విలేకర్ల సమావేశంలో నిందితులను చూపిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ క్రైం: డబ్బుల కోసం రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి..విక్రయించిన ముఠాను మహబూబ్‌నగర్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 13న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు పోట్టోళ్ల చిట్టి అలియాస్ హద్దులమ్మ తన భర్త యాదయ్యతో కలిసి తమ కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. చివరకు క్రైం టీం కానిస్టేబుల్స్‌కు వచ్చిన సమాచారం మేరకు వీరన్నపేట ఓ ఇంట్లో చిన్నారి ఉందని గుర్తించి ఆ ఇంట్లో తనిఖీలు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని ఎర్రకుంటకు చెందిన పోట్టోళ్ల చిట్టి అలియాస్ హద్దులమ్మ, యాదయ్య దంపతులకు నలుగురు ఆడ సంతానం ఉన్నారు. కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తూ సొంత ఇళ్లు లేకపోవడంతో వల్లభ్‌నగర్‌లో ఉండే మదర్సాలలో పడుకుంటారు. అయితే పది రోజుల కిందట పోట్టోళ్ల చిట్టి, యాదయ్య తమ పిల్లలతో దొడ్డలోనిపల్లి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న సమయంలో వీరన్నపేటకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ సలీం, తస్లీమ్, సమీనా నహిద్ కలిసి కల్లు తాగడానికి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలిసి పోట్టోళ్ల చిట్టిని నీకు నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు కదా మాకు ఒక్కరిని ఇవ్వాలని అడిగారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. అయితే మీరు ఎక్కడ ఉంటారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కిడ్నాప్.. ఆ వెంటే విక్రయం
ఈనెల 13న రాత్రి పట్టణంలోని వల్లభ్‌నగర్ దగ్గర ఉన్న మదర్సా పాఠశాల ఆవరణలో చిట్టి, యాదయ్య దంపతులతో పాటు పిల్లలు పడుకున్నారు. ఈ క్రమంలో తస్లీం, సమీనా నహిద్‌లతో కలిసి సలీం ఆటోలో వచ్చి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుండగా చిట్టికి మెళకువ వచ్చి వారి వెంటపడింది. కిడ్నాపర్లు ఆటోలో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు వీరన్నపేటకు చెందిన ఖతీజా బేగంకు రూ.10వేలకు చిన్నారిని ముగ్గురు ముఠా సభ్యులు విక్రయించారు. ఆ తర్వాత బాధితురాలు పోట్టోళ్ల చిట్టి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని ఇద్దరు బూర్కా ధరించిన మహిళలు, ఒక వ్యక్తి ఆటోలో వచ్చి పాపను ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది.
ఐదు బృందాలతో గాలింపు
దీంతో ఈ కేసును చేధించడానికి ఐదు ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ బృం దాలను ఏర్పాటు చేసి అనుమానం కల్గిన ప్రాంతాలను తనిఖీలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, కాచి గూడ రైల్వేస్టేషన్లు, హైదరాబాద్ ప్రధాన బస్టాండ్లు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటు మరికొన్ని బృందాలు రాయిచూర్, నారాయణపేట, కర్నూల్ తనిఖీలు చేశారు. అదేవిధంగా పాపను ఆటోలో కిడ్నాప్ చేయడం వల్ల పట్టణంలో ఉన్న ఆటోలపై దృష్టి పెట్టి తనిఖీలు చేయగా కొంత సమాచారం లభించింది. దీంతో క్రైంపార్టీ పోలీసులు వీరన్నపేట ఖతీజా బేగం ఇంట్లో రెండు నెలల చిన్నారి ఉందని గుర్తించి వారందరిని గురువారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా మదర్సాలో కిడ్నాప్ చేసి న చిన్నారియే అని ఒప్పుకోవడం జరిగిం ది. దీంతో పోలీసులు వారి నుంచి చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతం అయ్యింది. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన ఆటో, రూ.700నగదు సీజ్ చేయడంతో పాటు నలుగురు నేరస్తులను మహ్మద్ సలీం, తస్లీమ్, సమీనా నహిద్, ఖతీజా బేగంను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు పరిశోధనలో ప్రతిభ కనబర్చిన వన్‌టౌన్ సీఐ రాజేష్, క్రైం పార్టీ కానిస్టేబుల్స్ తిరుపతిరెడ్డి, నరేష్, క్రైం టాస్క్‌ఫోర్స్ బృందాలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment