womens missing
-
ఆ మహిళల కోసం అలర్ట్ వ్యవస్థ: సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్ కోర్టుకు నివేదించారు. ‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది. -
Impact and Dialogue Foundation: పల్లవించిన రక్షణ
‘బాలికల అక్రమ రవాణా’ ఈ హెడ్డింగ్‌తో వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ‘అయ్యో’ అనుకుని మరో వార్తలోకి వెళ్లిపోవడం కూడా చాలా మామూలుగా జరిగిపోతూనే ఉంటుంది. మన కళ్ల ముందు ఉండే అమ్మాయిని ఎవరో అపహరించుకుని వెళ్లారని తెలిస్తే మనసంతా పిండేసినట్లవుతుంది. రోజులపాటు బాధపడతాం. కానీ ఏమీ చేయం. అక్రమాల మీద గళమెత్తలేకపోయి నప్పటికీ కనీసం నోరు తెరిచి మనకు తెలిసిన విషయాన్ని చెబితే ఆ సమాచారం దర్యాప్తుకు దోహదమవుతుందని తెలిసినా పోలీసు ముందు పెదవి విప్పడానికి భయం. కానీ, అస్సాంకు చెందిన పల్లవి ఘోష్ అలా చూసి ఊరుకోలేదు. పన్నెండేళ్ల వయసులో ఆమె కళ్ల ముందు జరిగిన ఓ సంఘటన ఆమెను కదిలించింది. సమాజానికి అంకితమయ్యేలా ఆమెను ప్రభావితం చేసింది. అప్పుడు పల్లవి ఘోష్‌కు పన్నెండేళ్లు. ఆమె నివసిస్తున్న గ్రామానికి సమీపంలో ఉన్న మరో చిన్న గ్రామానికి చెందిన బాలికను దుండగులు అపహరించుకు వెళ్లడం ఆమె కంట పడింది. పెద్దగా అరుస్తూ పెద్దవాళ్లను అప్రమత్తం చేయడం ద్వారా ఆ బాలికను రక్షించగలిగింది పల్లవి. ట్రాఫికింగ్‌ని స్వయంగా చూడడం ఆమెకది తొలిసారి. కానీ బాలికలు, మహిళల అక్రమ రవాణా పట్ల అస్పష్టంగానైనా కొంత అవగాహన ఉందామెకి. అక్రమ రవాణాను నిరోధించాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంది పల్లవి. వయసు పెరిగేకొద్దీ ఆమెలో ట్రాఫికింగ్ పట్ల స్పష్టమైన కార్యాచరణ రూపుదిద్దుకుంది. ‘ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ’ స్థాపించి బాలికలు, మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టింది. వేదిక మీద ప్రసంగం చాలదు! ‘‘బాలికలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరించి చెప్పడానికి, ఆ బారిన పడకుండా కాపాడడానికి వేదికల మీద ఎన్ని ప్రసంగాలు చేసినా వాటితో అనుకున్న లక్ష్యం నెరవేరట్లేదని కొద్దికాలంలోనే తెలిసింది. ఇలా ప్రసంగాలతో కనీసం ఆలోచననైనా రేకెత్తించగలుగుతున్నానా అనే సందేహం కూడా కలిగింది. అప్పటి నుంచి నేరుగా ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టడం మొదలుపెట్టాను. వాళ్ల ఉద్ధరణ కోసం నిజంగా చేయాల్సిన పని ఏమిటనేది అప్పుడు తెలిసింది. మహిళలు గతంలోకి వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని, జరగబోయి తప్పించుకున్న దురాగతాలను ఏకరువు పెట్టారు. ప్రమాదాలు ఎన్ని రకాలుగా చుట్టుముడతాయనే విషయాన్ని వారికి విడమరిచి చెప్పడంతోపాటు ప్రమాదాన్ని శంకించినప్పుడు రక్షణ కోసం ఏమి చేయాలో వివరించాను. కొన్ని ఇళ్ల నుంచి అప్పటికే మాయమైపోయిన బాలికల అన్వేషణ కోసం పోలీస్ శాఖను ఆశ్రయించాను. అలాగే సమాజాన్ని చైతన్యవంతం చేసే క్రమంలో కానిస్టేబుళ్లను భాగస్వాములను చేశాను. వారిని దగ్గరగా చూడడం, వారు చెప్పే ధైర్యవచనాలను వినడం ద్వారా బాలికలు తమకు ప్రమాదం ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసుల సహాయాన్ని కోరగలుగుతారు. ఇలా ఎన్నో ప్రయత్నాల ద్వారా అక్రమ రవాణా పట్ల బాలికల్లో చైతన్యం తీసుకువచ్చాను. అపహరణకు గురైన పదివేలకు పైగా బాలికలను తిరిగి వారి ఇళ్లకు చేర్చగలిగాను. అంతటితో సరిపోదని ఆ తర్వాత తెలిసింది. రక్షించిన బాలికలకు ఉపాధి కూడా కల్పించాలి. ఆ పని చేయలేకపోతే ట్రాఫికింగ్ మాఫియా పని పేరుతో ఆ బాలికలను తిరిగి తమ గుప్పెట్లోకి తీసుకుపోతుంది. అందుకోసం మా ఫౌండేషన్ ద్వారా వారికి పనుల్లో శిక్షణ ఇచ్చి పని కల్పించడం కూడా మొదలు పెట్టాను. పది వేలకు పైగా బాలికలను కాపాడడంతోపాటు 75 వేల మందిలో చైతన్యం తీసుకురాగలిగాను. వారి భవిష్యత్తు అంధకారంలోకి తోసేసే ముఠాల నుంచి వారికి జాగ్రత్తలు తెలియచేశాను. కానీ మాఫియా ముఠాలను కూకటి వేళ్లతో పెకలించి వేయడం అనే పనిని ప్రభుత్వాలు చేయాలి. అప్పుడే ఈ భూతం తిరిగి నిద్రలేవకుండా ఉంటుంది’’ అని వివరించింది పల్లవి ఘోష్. -
ఎంఎస్సీ చదివి ఇంట్లో చెప్పకుండా ఒకరు.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి మరొకరు..
హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామనాయుడు కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన అంజనేయులు కూతురు అర్చన(25) ఎంఎస్సీ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 13వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఫోన్‌ను సైతం ఇంట్లో వదిలి వెళ్లింది. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి అంజనేయులు సోమవారం ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాల ప్యాకెట్‌కు వెళ్లిన యువతి పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి పాల ప్యాకెట్ కోసం వెళ్లి ఓ యువతి అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం ప్రకారం.. పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన బుచ్చయ్య రెండో కూతురు సౌందర్య(26) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో 15వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచుకీ లభించలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచి్చంది. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి బుచ్చయ్య సోమవారం ఫిర్యాదు చేయగా, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్సింగ్ మిస్టరీ.. వ్యభిచార కూపాల్లోకి మహిళలు!
సాక్షి, పల్నాడు: జిల్లాలో మిస్సింగ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. అంతు చిక్కని మిస్టరీలుగా మిగిలిపోతున్నాయి. మరోవైపు మానవ అక్రమ రవాణా మాఫియా కోరలు చాచింది. ఫలితంగా అమాయక అబలలు, బాలికలు బలైపోతున్నారు. కొందరు మాయమాటలతో మోసం చేసి మహిళలను రాష్ట్రాలు దాటిస్తున్నారు. వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. కొందరు మృగాళ్లు మాటువేసి మృగవాంఛలు తీర్చుకుంటున్నారు. యువతుల నిస్సహాయతనే ఆసరాగా చేసుకుంటున్నారు. అభంశుభం తెలీని బాలికలనూ కర్కశకులు వదలడం లేదు. ఇటీవల కాలంలో వెలుగుచూసిన పలు కేసులను చూసి పోలీసులే కన్నీరు పెట్టారంటే సమాజం ఎంత దిగజారిపోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వెలుగుచూడని గాధలెన్నో పరువు కోసమో.. అవమాన భారమో.. ఏమోకానీ పోలీసు మెట్లెక్కని కేసులెన్నో ఉంటాయని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. మహిళ బయటకు వెళ్లి ఇంటికి రాలేదంటే.. అపహాస్యంగా మాట్లాడే వాళ్లే ఎక్కువ. అందుకే చాలా కుటుంబాలు లోలోన కుమిలిపోయి చుట్టపక్కల వెతికి ఊరుకుంటున్నాయి. వారు ఏమైపోయారోనని కూడా ఆరా తీయడం లేదు. ఇలాంటి కేసులు కోకొల్లలు ఉంటాయని తెలుస్తోంది. పోలీసుల తీరుపైనా విమర్శలు మిస్సింగ్ కేసుల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. చిన్నారులు, యువతులు, మహిళలు తప్పిపోతే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే బాధిత కుటుంబాలకు వింత పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎగతాళిగా మాట్లాడడం బాధిత కుటుంబాలను మరింత కుంగదీస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించకపోవడం, ‘‘బంధువుల, స్నేహితుల నివాసాల్లో అడిగారా..? కొద్ది రోజులు వేచి చూడండి.. అలిగి వెళ్ళి ఉంటారులే..!’’ వంటి సమాధానాలు వస్తుండడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇలాంటి ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అంతు‘చిక్కట్లే’..!
ఉమ్మడి జిల్లాలో అదృశ్య కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. కనిపించకుండా పోతున్న వారిలో మహిళలు, బాలికలే అధికంగా ఉండటం విశేషం.. ఇందులో కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తున్నా.. మరికొందరు ఏమైపోతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకరోజులో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకటి లేదా రెండు కేసులు తమ వాళ్లు అదృశ్యం అయ్యారని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే కొందరు మతిస్థిమితం కోల్పోయిన వారు.. మరికొందరు ప్రేమ, ఇతర వ్యవహారాలతో కనిపించకుండా పోతున్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లపైబడిన వారు మూడేళ్లలో 963 మంది అదృశ్యమవగా.. 259 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాల విభజన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో 2017 సంవత్సరంలో 104 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. 2018లో 136, 2019లో 28 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 298 అదృశ్య కేసులు నమోదైతే ఇందులో పదేళ్లలోపు వారు 110 మంది ఉండగా 188 మంది యువతులున్నారు. గద్వాల జిల్లాలో 2017లో నమోదైన 52 కేసులలో 23 మంది మహిళలు, 29 మంది చిన్నారులు, 2018లో 92 కేసులు నమోదవగా.. 69 మంది మహిళలు, 23 మంది చిన్నారులు, 2019లో 26 కేసులు నమోదు కాగా.. 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2017లో 270 కేసులు నమోదైతే 252 కేసులు ఛేదించారు. 2018లో 260 కేసులు నమోదు కాగా.. 125 కేసులు ఛేదించారు. 2019లో ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం వలస వెళ్లి.. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మక్తల్, నారాయణపేట, కొడంగల్, గద్వాల నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరిలో దినసరి కూలీలు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదృశ్యమయ్యారు. ముఖ్యంగా కొయిలకోండ, నవాబుపేట, మద్దూరు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబయి, కర్ణాటక, పుణె తదితర నగరాలకు వెళ్లడంతోపాటు గల్ఫ్ దేశాలకు వెళ్తారు. ఇలా వెళ్లిన వారిలో చాలామంది అమాయకులు తప్పిపోతున్నారు. ఇందులో కొంత మంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తామని తీసుకువెళ్లి మోసం చేస్తుండటంతో.. వారు తిరిగి రాలేకపోతున్నారు. అన్ని స్టేషన్లలో పెండింగే.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 74 పోలీస్స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్‌లో వందల సంఖ్యలో అదృశ్య కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటు కుటుంబ సభ్యులు.. బంధువులు గాలిస్తుంటే.. మరోవైపు పోలీసులు వారి కోణంలో గాలిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులలో చాలా వరకు అదృశ్యమైన వారు కనిపించకపోవడంతో ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. దీనికి తోడు పోలీసులు సైతం అదృశ్యమవుతున్న కేసులపై అందగా దృష్టిసారించకపోవడంతో రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలు.. చచ్చుబండలు మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.. అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస.. బాలికలపై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. కామాంధుల చేతుల్లో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్న ఘటనలు కోకొల్లలు వెలుగుచూస్తున్నాయి. పండంటి కాపురంలో కలతలు నెలకొనడంతో రోజూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. వారంతా అత్తింటి నుంచి రక్షణ కోసం ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మంది భార్యాభర్తలకు పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్లో దారికి రాని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇవీ చేపట్టాల్సిన చర్యలు పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్ నంబర్లు గుర్తుండేలా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతోపాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించాలి. త్వరగా ఛేదిస్తున్నాం.. జిల్లాలో బాలికలు అదృశ్యమైతే కిడ్నాప్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. ఒక మర్డర్ కేసుకు ఇచ్చే ప్రాముఖ్యతను ఈ కేసుకు ఇస్తున్నాం. మేజర్ మహిళలు అదృశ్యమైతే మిస్సింగ్ కేసులు పెడుతున్నాం. ప్రతి కేసుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. పెండింగ్‌లో లేకుండా చూస్తున్నాం. యువతులు కొత్త వ్యక్తులను ఏమాత్రం నమ్మరాదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ, మహబూబ్‌నగర్ -
వీడని మిస్టరీ
ఖమ్మంక్రైం: చదువుకునేందుకు, ఉద్యోగాలు, ఇతర వృత్తుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థినులు, యువతులు, మహిళలు సాయంత్రం ఇంటికొచ్చే వరకు ఆ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు గుండెల్లో దడదడే. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీçపూర్లో అదృశ్యమైన బాలికలు, యువతుల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ప్రజల్లో వణుకుపుడుతోంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు, పోలీస్స్టేషన్లలో నమోదైన చాలా కేసులకు పరిష్కారం దొరకని పరిస్థితి. తమ పిల్లలు తప్పిపోయారా.. ఎవరైనా కిడ్నాప్ చేశారా.. ఇప్పుడు వారు ఎక్కడున్నారనే విషయాలను తెలుసుకోలేక ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ఇక వర్కింగ్ హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థినులు, యువతులకు ఎంతవరకు భద్రత ఉంది..? ప్రస్తుత పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే.. పోలీసు రికార్డులనుబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా అదృశ్యం కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. చదువుకునేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, యువతులు మాయమాటలు నమ్మి యువకులతో వెళ్లిన కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలిసో తెలియకో వెళ్లిన పిల్లలు ఎక్కడున్నారు.. వారి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పటికీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొందరు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. మరికొందరు తమ పిల్లలు ఎక్కడున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు రూ.లక్షలు ఖర్చు పెడుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో మరింతగా కుంగిపోతున్నారు. ఠాణా చుట్టూ ప్రదక్షిణలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డల ఆచూకీ కోసం సంబంధిత పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. కనీసం నెలలో ఐదుసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ పిల్లల ఆచూకీ ఏమైనా లభ్యమైందా? అని అడిగి తెలుసుకుంటున్నారు. పోలీసులు దీనిపై పెదవి విరవడంతో ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చి తమ బిడ్డలను మరిచిపోలేక ఒక పక్క రోదిస్తూ.. ఎక్కడో ఒక దగ్గర ఆచూకీ లభిస్తుందేమోనని మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కేసుల వివరాలిలా.. 2017–18కి సంబంధించి అదృశ్యమైన మహిళలు, యువతుల కేసులలో సగానికిపైగా పోలీసులు వారి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందులో పోలీస్ శాఖ కొంతవరకు పురోగతి సాధించిందని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో 2017లో 183 మంది మహిళలు అదృశ్యం కాగా.. వారిలో 170 మందిని పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇంకా మిస్టరీగా ఉన్న 13 కేసుల్లో సుమారు 16 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారు 8 మంది ఉండగా.. మిగతా ఐదుగురు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారున్నారు. 2018లో 222 మంది అదృశ్యం కాగా.. వారిలో 178 కేసులను పోలీసులు ఛేదించారు. వీరిలో 20 మందికి పైగా 18 నుంచి 30 ఏళ్లలోపు యువతులు ఉండగా.. మిగతా వారు 30 ఏళ్లపై నుంచి 50 ఏళ్ల పై వరకు ఉన్న మహిళలు ఉన్నారు. 2019లో ఇప్పటి వరకు అదృశ్యం కేసులు నమోదు కాలేదని పోలీస్ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2019లో ఇప్పటివరకు మహిళలకు సంబంధించి 50 కేసులు నమోదయ్యాయి. వీటిలో 35 కేసులను ఛేదించగా.. 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 25 బాలికల అదృశ్యం కేసులు నమోదు కాగా.. వీటిలో 15 పరిష్కారమయ్యాయి. 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో యువతులు అదృశ్యమైన సంఘటనలు ఇప్పటివరకు లేవు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో మహిళలు, యువతుల అదృశ్యంపై నమోదైన అనేక కేసులను ఇప్పటికే ఛేదించాం. మహిళల అదృశ్యం జరుగుతున్న తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు నమోదైతే తక్షణమే స్పందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తరహా కేసుల్లో అదృశ్యం కావడానికి పలు కారణాలను అనేక కోణాల్లో విశ్లేషిస్తున్నాం. పోలీస్ శాఖ ఛేదించిన కేసుల్లో మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. అనేక సున్నితమైన అంశాలు సైతం బాలికలు, మహిళలు, యువతులు అదృశ్యం కావడంలో ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యత్‌లో జిల్లాలో ఈ తరహా కేసుల్లో నిందితులుగా తేలిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. – తఫ్సీర్ ఇక్బాల్, పోలీస్ కమిషనర్, ఖమ్మం -
తల్లి ఇద్దరు కూతుళ్ల అదృశ్యం
గచ్చిబౌలి: తల్లీ ఇద్దరు కూతుళ్లు అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భూపతి తెలిపిన వివరాలు ప్రకారం మసీద్‌బండలో ఎస్ఎంఆర్ కన్స్ట్రక్షన్స్లో కూలీలుగా పనిచేసే నీలం ఇద్రమ్మ (35) ఆమె ఇద్దరు కుమార్తెలు రాధ(10), ప్రేమలత(6) మే 29 సాయంత్రం 6 గంటలకు బాత్రూమ్కు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు సమీప ప్రాంతాల్లో ఎంత వెతికినా అచూకీ లభ్యం కాలేదు. భర్త చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.