సీఎంను ఇరికించాలని ఒత్తిడి చేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను ఇరికించాల్సిందిగా సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, ఆత్మహత్యకు పాల్పడిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీకే బన్సాల్ కుటుంబాన్ని ఇలాగే వేధించారని ఆరోపించారు. ముందస్తుగా పదవీవిరమణ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఆయన ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ విషయాలను ప్రస్తావించారు. అవినీతి కేసులో కేజ్రీవాల్‌కు ప్రమేయం ఉన్నట్టు వాంగ్మూలం ఇస్తే కేసు నుంచి తన పేరు తొలగిస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్టు రాజేంద్ర కుమార్ వెల్లడించారు. సీబీఐ అధికారుల వేధింపులు భరించలేకే బన్సాల్ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని లేఖలో ప్రస్తావించారు.
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'సీబీఐ తన కార్యాలయంపై దాడి చేసింది. కేసులో నన్ను ఇరికించాల్సిందిగా అధికారిని ఒత్తిడి చేసింది. మోదీజీ మేమంటే ఎందుకింత భయపడుతున్నారు?' అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారనడానికి రాజేంద్ర కుమార్ వ్యాఖ్యలే నిదర్శనమని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలపై తొమ్మిది సీబీఐ కేసులున్నాయని, మంత్రి సత్యేంద్ర జైన్ త్వరలో అరెస్ట్ చేస్తారని మాట్లాడుకుంటున్నారని చెప్పారు. గతేడాది జూలైలో ఓ అవినీతి కేసులో రాజేంద్ర కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా రాజేంద్ర కుమార్ ఆరోపణలను సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని వివరణ ఇచ్చారు.