ వర్గాలు ఒక్కసారిగా రాష్ట్ర సచివాలయం మీదే దాడులు చేశాయి. కేంద్ర ప్రభుత్వోద్యోగి అయిన ఆశిష్‌ను ఆప్ ప్రభుత్వం తెచ్చుకున్నా.. తొలుత ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. జోషి ఎంపిక వెనక ఉన్నది ఆశిష్ ఖేతాన్ అనే మరో వ్యక్తి. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 70 పాయింట్ల ఎజెండాను సిద్ధం చేసిన కీలక వ్యక్తి. డీడీసీకి కేజ్రీవాల్ చైర్‌పర్సన్‌గా ఉండగా, జోషి సభ్యకార్యదర్శి గాను, ఖేతాన్ వైస్ చైర్మన్ గాను ఉండేవారు. కానీ కొన్నాళ్లకే పార్టీ వర్గాలు తీవ్రంగా అవమానిస్తున్నాయంటూ ఖేతాన్ బయటకు వచ్చేశారు. ఆయన ఆశిష్ జోషిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తర్వాత కొద్ది కాలానికి ఆశిష్ జోషిని కూడా ఆప్ సర్కారు డీడీసీ పదవి నుంచి తొలగించి ఆయన మాతృవిభాగానికి పంపేసింది. ఆ తర్వాతే రాజేంద్రకుమార్ మీద ఆశిష్ జోషి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. -
సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు రాజేంద్ర కుమార్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్‌ను సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. సీబీఐ అధికారులు అతడిని ప్రశ్నించనున్నారు. కాగా రాజేంద్ర కుమార్ నివాసంలో దాడులు జరిపిన సీబీఐ ...ఫారెన్ కరెన్సీతో పాటు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తనపై కక్షతోనే ఈ దాడులు చేయించారని, సీబీఐ దాడులకు భయపడేది లేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తే...కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు 'రబ్బిష్' అంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. మరోవైపు ఆప్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ రాజకీయ ఎజెండా కోసం పాకులాడుతున్నాయని, అయితే ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
జూదం..కబళిస్తున్న ప్రాణం
రిక్రియేషన్ పేరిట జోరుగా జూదం ఏటా రూ. కోట్లలోనే లావాదేవీలు ఎట్టకేలకు మేల్కొన్న సిటీ పోలీసులు కఠిన చర్యలకు కమిషనర్ ఆదేశం జూదం..మొదట్లో సరదా..మితి మీరితే వ్యసనం..ఇందులో చిక్కుకుని సమస్యల వలయంలోకి వెళ్తున్నారు. ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నారు. తేరుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. దీనికి ధనికులే కాదు, మధ్య తరగతి వారూ బలవుతున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా..గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: క్లబ్బుల్లో రిక్రియేషన్ పేరిట జోరుగా సాగుతున్న జూదం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. పేకాటకు బానిసై సర్వం కోల్పోయిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి శుక్రవారం సాక్షాత్తు రాజ్‌భవన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నగరంలోని పేకాట క్లబ్బుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రకటించిన నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బోయిన్‌పల్లిలోని జీవీఆర్ ఫ్యామిలీ క్లబ్‌పై కొరడా ఝుళిపించారు. క్లబ్‌ను సీజ్ చేయడంతో పాటు ఆందోళనకు దిగిన ఉద్యోగులతో పాటు యజమానినీ అరెస్టు చేయించారు. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుసపెట్టి దాడులు చేస్తూ ఇలాంటి క్లబ్బులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చితికిపోతున్న వందల కుటుంబాలు ఈ జూద క్రీనీడలో వందల కుటుంబాలు చితికిపోతున్నాయి. వ్యసనపరుల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ రిక్రియేషన్ క్లబ్స్ అహ్లాదం ముసుగులో జూద గృహాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ చట్రంలో చిక్కుకుని ధనవంతులతో పాటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు విలవిలలాడుతున్నారు. సర్వ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. విషయం ఇంతటితో ఆగకుండా వారి కుటుంబాలనూ నడి రోడ్డుపై పడేస్తున్నాయి. చట్ట విరుద్ధమని తెలిసినా అనేక క్లబ్బులు రాజకీయ, అధికార అండదండలతో యథేచ్ఛగా పేకాటను నడుపుతున్నాయి. వీటిలో జూదరులకు రాజభోగాలతో పాటు ఫైనాన్సియర్లనూ సమకూరుస్తున్నారు. వెరసి సిటీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి తరలివస్తున్న పేకాట రాయుళ్లకు స్వర్గాధామంగా మారింది. ఈ క్లబ్బుల బారినపడి మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు అనేకం ఆర్థికంగా చితికిపోతున్నాయి. సిటీలో 70కి పైగానే క్లబ్బులు... నగర పోలీసుల లెక్కల ప్రకారం సిటీలో దాదాపు 30 రిక్రియేషన్ క్లబ్స్ ఉన్నాయి. వీటికి తోడు చిన్నా, పెద్దా అన్నీ కలిపి దాదాపు 70కి పైగా క్లబ్బులు పేకాటను జోరుగా నిర్వహిస్తున్నాయి. ఇందులో కొన్ని ‘రిక్రియేషన్’ పేర అనుమతి తీసుకున్నవి కాగా మరికొన్నింటికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతి ఉన్న వాటిపై పోలీసులు దాడి చేయరన్న ప్రచారం ఉండటంతో ఇవి పేకాట రాయుళ్లతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఇందులో రెండు ప్రధాన రిక్రియేషన్ క్లబ్బుల ఆధాయం కేవలం పేకాట నిర్వహణతోనే రూ.50 కోట్లకు పైనే. పేకాటను నిర్వహించే ఇతర క్లబ్బులు ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆర్జిస్తున్నాయని అంచనా. మొత్తం క్లబ్బుల్లో వార్షిక టర్నోవర్ వందల కోట్లలోనే ఉంటోంది. సభ్యత్వం తీసుకుని..సర్వం పొగొట్టుకుంటున్నారు పేకాటకు బానిసైన అనేక మంది నగరంలోని వివిధ క్లబ్బుల్లో సభ్యత్వాలు తీసుకుని మరీ సర్వం పొగొట్టుకుంటున్నారు. ఈ సభ్యులు అనునిత్యం ఒకటి కాకుంటే మరో క్లబ్బులో పేకాట ఆడుతూ గడిపేస్తున్నారు. ఉదయమే రావడం, రాత్రి వరకూ పేకాట ఆడటం అలవాటుగా మారిపోతోంది. కొందరైతే రోజుల తరబడి వాటిలోనే గడుపుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. అక్కడే అనేక మంది నుంచి అప్పటికే అప్పులు తీసుకుని మరీ జూదానికి ‘సమర్పిస్తున్నారు’. ఈ రకంగా అన్నీ పోగొట్టుకుని, నిత్యం నరకం చవిచూస్తే జీవచ్ఛవాలుగా బతికే ‘క్లబ్స్ బాధితులు’ సిటీలో ఎందరో ఉంటున్నారు. పేకాటకు బానిసై ఆత్మహత్యాయత్నం పంజగుట : తాగుడు, పేకాటకు బానిసైన వ్యక్తి.. తనలా మరొకరు కాకూడదంటూ రాజ్‌భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ‘కుటుంబ పోషణ భారమైంది.. పోయిన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకునేందుకు డబ్బు లేదు.. ఎదిగొచ్చిన కూతురు పెళ్లి చేయలేకపోతున్నాను’అంటూ కేకలు వేస్తూ శుక్రవారం సాయంత్రం పురుగులు మందు తాగాడు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అతన్ని యశోద ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూల్ టౌన్-1కు చెందిన రాజేంద్రకుమార్ (52) అదే జిల్లా ఎమ్మిగనూరులో కండక్టర్. మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడంటూ 2009లో సస్పెండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు. ఇక్కడ కూడా బోయినపల్లిలోని ఓ క్లబ్లో తరచూ పేకాడుతూ ఉన్న ఆస్తినీ పోగొట్టుకున్నాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వద్దకు వచ్చి నగరంలో ఉన్న పేకాట క్లబ్లనన్నింటిని మూయించాలని నినాదాలు చే స్తూ పురుగుల మందుతాగాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రకుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు. సూసైడ్ నోట్లో.. సాక్షి,సిటీబ్యూరో: రాజేంద్రకుమార్ (52) రాసిన సూసైడ్‌నోట్ సారాంశం.. ‘‘క్రిస్టాల్, జీవీఆర్, నేనిైెహ టెక్ క్లబ్‌ల్లో 14 ఏళ్లపాటు పేకాట ఆడి రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాను. అస్తులు కరిగిపోయాయి, అప్పులెక్కువయ్యాయి. నా చావు అందరికి కనివిప్పు కావాలి, క్లబ్బులను మూసివేయించాలి’’ -
కాశ్మీర్ డీజీపీగా రాజేంద్రకుమార్
శ్రీనగర్: సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రాజేంద్రకుమార్ జమ్మూకాశ్మీర్ కొత్త డీజీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకాశ్మీర్ కేబినెట్ సమావేశం రాజేంద్రకుమార్ నియామకానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్రకుమార్ జమ్మూకాశ్మీర్ క్యాడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 57 ఏళ్ల రాజేంద్రకుమార్ కాశ్మీర్లో పలు కీలక పదవుల్లో పని చేశారు. -
అక్రమ రవాణా గుట్టురట్టు
నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: సరైన పత్రాలు లేకుండా భారీగా నగదు, వెండి తరలిస్తున్న ముగ్గురు యువకులను రైల్వే పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 67 కిలోల వెండి ఆభరణాలు, రూ.6.67 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే నెల్లూరు డీఎస్పీ రాజేంద్రకుమార్ తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు..సంక్రాంతి నేపథ్యంలో రైళ్లలో అక్రమంగా బాణసంచా, ఇతర ప్రమాదకర వస్తువులు తరలిస్తున్నారనే అనుమానంతో డీఎస్పీ రాజేంద్రకుమార్, ఇన్స్పెక్టర్ విజయకుమా ర్, గూడూరు ఎస్సై వరప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బం ది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన ధనరాజ్, రాజన్, తంబాలా ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు హౌరా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి వెళ్లేందుకు నెల్లూరులో ఎక్కారు. రైలు బయలుదేరగానే అప్పటికే బోగీలో తనిఖీ చేస్తున్న పోలీసులను గమనించిన ఆ ముగ్గురు బరువైన రెండు బ్యాగులను ఎస్4 బోగీ నుంచి ఎస్ 10 బోగీవైపు తీసుకెళ్ల సాగారు. పోలీసులు వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ బ్యాగులను తనిఖీ చేయగా 67 కిలోల వెండి ఆభరణాలు, రూ.6.67 లక్షల నగదు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ముగ్గురు యువకులు, సొత్తును అదుపులోకి తీసుకుని గూడూరు రైల్వేస్టేషన్లో దిగారు. అనంతరం నెల్లూరు రైల్వేస్టేషన్‌కు తరలించారు. ఆభరణాల విలువ రూ.30 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. నగదు, వెండిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
రెండు ముఠాలకు చెందిన ఏడుగురి అరెస్టు
చందానగర్, న్యూస్‌లైన్: పోలీసులమని ఇళ్లలోకి చొరబడి కత్తులో బెదిరించి నగలు దోచుకోవడంతో పాటు బాధితుల నుంచి ఏటీఎం కార్డు తీసుకొని డబ్బు డ్రా చేస్తున్న ఓ దోపిడీ ముఠాతో పాటు చోరీలకు పాల్పడుతున్న మరో అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రూ. 19 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన రాజేంద్రకుమార్(24) చిన్నతనంలోనే నగరానికి వచ్చాడు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన చాకలి రవి(24)తో 2010లో పరిచయమైంది. ఇద్దరూ పంజగుట్ట ఠాణా పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి జైలుకెళ్లి వచ్చారు. తర్వాత వీరు సనత్‌నగర్‌కు చెందిన ఎర్నాల ప్రభు(25), శ్రీకాకుళంకు చెందిన బోది రాజ్‌కుమార్ (20)లతో కలిసి ముఠా కట్టారు. నలుగురూ పోలీసులమని చెప్పి ఓ ఇంటిలోకి వెళ్లేవారు. ఆ ఇంట్లో ఉన్నవారిని కత్తులతో బెదిరించి బంగారు నగలు తీసుకొనేవారు. ఈ విధంగా మియాపూర్, చందానగర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, కీసర, కుషాయిగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో పది దోపిడీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లలో నగలతో పాటు బాధితులను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకోవడంతో పాటు పిన్ నెంబర్లు తీసుకున్నారు. ఒక కార్డు ద్వారా రూ. 60 వేలు, మరో కార్డు ద్వారా రూ. 2,800లు డ్రా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా... నిందితులు రాజేంద్రకుమార్, రవి, ప్రభు, రాజ్‌కుమార్‌లు గురువారం చందానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... దోపిడీలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. అంతర్జిల్లా ముఠా... మెదక్ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బెట బాలింగం(21) నగరంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ అమీర్‌పేట్‌లో ఉంటున్నాడు. ఇతను కరీంనగర్ జమ్మికుంటకు చెందిన రాచపల్లి మహేశ్(23)తో కలిసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. వీరు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఏడు చోరీలకు పాల్పడ్డారు. చోరీ సొత్తును జమ్మికుంటకు చెందిన గాలిపల్లి పద్మాచారి(37)కి విక్రయిస్తున్నారు. చందానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలింగం, మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... తమ చోరీల గుట్టువిప్పారు. పోలీసులు పద్మాచారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు ముఠాల నుంచి మొత్తం 54 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలు,4 ద్విచక్ర వాహనాలు, 8 సెల్ఫోన్లు, 2 కెమెరాలు, రూ. 34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీ, షర్మిలా, మాదాపూర్ ఏసీపీ రాంనర్సింహారెడ్డి, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు, కూకట్పల్లి, మల్కాజిగిరీ సీసీఎస్ ఇన్స్పెక్టర్లు సంజీవరావు, మహ్మద్‌గౌస్, చందానగర్ సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.