అంతు‘చిక్కట్లే’..! | Women Missing Case In Mahabubnagar | Sakshi
Sakshi News home page

అంతు‘చిక్కట్లే’..!

Published Thu, May 2 2019 8:13 AM | Last Updated on Thu, May 2 2019 8:13 AM

Women Missing Case In Mahabubnagar - Sakshi

ఉమ్మడి జిల్లాలో అదృశ్య కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. కనిపించకుండా పోతున్న వారిలో మహిళలు, బాలికలే అధికంగా ఉండటం విశేషం.. ఇందులో కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తున్నా.. మరికొందరు ఏమైపోతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకరోజులో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకటి లేదా రెండు కేసులు తమ వాళ్లు అదృశ్యం అయ్యారని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే కొందరు మతిస్థిమితం కోల్పోయిన వారు.. మరికొందరు ప్రేమ, ఇతర వ్యవహారాలతో కనిపించకుండా పోతున్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లపైబడిన వారు మూడేళ్లలో 963 మంది అదృశ్యమవగా.. 259 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

జిల్లాల విభజన తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2017 సంవత్సరంలో 104 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. 2018లో 136, 2019లో 28 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 298 అదృశ్య కేసులు నమోదైతే ఇందులో పదేళ్లలోపు వారు 110 మంది ఉండగా 188 మంది యువతులున్నారు. గద్వాల జిల్లాలో 2017లో నమోదైన 52 కేసులలో 23 మంది మహిళలు, 29 మంది చిన్నారులు, 2018లో 92 కేసులు నమోదవగా.. 69 మంది మహిళలు, 23 మంది చిన్నారులు, 2019లో 26 కేసులు నమోదు కాగా.. 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2017లో 270 కేసులు నమోదైతే 252 కేసులు ఛేదించారు. 2018లో 260 కేసులు నమోదు కాగా.. 125 కేసులు ఛేదించారు. 2019లో ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. 

ఉపాధి కోసం వలస వెళ్లి.. 

మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మక్తల్, నారాయణపేట, కొడంగల్, గద్వాల నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరిలో దినసరి కూలీలు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదృశ్యమయ్యారు. ముఖ్యంగా కొయిలకోండ, నవాబుపేట, మద్దూరు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబయి, కర్ణాటక, పుణె తదితర నగరాలకు వెళ్లడంతోపాటు గల్ఫ్‌ దేశాలకు వెళ్తారు. ఇలా వెళ్లిన వారిలో చాలామంది అమాయకులు తప్పిపోతున్నారు. ఇందులో కొంత మంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తామని తీసుకువెళ్లి మోసం చేస్తుండటంతో.. వారు తిరిగి రాలేకపోతున్నారు. 

అన్ని స్టేషన్లలో పెండింగే.. 
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 74 పోలీస్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్‌లో వందల సంఖ్యలో అదృశ్య కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటు కుటుంబ సభ్యులు.. బంధువులు గాలిస్తుంటే.. మరోవైపు పోలీసులు వారి కోణంలో గాలిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసులలో చాలా వరకు అదృశ్యమైన వారు కనిపించకపోవడంతో ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. దీనికి తోడు పోలీసులు సైతం అదృశ్యమవుతున్న కేసులపై అందగా దృష్టిసారించకపోవడంతో రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చట్టాలు.. చచ్చుబండలు 

మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.. అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస.. బాలికలపై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. కామాంధుల చేతుల్లో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్న ఘటనలు కోకొల్లలు వెలుగుచూస్తున్నాయి. పండంటి కాపురంలో కలతలు నెలకొనడంతో రోజూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. వారంతా అత్తింటి నుంచి రక్షణ కోసం ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మంది భార్యాభర్తలకు పోలీసుల కౌన్సిలింగ్‌ నిర్వహించి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్‌లో దారికి రాని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 

ఇవీ చేపట్టాల్సిన చర్యలు 

 పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్‌ నంబర్లు గుర్తుండేలా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతోపాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించాలి. 

త్వరగా ఛేదిస్తున్నాం.. 
జిల్లాలో బాలికలు అదృశ్యమైతే కిడ్నాప్‌ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. ఒక మర్డర్‌ కేసుకు ఇచ్చే ప్రాముఖ్యతను ఈ కేసుకు ఇస్తున్నాం. మేజర్‌ మహిళలు అదృశ్యమైతే మిస్సింగ్‌ కేసులు పెడుతున్నాం. ప్రతి కేసుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. పెండింగ్‌లో లేకుండా చూస్తున్నాం. యువతులు కొత్త వ్యక్తులను ఏమాత్రం నమ్మరాదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.             – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ, మహబూబ్‌నగర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement