న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సంభాషించారు. తనకు జైల్లో పుస్తకాలు చదవడానికి, ఆలోచించడానికి చాలా సమయం దొరికిందని కేజ్రీవాల్ అన్నారు. తాను గీతను చాలాసార్లు చదివానని, ఈ రోజు నేను మీ ముందుకు ‘భగత్ సింగ్ జైల్ డైరీ’తీసుకువచ్చానని అన్నారు. భగత్ సింగ్ జైలులో చాలా లేఖలు రాశారు. భగత్ సింగ్ బలిదానం జరిగిన 95 ఏళ్ల తర్వాత ఒక విప్లవ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాడు. నేను ఎల్‌జీకి జైలు నుంచి ఒక లేఖ రాశాను. జాతీయ జెండా ఎగురవేసేందుకు అతిషీకి అనుమతివ్వాలని ఆగస్టు 15వ తేదీకి ముందు లేఖ రాశాను. ఆ లేఖ ఎల్‌జీకి అందలేదు. మరోసారి లేఖ రాస్తే కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచాక తమకంటే క్రూరమైన పాలకుడు ఈ దేశానికి వస్తాడని బ్రిటీష్ వారు కూడా ఊహించి ఉండరు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాను జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు సందీప్ పాఠక్ తనను కలవడానికి వచ్చాడు. అతను నాతో రాజకీయాల గురించి మాట్లాడాడు. దేశంలో ఏమి జరుగుతోంది, పార్టీలో ఏమి జరుగుతోంది అని నేను అడిగాను. ఇది జరిగాక సందీప్ పాఠక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడం, కేజ్రీవాల్ ధైర్యాన్ని దెబ్బతీయడం వారి లక్ష్యం. వారు ఒక ఫార్ములా తయారుచేశారు. కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఫీలింగ్‌లో ఉన్నారు. అయితే మా పార్టీ విచ్ఛిన్నం కాలేదు. మా ఎమ్మెల్యేలు విచ్ఛిన్నం కాలేదు. వారి పెద్ద కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఉంది.
ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపవచ్చని నిరూపించామని కేజ్రీవాల్ అన్నారు.
ప్రభుత్వాన్ని జైలు లోపల నుండి ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని నడపగలమని నిరూపించాం. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నం జరిగితే భయపడవద్దు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వారి కుట్రలన్నింటిని తిప్పికొట్టే శక్తి ఉంది ఎందుకంటే మనం నిజాయితీపరులం. వారు నిజాయితీ లేనివారు కాబట్టి మన నిజాయితీకి భయపడతారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment