రాజేంద్ర కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజేంద్ర కుమార్ తరపున లంచాలు తీసుకున్నట్టు ఆయన సన్నిహితుడు అశోక్ కుమార్ ఒప్పుకున్నాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఆయన తరపున భారీగా లంచాలు అందుకున్నట్టు చెప్పాడని తెలిపాయి. లంచం కేసులో రాజేంద్ర కుమార్ ప్రమేయంపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేట్టారు.
మరోవైపు రాజేంద్ర కుమార్ ను ముఖ్య కార్యదర్శి నుంచి సస్పెండ్ చేసినట్టు ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఎవరైనా 48 గంటలకు మించి పోలీసు కస్టడీలో ఉంటే ఆ అధికారిని సస్పెండ్ చేయాలని చట్టాలు చెబుతున్నాయని తెలిపింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ సహా ఐదుగురిని 5 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మంగళవారం సీబీఐ కోర్టు అంగీకరించింది. ఈ ఐదుగురిని సోమవారం సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో డిప్యూటీ సెక్రటరీ తరుణ్ శర్మ, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు.