కేజ్రీవాల్ కేబినెట్ మీటింగ్ ఫైల్స్ కూడా..
ఢిల్లీ: సీబీఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్కు సంబంధించిన దస్త్రాలను సైతం సీజ్ చేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. డీడీసీఏ ఫైల్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ సీజ్ చేసిందన్నారు. సీబీఐ తమకు అవసరం లేనటువంటి ఫైళ్లను ఎందుకు స్వాధీనం చేసుకుందని ప్రశ్నించారు.
కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ నిర్వహించిన దాడులతో కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం డీడీసీఏ పనితీరుపై దర్యాప్తు జరుపుతుండటం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి భయం కలిగిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అరుణ్ జైట్లీ రాజ్యసభలో సీబీఐ దాడులపై చేసిన ప్రకటన, సభను తప్పుదోవ పట్టించేలా ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజేంద్ర కుమార్ ఆఫీస్పై జరిగిన దాడులు కేవలం తనను లక్ష్యంగా చేసుకొనే జరిగాయని అన్నారు.