న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్ కోర్టుకు నివేదించారు.
‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.
ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్‌ఐఆర్ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment