Mahabubnagar police
-
ఫేస్బుక్లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీకి చెందిన యువతి(24), మండలంలోని ఇప్పటూర్ పంచాయతీ చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్(25)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం తిలక్‌గౌడ్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టానంది. ఈ విషయమై బాధితురాలు నవాబుపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపారని వివరించింది. చదవండి: రెండు పెళ్లిళ్లు.. మరొక వ్యక్తితో సహజీవనం..చివరకు -
‘కొంగు’ కుమిలింది.. కూనతో ఒరిగింది
మిడ్జిల్: రెండు పదుల వయసు.. మేనత్త కొడుకుతో పెళ్లయి రెండేళ్లయ్యింది. ముద్దులు మూటగట్టే తొమ్మిది నెలల కూతురు. హాయిగా సాగిపోవలసిన కాపురం.. కానీ పెళ్లయినప్పటి నుంచే కలహాలు.. పెద్దలు సర్ది చెప్పినా విభేదాలు సద్దుమణగలేదు.. దానికి బలవన్మరణమే పరిష్కారం అనుకుందా యువ వివాహిత. బిడ్డతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ జయప్రసాద్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండకు చెందిన ఎల్లమ్మ, సంగయ్యల కుమార్తె సరిత (21)ను రెండేళ్ల క్రితం మిడ్జిల్‌కు చెందిన తన మే నత్త ఎత్తరి రా ములమ్మ కుమారుడు శ్రీశైలంకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల కూతురు ఉంది. పెళ్లయినప్పటినుంచే కలహాలు పెళ్లి జరిగినప్పటి నుంచే ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో పలుమార్లు పంచా యతీ నిర్వహించి సర్ది చెప్పినా కలహాలు తగ్గకపోవడంతో మనస్తాపానికి గురైన సరి త మంగళవారం చంటిపాపతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సాయం త్రం భర్త శ్రీశైలం ఇంటికి రాగా.. భార్య, కూతురు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఇంట్లో వెతికాడు. అయినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం మిడ్జిల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం మిడ్జిల్ చెరువులో మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. బిడ్డను చీర కొంగుకు కట్టుకుని శవమై తేలిన సరిత, పసిపిల్ల మృతదేహాలను చూసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ కలహాలు తల్లితో పాటు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘బావా.. నేను చనిపోయిన తర్వాత నువ్వు.. మీ అమ్మ సంతోషంగా ఉండండి.. మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు.. నేను కూలి చేసి సంపాదించిన పైసలతోనే నా అంత్యక్రియలు నిర్వహించు’అని సరిత రాసిన సూసైడ్ నోట్ ఇంట్లో బయటపడింది. సరిత తండ్రి సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. -
తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు
ఓ మండలంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే వ్యక్తి రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి కూతురు ఉంది. ఇటీవల అత్త, మామ ఇంట్లో ఉంటున్నారని భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ వచ్చారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని టీడీగుట్టకు చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో ఉండేవారు. లాక్డౌన్ తర్వాత ఇద్దరూ జిల్లా కేంద్రానికి వచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతను ఆటో నడిపేవాడు. భార్య ఓ దుకాణంలో పనిచేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో ద్వారా అశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో పాటు తరచూ అతను మద్యం తాగడం వల్ల గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరినీ పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహబూబ్‌నగర్ క్రైం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత కాలంతో పాటు మనుషులు పరుగెడుతున్నారు. ఫలితంగా చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భార్యాభర్తలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఈ నేపథ్యంలో పలుసార్లు మనస్పర్థలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్తున్నారు. మహిళలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని ఒక్కటి చేస్తున్నారు. మరికొందరు మాత్రం పట్టు విడవకుండా చట్టం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఏడాది కాలంగా గృహహింస కేసులు పెరిగాయి. ఆనందోత్సాహాలతో అన్యోనంగా కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య క్షణికావేశాలు, భావోద్వేగాల కారణంగా పట్టు, విడుపులు లేని ధోరణి పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే గోరంత సమస్యను కొండంతలుగా చేసుకుని విడిపోతున్నారు. పంతాలు, పట్టింపులకు పోయి తానేమీ తక్కువ కాదంటూ రాజీ పడకుండా ఆలోచన శక్తిని కోల్పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వారి కాపురాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. దంపతులతో పాటు వారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. తల్లిదండ్రులు వేరుగా ఉంటున్న కుటుంబాల్లో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేసేవారు లేక పక్కదారి పడుతున్నారు. (చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే) కౌన్సెలింగ్ సెంటర్‌తో భరోసా ఇలా చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలను చక్కదిద్దేందుకు, వివిధ రూపాల్లో మహిళలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ విడిపోవాలనుకుంటున్న దంపతులకు సర్దుకుపోవాలంటూ వారిలో అనుబంధాన్ని పెంచేందుకు మహిళా పోలీస్‌స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ భరోసా ఇస్తోంది. విడిపోవాలనుకున్న దంపతుల్లో ఆశలు చిగురింపజేసి కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు సరైన మార్గనిర్దేశం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. (చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో) వందల సంఖ్యలో దంపతుల మధ్య వివాదాలు ప్రతినెలా వందల సంఖ్యలో ఠాణాకు వస్తున్నాయి. వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే హిందూ సంప్రదాయంలోనూ అనుబంధాలు బీటలు బారుతున్నాయి. ఇద్దరి మధ్య అవగాహనలోపం.. భార్యాభర్తల బంధం విలువ తెలియకపోవడంతో ఇటీవల కాలంలో పోలీస్స్టేషన్లకు ఎక్కువగా ఇలాంటి కేసులు వస్తున్నాయి. అందులో కొన్ని కౌన్సెలింగ్ ద్వారా సద్దుమణుగుతుండగా చాలా వరకు యువ జంటలు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దంపతుల మధ్య విభేదాలు పెరగడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండటమే కారణమవుతోంది. ఎవరికి వారు ఒంటరిగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నందున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది. అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా అనుభవం ఉన్న పెద్దలు సర్దిచెప్పే అవకాశం ఉండేది. దీంతో అక్కడికక్కడే సమస్య పరిష్కారమై దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేది. అయితే ఉరుకులు, పరుగుల జీవితంలో పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టడం వల్ల దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే మనోధైర్యం లేక విడాకుల వరకు తీసుకెళ్తోంది. కౌన్సెలింగ్‌కే ప్రాధాన్యం ఇస్తాం కౌన్సెలింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తాం. చిన్న సమస్యలతో కోపంగా మా వద్దకు కొందరు వస్తారు. వారి కుటుంబసభ్యులు కానీ, పెద్ద మనుషులతో కానీ మాట్లాడాలని చెబుతాం. చాలా కేసులు ఫిర్యాదుల వరకే ఉంటాయి. ఇటీవల పెళ్లయి నెల రోజులకే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు రావడం చూస్తుంటే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడికి వచ్చిన భార్యాభర్తల సమస్యను మొదట గుర్తిస్తాం. దీనికి పరిష్కారం దొరికితే నిజాయితీగా కలుస్తారనుకుంటే కలపడానికి యత్నిస్తాం. ఇక ఎన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మారరనే వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తాం. - హన్మప్ప, సీఐ, మహిళా పోలీస్ స్టేషన్, మహబూబ్‌నగర్ వివాదాలకు కారణాలివే ఆర్థిక సమస్యలు, భర్త మద్యానికి, ఇతర వ్యసనాలకు బానిస కావడం, వివాహేతర సంబంధాలు, దంపతుల మధ్య ఒకరిపై మరొకరికి అనుమానం, అదనపు కట్నం, ఇరువర్గాల కుటుంబసభ్యుల అనవసర జోక్యం, ఇతర వేధింపులు కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం చదువుకున్న వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువ జంటలు భర్త తల్లిదండ్రులకు సేవ చేయాల్సి వస్తుందోనని ముందే మానసికంగా ఇబ్బందిపడి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ గొడవలకు కారకులవుతున్నారు. -
పోలీస్ శాఖలో మరోసారి కలకలం
సాక్షి, మహబూబ్‌నగర్ : కాపాడాల్సిన కంచె చేను మేస్తే? జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు ఇదే చందంగా ఉంది. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడంతో పాటు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు దందాలకు అలవాటుపడ్డారు. అవినీతి అలవాటుపడిన కొందరు పోలీస్ సిబ్బంది దర్జా వెలగబెడుతున్నారు. నిత్యం డబ్బు దండుకోవడమే కాకుండా మందు పార్టీల్లో మునిగి తేలుతూ ఆశాఖకు మాయని మచ్చ తీసుకొస్తున్నారు. పోలీస్ శాఖపై ఉన్నత అధికారులు ఎంత దృష్టి పెట్టిన.. క్షేత్రస్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్స్ ఎండీ సాదతుల్లా(144), చంద్రునాయక్ (350), మూసాపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాజు(2320)లను ఎస్పీ రెమా రాజేశ్వరి మంగళవారం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ప్రత్యేకంగా విచారణ చేసి ఆ తర్వాత వేటు వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది ఇసుక వ్యాపారుల దగ్గర ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారని, ఒక్కో ట్రాక్టర్, టిప్పర్‌కు ఇంత రేటు ఏర్పాటు చేసి వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై సిబ్బంది పడిన ఒకరిద్దరు ఇసుక వ్యాపారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఇసుక వ్యాపారులే టార్గెట్ మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇసుక రూపంలో డబ్బులు అధికంగా వస్తున్న క్రమంలో పోలీసులు సైతం దీనిపై కొంచెం ఎక్కువ దృష్టి పెట్టారు. దీంట్లో ప్రధాన పాత్ర కానిస్టేబుల్స్ పోషిస్తున్నారు. రాత్రి, తెల్లవారుజాము వేళలో ఇసుక రీచ్‌లకు ద్విచక్ర వాహనాలపై వెళ్లి వసూళ్లు చేస్తున్నారు. దందాలను ఆపాల్సిన వారే అనధికారిక కార్యకలాపాలకు తెరదీస్తున్నారు. -
మహబూబ్‌నగర్ ఆస్పత్రి వద్ద క్షణం క్షణం ఉత్కంఠ
సాక్షి, మహబూబ్‌నగర్: క్షణం క్షణం ఉత్కంఠ భరితం. కుయ్... కుయ్ అంటూ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రికి చేరుకుంటోన్న అరగంటకో వాహనం.. ఏ వాహనంలో ఎవరు..? ఎప్పుడొస్తున్నారో తెలియదు. ప్రతి వాహనంలో వస్తున్న పోలీసు అధికారులకు స్థానిక డీఎస్పీ, ఇతర అధికారుల సెల్యూట్. గేటు ముందు వాహనాలు నిలిపి.. ఆస్పత్రిలోకి వెళ్లిన అధికారులు. కొందరు ఫోరెన్సిక్ నిపుణులంటే.. ఇంకొందరు ఇంటెలిజెన్స్ అధికారులని పోలీసుల చర్చలు. ఆస్పత్రి చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. ఇంతకు జిల్లాస్పత్రిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనం..! జిల్లా ఆస్పత్రి వద్ద జనం ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.40గంటల వరకు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన పోలీసులు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుల మృతదేహాలకు పూర్తయిన పోస్టుమార్టం. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రి ముందు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నడిచిన హైడ్రామా. ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల పోస్టుమార్టం ఉమ్మడి జిల్లా పోలీసులకే కాదూ హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఉత్కంఠతో పోలీసులు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించారు. అక్కడా..? ఇక్కడా..? రంగారెడ్డి షాద్‌నగర్ చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని ప్రసార మాద్యమాల్లో తెలుసుకున్న పాలమూరు ప్రజలు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున జిల్లాస్పత్రికి చేరుకున్నారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి.. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో సుమారు వంద మంది పోలీసులతో గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన ద్వారం నుంచి పోస్టుమార్టం వరకు ఉన్న మార్గాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్న పోలీసులు ఎవరినీ అటు వైపు వెళ్లనీయలేదు. రెండు గంటల ప్రాంతంలో నిందితులకు ఎన్కౌంటర్ స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. మృతుల తల్లిదండ్రులను ఓదారుస్తున్న వనపర్తి ఎస్పీ అపూర్వరావు సాయంత్రం 3.10 గంటలకు జిల్లాస్పత్రికి చేరుకున్న ఎస్పీ మృతదేహాలను మహబూబ్‌నగర్‌కే తీసుకువస్తున్నారని.. అందరూ సిద్ధంగా ఉండాలని పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ఉదయం నుంచి అప్పటి వరకు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులు, మృతదేహాలు వస్తే ఏవైనా శాంతిభద్రతలు తలెత్తుతాయా..? అలాంటి పరిస్థితి రాకుండా ఇంకేం చేద్దామని డీఎస్పీలతో చర్చించారు. 3.40 గంటల ప్రాంతంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న సాధారణ జనంతో పాటు మీడియాను సైతం ప్రధాన గేటు బయటికి పంపించేశారు. ఆస్పత్రి అంతా పోలీసుల హడావిడి మొదలవడం.. మీడియా రోడ్డుపైకి రావడంతో ఆ మార్గాన వెళ్లే జనం ‘దిశ’ నిందితుల మృతదేహాలను చూసేందుకు ఆగింది. దీంతో తేరుకున్న పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనాన్ని బలవంతంగా అక్కడ్నుంచీ పంపించేశారు. సుమారు 40మీటర్ల వరకు పోలీసులు పహారాగా నిలిచారు. మరోవైపు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో జిల్లాకు చెందిన వైద్యులను పోలీసులు అనుమతించలేదు. -
డీఎస్పీ ఆధ్వర్యంలో మృతదేహాల భద్రత..
సాక్షి, మహబూబ్‌నగర్: నిందితుల కుటుంబాలకు మృతదేహాల అప్పగింత వాయిదా పడడంతో జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 15మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జిల్లా ఆస్పత్రిలో ఫ్రీజర్లు లేకపోవడంతో బయటి నుంచి తెప్పించి మృతదేహాలను అందులో ఉంచారు. ఈ క్రమంలో వసతులు లేవని, మృతదేహాలను భద్రపరిచేందుకు సరైన వసతులు లేవని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. వాయిదా పడిన అంత్యక్రియలు శవాలను పూడ్చేందుకు తీసిన గోతులు జక్లేర్‌లో మహ్మద్ ఆరీఫ్ పాషాను ముస్లింల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసేందుకు ఆ గ్రామ మైనార్టీలు ఏర్పాట్లు చేశారు. గుడిగండ్లలో తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపేందుకు నవీన్, శివ, చెన్నకేశవులు కుటుంబీకులు గ్రామ శివారులోని శ్మశాన వాటికలో గుంతలను తవ్వించారు. అంత్యక్రియలు చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందుండి గుంతలను తవ్వించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం వరకు ప్రశాంతమైన వాతావరణంలో అంత్యక్రియలు జరపాలని పోలీసు యంత్రాంగం ప్రణాళికతో అంచనా వేసుకుంది. జాతీయ మానవహక్కుల కమిషన్, హైకోర్టు ఆదేశాలతో చివరకు మృతదేహాలు గ్రామాలకు చేరుకోకపోవడంతో అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. -
పాలమూరులో తుపాకీ కలకలం
మహబూబ్‌నగర్ క్రైం: పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని హత్య చేయాలనే ఉద్దేశంతో తుపాకీ కొనుగోలు చేసి.. అది పని చేస్తుందో.. లేదోనని టెస్టింగ్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో అనూహ్యంగా పోలీసులకు చిక్కారు ఇద్దరు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాత్రి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. తిమ్మసానిపల్లికి చెందిన వరద రవి, అతని స్నేహితుడు కన్నయ్య ఇద్దరు కలిసి శుక్రవారం అర్ధరాత్రి లక్ష్మీనగర్‌కాలనీ– తిమ్మసానిపల్లి మధ్యలో ఉన్న రైల్వేట్రాక్ దగ్గర తపంచ ఒక రౌండ్ పేల్చారు. అదే సమయంలో లక్ష్మీనగర్‌కాలనీలో పెట్రోలింగ్ చేస్తున్న రూరల్ పోలీసులకు గన్ పేలిన సౌండ్ వినిపించింది. దీంతో పోలీసులు రైల్వేట్రాక్ వెంబడి సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంటే వరద రవి, కన్నయ్య ఇద్దరు కలిసి టీఎస్ 06 ఈఎక్స్ 7345 నంబర్ గల పల్సర్ బైక్‌పై పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆపి తనిఖీ చేయగా వరద రవి దగ్గర తపంచ, మూడు బుల్లెట్లు, ఒకటి కాల్చిన ఖాళీ బుల్లెట్ లభ్యమయ్యాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు మరింత లోతుగా విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ విషయంలో గొడవ తిమ్మసానిపల్లికి చెందిన వరద రవికి అదే గ్రామానికి చెందిన పాపిగారి రవితోపాటు అతని గ్యాంగ్‌కు 2017లో ఓ మహిళ విషయంలో గొడవ జరిగింది. అదేవిధంగా 2018 న్యూ ఇయర్ వేడుకల్లో వరద రవికి పాపిగారి రవి గ్యాంగ్ మధ్య జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందినవారు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో ఇరువర్గాలపై అప్పట్లో కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన వరద రవి అతనికి అడ్డు వస్తున్న పాపిగారి రవి, అతని గ్యాంగ్‌ను అడ్డులేకుండా చేయాలనే ఉద్దేశంతో గతేడాది ఉత్తరప్రదేశ్‌కు చెందిన గప్‌చుప్‌లు విక్రయించే ఓ వ్యక్తితో రూ.20 వేలకు తపంచ కొనుగోలు చేశాడు. దానిని శుక్రవారం రాత్రి పనిచేస్తుందో లేదోనని టెస్టింగ్ చేయడానికి రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి పోలీసులకు పట్టుబడ్డాడు. రూరల్ పోలీసులు పాలమూరులో ఒక మర్డర్ కాకుండా ఆపడంతో పాటు ఒక ప్రాణాన్ని కాపాడినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం తపంచ విక్రయించిన వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలో అతనిని అదుపులోకి తీసుకొని మరింత విచారణ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడిన ఏ1 వరద రవి, ఏ2 కన్నయ్యలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. పట్టుబడిన వారి నుంచి కంట్రీమెడ్ వెఫన్ (తపంచ), మూడు లైవ్ బుల్లెట్లు, ఒక ఖాళీ బుల్లెట్, ఒక నాటు కొడవళి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ మహేశ్వర్‌రావు, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, వెంకటయ్య, రమేష్, పృథ్వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసలేం జరిగింది.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వ్యాపారం నిమిత్తం పాలమూరుకు వచ్చాడు. అతను తిమ్మసానిపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే గప్‌చుప్‌ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఉత్తరప్రదేశ్‌లో తపంచ, గన్లను తక్కువ ధరకు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో కొనుగోలు చేసి వాటిని మహబూబ్‌నగర్‌లో రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతని దగ్గర కొందరు వ్యక్తులు తుపాకులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతను పాలమూరులో ఎన్ని గన్స్ విక్రయించాడనే విషయం తెలియాలంటే పరారీలో ఉన్న ఆ వ్యక్తి అదుపులోకి తీసుకుంటే తప్ప వెలుగులోకి రావు. -
పోలీస్‌శాఖపై నజర్; పెరుగుతున్న ఏసీబీ దాడులు
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదన్నట్లుగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అవినీతికి తెగబడుతున్నారు. పని ఏదైనా పైసలిస్తేనే చేస్తామని తెగేసి చెబుతున్నారు. ప్రజలతో సత్సంబంధాలు అధికంగా ఉండే రెవెన్యూ, పోలీసుశాఖలోనే అవినీతి తిమింగలాలు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా ఈ శాఖలపైనే ఎక్కువగా వస్తుండటంతో ఏసీబీ అధికారులు దృష్టిసారించి పట్టుకుంటున్నారు. సాక్షి, నాగర్‌కర్నూల్: సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అవినీతి దందాలను అరికట్టాల్సిన పోలీసుశాఖకు కొంతమంది చెడ్డపేరు తెస్తున్నారు. వారి వ్యవహారశైలి కారణంగా మొత్తం పోలీసుశాఖకు మచ్చ తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఉచితంగా ప్రజలకు సేవలు అందాల్సి ఉండగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అక్రమ సంపాదనకు అలవాటుపడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఎంతోకొంత ముట్టజెప్పినా అది సరిపోదన్నట్టుగా అత్యాశకు పోయి ఇంకా ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోతున్న బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ దాడుల్లో 8 మంది అధికారులు పట్టుబడ్డారు. వారిలో పోలీసు, రెవెన్యూశాఖల అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఏడు నెలల్లో 8 ఏసీబీ కేసులు.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఏడు నెలల్లో 8మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. ఫిబ్రవరి 19వ తేదీన అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన వీఆర్ఓ రైతు నుంచి రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మార్చి 5వ తేదీన దామరగిద్దలో రూ.20వేలు లంచం డిమాండ్ చేసిన హెచ్ఎం ఏసీబీకి పట్టుబడ్డారు. మార్చి 12న మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామానికి చెందిన వీఆర్ఏ రూ.15వేలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ వలలో పడ్డాడు. ఇసుక ట్రాక్టర్ యజమానులతో రూ.20వేలు పుచ్చుకుంటూ బల్మూర్ ఎస్ఐ, కానిస్టేబుల్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆగష్టు 8వ తేదీన రూ.12వేలు లంచం తీసుకుంటూ మిడ్జిల్ ఎలక్ట్రిసిటీ ఏఈ ఏసీబీకి దాడిలో పట్టుబడ్డాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న మరుసటి రోజే మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీసుస్టేషన్లో ఇసుక వ్యాపారి నుంచి రూ.17వేలు లంచం తీసుకుంటూ తిరుపతిరెడ్డి అనే కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈనెల 4వ తేదీన వనపర్తి జిల్లా కేం ద్రం లో ఓ క్వారీ పేరు మార్చేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేసిన మైనింగ్ ఏడీ సా మ్యూల్ జాకబ్, ఆర్ఐ సాయిరాంలు ఏసీబీ కి చిక్కారు. గతంలోనే రూ.లక్ష లంచంగా తీసుకున్నప్పటికి, మళ్లీ రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో చేసేది లేక బా ధితులు దిలిపాచారీ ఏసీబీని ఆశ్రయించాడు. తాజాగా తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన పశువుల సంత కాంట్రాక్టర్‌ను ప్రతినెలా డబ్బులు ఇవ్వాలంటూ ఎస్ఐ వెంకటేష్ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేరుగా డబ్బులను తన ఇంటికి వచ్చి ఇవ్వాలని చెప్పగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. పోలీసుశాఖపై దృష్టి సమాజానికి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుశాఖలో అవినీతి పెచ్చుమీరుతుం దన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెలా ఇసుక, మద్యం, ఇతర వ్యాపారుల నుంచి మామూళ్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా పోలీసుస్టేషన్లలో పంచాయతీలు నిర్వహిస్తూ డబ్బులు వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. స్టేషన్ పరిధిలో ఏ వ్యాపారం జరిగినా తన వాటా ముట్టజెప్పాల్సిందేనన్న తీరుగా కొంతమంది ఎస్ఐలు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సివిల్ కేసు ల్లోనూ తలదూర్చుతూ తమకు అనుకూలమైన వారికి సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రజలనుంచి బహిరంగంగా విమర్శిలున్నా యి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అటాచ్ చేయడమో, బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం వంటి సంఘటన లు నిత్యం జరుగుతూనే ఉన్నా వారిలో మా ర్పు రావడంలేదు. ఈ మధ్య ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోవడంతో ఏసీబీ అధికారు లు పోలీసుశాఖపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఏడు నెలల్లో ఏసీబీకి పట్టుబడి న 8 కేసుల్లో ఉమ్మడి జిల్లాలో మూడు కేసు లు పోలీసుశాఖకు చెందిన వారిపైనే ఉన్నాయి. -
కిడ్నాప్ ముఠా అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: డబ్బుల కోసం రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి..విక్రయించిన ముఠాను మహబూబ్‌నగర్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 13న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు పోట్టోళ్ల చిట్టి అలియాస్ హద్దులమ్మ తన భర్త యాదయ్యతో కలిసి తమ కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. చివరకు క్రైం టీం కానిస్టేబుల్స్‌కు వచ్చిన సమాచారం మేరకు వీరన్నపేట ఓ ఇంట్లో చిన్నారి ఉందని గుర్తించి ఆ ఇంట్లో తనిఖీలు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని ఎర్రకుంటకు చెందిన పోట్టోళ్ల చిట్టి అలియాస్ హద్దులమ్మ, యాదయ్య దంపతులకు నలుగురు ఆడ సంతానం ఉన్నారు. కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తూ సొంత ఇళ్లు లేకపోవడంతో వల్లభ్‌నగర్‌లో ఉండే మదర్సాలలో పడుకుంటారు. అయితే పది రోజుల కిందట పోట్టోళ్ల చిట్టి, యాదయ్య తమ పిల్లలతో దొడ్డలోనిపల్లి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న సమయంలో వీరన్నపేటకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ సలీం, తస్లీమ్, సమీనా నహిద్ కలిసి కల్లు తాగడానికి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలిసి పోట్టోళ్ల చిట్టిని నీకు నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు కదా మాకు ఒక్కరిని ఇవ్వాలని అడిగారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. అయితే మీరు ఎక్కడ ఉంటారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నాప్.. ఆ వెంటే విక్రయం ఈనెల 13న రాత్రి పట్టణంలోని వల్లభ్‌నగర్ దగ్గర ఉన్న మదర్సా పాఠశాల ఆవరణలో చిట్టి, యాదయ్య దంపతులతో పాటు పిల్లలు పడుకున్నారు. ఈ క్రమంలో తస్లీం, సమీనా నహిద్లతో కలిసి సలీం ఆటోలో వచ్చి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుండగా చిట్టికి మెళకువ వచ్చి వారి వెంటపడింది. కిడ్నాపర్లు ఆటోలో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు వీరన్నపేటకు చెందిన ఖతీజా బేగంకు రూ.10వేలకు చిన్నారిని ముగ్గురు ముఠా సభ్యులు విక్రయించారు. ఆ తర్వాత బాధితురాలు పోట్టోళ్ల చిట్టి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని ఇద్దరు బూర్కా ధరించిన మహిళలు, ఒక వ్యక్తి ఆటోలో వచ్చి పాపను ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఐదు బృందాలతో గాలింపు దీంతో ఈ కేసును చేధించడానికి ఐదు ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ బృం దాలను ఏర్పాటు చేసి అనుమానం కల్గిన ప్రాంతాలను తనిఖీలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, కాచి గూడ రైల్వేస్టేషన్లు, హైదరాబాద్ ప్రధాన బస్టాండ్లు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటు మరికొన్ని బృందాలు రాయిచూర్, నారాయణపేట, కర్నూల్ తనిఖీలు చేశారు. అదేవిధంగా పాపను ఆటోలో కిడ్నాప్ చేయడం వల్ల పట్టణంలో ఉన్న ఆటోలపై దృష్టి పెట్టి తనిఖీలు చేయగా కొంత సమాచారం లభించింది. దీంతో క్రైంపార్టీ పోలీసులు వీరన్నపేట ఖతీజా బేగం ఇంట్లో రెండు నెలల చిన్నారి ఉందని గుర్తించి వారందరిని గురువారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా మదర్సాలో కిడ్నాప్ చేసి న చిన్నారియే అని ఒప్పుకోవడం జరిగిం ది. దీంతో పోలీసులు వారి నుంచి చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతం అయ్యింది. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన ఆటో, రూ.700నగదు సీజ్ చేయడంతో పాటు నలుగురు నేరస్తులను మహ్మద్ సలీం, తస్లీమ్, సమీనా నహిద్, ఖతీజా బేగంను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు పరిశోధనలో ప్రతిభ కనబర్చిన వన్‌టౌన్ సీఐ రాజేష్, క్రైం పార్టీ కానిస్టేబుల్స్ తిరుపతిరెడ్డి, నరేష్, క్రైం టాస్క్‌ఫోర్స్ బృందాలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్ పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి జవాన్ మృతి
వంగూరు రూరల్: రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ దేశానికి రక్షణ కల్పించిన ఓ జవాన్.. భార్య, కుటుంబసభ్యులను కలిసేందుకు స్వస్థలానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో అతడిని మృత్యువు కబళించింది. దీంతో ఎన్నో రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడని.. మరెన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట పట్టణానికి చెందిన సోమ రాజశేఖర్(35) అనే జవాన్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్ దగ్గర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, శనివారం విధులు ముగించుకుని సెలవుపై తమ కుటుంబసభ్యులను కలిసేందుకు స్వగ్రామానికి కారులో బయల్దేరాడు. అదుపుతప్పి కారు బోల్తా.. ఈక్రమంలో హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు కారులో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మండలంలోని సర్వారెడ్డిపల్లి స్టేజీ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమరాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మహేష్ గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకుని మహేష్‌ను వైద్యం నిమిత్తం, సోమరాజశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. అచ్చంపేటలో విషాదఛాయలు ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తూ.. రోడ్డు ప్రమాదంలో తమ వాడు మరణించాడని తెలియడంతో ఆ కుటుంబసభ్యులతోపాటు అచ్చంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానిక జూబ్లీనగర్‌కు చెందిన సోమభారతి, యాదయ్యకు నల్గురు సంతానం ఉండగా.. అందులో అందరికంటే చిన్నవాడు రాజశేఖర్(రఘు, చిన్న). 16ఏళ్లుగా ఆర్మీలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్ దగ్గర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవు తీసుకుని శనివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా.. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి స్టేజీ వద్ద కారు బోల్తా పడి దుర్మరణం చెందాడు. రాజశేఖర్‌కు ఐదేళ్ల క్రితం అలేఖ్యతో వివాహమైంది. వీరికి సంతానం లేదు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు రాజశేఖర్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. అందరితో కలిసి ఉండే రాజశేఖర్ ఇక లేడని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. అచ్చంపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత కల్వకుర్తి ఆసుపత్రి నుండి అచ్చంపేటకు జవాన్ మృతదేహాన్ని తీసుకవచ్చారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గువ్వల అమల, మున్సిపల్ ఛైర్మన్ తులసీరాం, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాలాజీ, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్, వీహెచ్‌పీ, బీవీఎస్, రాజశేఖర్ స్నేహితులు జవాన్ మృతి పట్ల నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం జూబ్లీనగర్ నుంచి రాజశేఖర్ అంతిమయాత్రను నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ నర్సింహులు, సీఐ రామకృష్ణ, ఎస్ఐలు పరుషరామ్, విష్ణు, పలువురు పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు
పాలమూరు: మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి 17వ లోక్‌సభకు తమ ప్రతినిధిగా ఎవరిని పంపాలనే నిర్ణయాన్ని ప్రజలు ఓటు రూపంలో తీర్పునివ్వగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇది చేసి 40 రోజులు దాగా అందులో దాగి ఉన్న ఓటర్ల మనోగతం తేలేందుకు గడువు సమీపిస్తోంది. ఈనెల 23న గురువారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించగా అదేరోజు రాత్రి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఈవీఎంలను సీల్ చేసి జిల్లా కేంద్రంలోని జేపీఎన్‌ఈఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. అదే కళాశాలలో ఓట్లు లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు అనంతరం సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈవీఎంలను తెరిచి రౌండ్ల వారీగా ఓట్లు లెక్కిస్తారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా ఓట్లు లెక్కించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మొదటి రౌండ్లు అన్నింటినీ కలిపి పార్లమెంట్ స్థానంలో మొదటి రౌండ్‌గా గుర్తించి ఫలితాలు వెల్లడిస్తారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను, పార్లమెంట్ స్థానంలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను పార్లమెంట్ స్థానంలో రౌండ్ల వారీగా మొదట ఎన్నికల సంఘానికి చెందిన సువిద వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాతే మీడియాకు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్లు లెక్కించే కేంద్రంలో నిరంతరం వీడియో చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకోసం సీసీ కెమెరాలు బిగింపు పూర్తయింది. సీసీ కెమెరాల ద్వారా మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌తోపాటు హైదరాబాద్, ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయాల్లో లైవ్‌గా వీక్షించే ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. 23న ఉద యం 8గంంటలకు ఓట్లు లెక్కింపు ప్ర క్రియ ప్రారంభమైనా మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో తుది ఫలితం రాత్రి 7గంటల తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీవీప్యాట్ చిట్టీల లెక్కింపు తొలిసారిగా వీవీప్యాట్లలోని చిట్టీలు (ఓటర్ స్లిప్) లెక్కించనున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని 5పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్లు తెప్పించి, వాటిలోని ఓటర్ స్లిప్‌లు బయటకు తీసి లెక్కిస్తారు. ఓటరు చిట్టీలు అభ్యర్థుల గుర్తులు వారీగా వేరు చేసి 25 చిట్టీలు ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. వీవీప్యాట్లలో లెక్కించిన చిట్టీలు, అంతకుముందు ఈవీఎంలలో లెక్కించిన ఓట్లు సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చిట్టీలు మళ్లీ లెక్కిస్తారు. వీవీప్యాట్లలోని చిట్టీలను లెక్కించేందుకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో లాటరీ పద్ధతిన 5 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేస్తారు. అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 14 టేబుళ్లు వేస్తారు. 14టేబుళ్లపై ఒకసారి లెక్కించిన ఓట్లు ఒక రౌండ్‌గా భావిస్తారు. ఇలా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓటర్ల ఆధారంగా రౌండ్లు నిర్ణయిస్తారు. ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ రౌండ్లు ఉంటాయి. తక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్కువ రౌండ్లు ఉంటాయి. కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన మహబూబ్‌నగర్ న్యూటౌన్: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ భగీరథకాలనీ జేపీఎన్‌ఈఎస్ కళాశాల వద్ద కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లు, టేబు ళ్లు, బారీకేడ్లు, కళాశాల వద్ద భద్రత వంటి విషయాలను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత ఏఆర్వోలకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ జేసీ స్వర్ణలత, కలెక్టరేట్ ఏఓ ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీవీప్యాట్లలో స్లిప్పుల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పా టు చేసిన సమావేశంలో కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన వీవీప్యాట్లలో స్లిప్పులను లెక్కించాల్సి ఉందని, వీవీప్యాట్ల లెక్కిం పు అనంతరం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఇన్చార్జి జేసి స్వర్ణలత, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సి.హెచ్.శ్రీనివాస్, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంతు‘చిక్కట్లే’..!
ఉమ్మడి జిల్లాలో అదృశ్య కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. కనిపించకుండా పోతున్న వారిలో మహిళలు, బాలికలే అధికంగా ఉండటం విశేషం.. ఇందులో కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తున్నా.. మరికొందరు ఏమైపోతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకరోజులో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకటి లేదా రెండు కేసులు తమ వాళ్లు అదృశ్యం అయ్యారని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే కొందరు మతిస్థిమితం కోల్పోయిన వారు.. మరికొందరు ప్రేమ, ఇతర వ్యవహారాలతో కనిపించకుండా పోతున్నారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లపైబడిన వారు మూడేళ్లలో 963 మంది అదృశ్యమవగా.. 259 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాల విభజన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో 2017 సంవత్సరంలో 104 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. 2018లో 136, 2019లో 28 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 298 అదృశ్య కేసులు నమోదైతే ఇందులో పదేళ్లలోపు వారు 110 మంది ఉండగా 188 మంది యువతులున్నారు. గద్వాల జిల్లాలో 2017లో నమోదైన 52 కేసులలో 23 మంది మహిళలు, 29 మంది చిన్నారులు, 2018లో 92 కేసులు నమోదవగా.. 69 మంది మహిళలు, 23 మంది చిన్నారులు, 2019లో 26 కేసులు నమోదు కాగా.. 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2017లో 270 కేసులు నమోదైతే 252 కేసులు ఛేదించారు. 2018లో 260 కేసులు నమోదు కాగా.. 125 కేసులు ఛేదించారు. 2019లో ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం వలస వెళ్లి.. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మక్తల్, నారాయణపేట, కొడంగల్, గద్వాల నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరిలో దినసరి కూలీలు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదృశ్యమయ్యారు. ముఖ్యంగా కొయిలకోండ, నవాబుపేట, మద్దూరు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబయి, కర్ణాటక, పుణె తదితర నగరాలకు వెళ్లడంతోపాటు గల్ఫ్ దేశాలకు వెళ్తారు. ఇలా వెళ్లిన వారిలో చాలామంది అమాయకులు తప్పిపోతున్నారు. ఇందులో కొంత మంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తామని తీసుకువెళ్లి మోసం చేస్తుండటంతో.. వారు తిరిగి రాలేకపోతున్నారు. అన్ని స్టేషన్లలో పెండింగే.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 74 పోలీస్స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్‌లో వందల సంఖ్యలో అదృశ్య కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటు కుటుంబ సభ్యులు.. బంధువులు గాలిస్తుంటే.. మరోవైపు పోలీసులు వారి కోణంలో గాలిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులలో చాలా వరకు అదృశ్యమైన వారు కనిపించకపోవడంతో ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. దీనికి తోడు పోలీసులు సైతం అదృశ్యమవుతున్న కేసులపై అందగా దృష్టిసారించకపోవడంతో రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలు.. చచ్చుబండలు మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.. అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస.. బాలికలపై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. కామాంధుల చేతుల్లో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం బలవుతున్న ఘటనలు కోకొల్లలు వెలుగుచూస్తున్నాయి. పండంటి కాపురంలో కలతలు నెలకొనడంతో రోజూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్న మహిళల సంఖ్య పెరుగుతోంది. వారంతా అత్తింటి నుంచి రక్షణ కోసం ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మంది భార్యాభర్తలకు పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్లో దారికి రాని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇవీ చేపట్టాల్సిన చర్యలు పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్ నంబర్లు గుర్తుండేలా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతోపాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించాలి. త్వరగా ఛేదిస్తున్నాం.. జిల్లాలో బాలికలు అదృశ్యమైతే కిడ్నాప్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. ఒక మర్డర్ కేసుకు ఇచ్చే ప్రాముఖ్యతను ఈ కేసుకు ఇస్తున్నాం. మేజర్ మహిళలు అదృశ్యమైతే మిస్సింగ్ కేసులు పెడుతున్నాం. ప్రతి కేసుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. పెండింగ్‌లో లేకుండా చూస్తున్నాం. యువతులు కొత్త వ్యక్తులను ఏమాత్రం నమ్మరాదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ, మహబూబ్‌నగర్ -
సీరియల్ కిల్లర్ అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 17న నవాబ్‌పేట పీఎస్ పరిధిలో రాజాపూర్ మండలం చొక్కంపేట్ గ్రామానికి చెందిన కటిక బాలరాజు (50)ను హత్య చేసిన ఘటనపై నవాబ్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి మహ్మద్ యూసుఫ్ అలియాస్ ఇసాక్‌ను బుధవారం కుల్కచర్ల మండలం చౌడపూర్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వివరాల ప్రకారం.. రాజాపూర్ మండలం చొక్కంపేట్‌కి చెందిన మృతుడు కటిక బాలరాజుకు తక్కువ ధరకు గొర్రెలను ఇప్పిస్తానని నిందితుడు మహ్మద్ యూసుఫ్ ఫిబ్రవరి 17న నవాబ్‌పేట శివారుకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత బాలరాజు కంట్లో కారంపొడి చల్లి హత్య చేశాడు. అతని దగ్గర ఉన్న రూ.14 వేలు తీసుకొని పరారయ్యాడు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. యూసుఫ్‌పై 12 హత్య కేసులు, ఐదు దొంగతనం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో వికారాబాద్ హత్య కేసులో, హైదరాబాద్‌లోని 2 దొంగతనాల కేసులో మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. యూసుప్ నుంచి 4 బైక్‌లు, 3 సెల్ఫోన్లు, రూ.2,500 నగదు సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ రివార్డులతో అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, జడ్చర్ల సీఐ బాలరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నరబలి చేస్తాడని ప్రచారం.. అమాయక ప్రజలను, కూలీలను ఎంపిక చేసుకొని వారిని మహ్మద్ యూసుఫ్ అపహరించి ధనం కోసం నరబలి చేస్తుంటాడని ప్రచారం సాగుతోంది. నరబలి చేస్తే ధనం దొరకుతుందనే మూఢనమ్మకంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన హత్యలు అన్నింటినీ వాటికోసమే చేసినట్లు సమాచారం. -
మహబూబ్‌నగర్ జిల్లా దమ్మాయిపాలెంలో ఉద్రిక్తత
-
పాలమూరుకు పచ్చని పైట
పాలమూరు : కరవు కటకాలతో అల్లాడుతూ జీవకళ కోల్పోయిన జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించడానికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరంగా మారనుందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌మైదానంలో శనివారం ఉదయం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల వారీగా ప్రగతిని వివరించారు. ఆ వివరాలు కలెక్టర్ మాటల్లోనే... ూ సాగునీటి రంగం : పాలమూరు–రంగారెడ్డి పథకం కింద 22మండలాల్లోని 4,13,167 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. సంగంబండ రిజర్వాయర్ కింద ఖరీఫ్, రబీ–2018లో 40వేల ఎకరాలు, రబీ–2019లో 5వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం. దీంతో పాటు 45 చెరువులు నింపాం. ఇక భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఖరీఫ్, గత రబీలో 37వేల ఎకరాల ఆయకట్టు నీళ్లు ఇవ్వడంతో పాటు 33చెరువులు నింపాం. కోయిల్‌సాగర్ ఎత్తపోతల కింద ఖరీఫ్, రబీ–2018కి సంబంధించి 25వేల ఆయకట్టుకు నీటి సరఫరా చేయడంతో పాటు 42చెరువులకు నీటిని అందించాం. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో 2,563 చెరువును ఐదేళ్లలో పునరుద్ధరించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1,191 పనులను రూ.154.45కోట్లతో పూర్తి చేశాం. అలాగే, జిల్లాలో 3,11,894 మంది రైతులకు కొత్త పట్టదార్ పాసుపుస్తకాలు పంపిణీ చేశాం. వ్యవసాయం : రైతు బంధు పథకంలో భాగంగా జిల్లాలో 2,82,120 మంది రైతులకు రూ.316.32 కోట్ల విలువైన 2,87,075 చెక్కులు పంపిణీ చేశాం. రబీ 2018–19 సీజన్లో 2,90,611 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 2,34,271 మంది రైతుల ఖాతాల్లో రూ.276.34 కోట్లు జమ చేశాం. రైతు భీమా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,69,260 మంది అర్హులైన రైతులను గుర్తించి భీమా పత్రాలు అందజేశాం. ఇందులో ఇప్పటి వరకు 486మంది రైతులు మృతి చెందగా 413 మంది కుటుంబ సభ్యులకు రూ.20.65కోట్లు వారి ఖాతాల్లో వేశాం. భూసార ఆరోగ్య కార్డు పథకం కింద 2018–19గాను 25.519 మట్టి నమూనాలను సేకరించి 19,136 పరీక్ష ఫలితాలను రైతులకు ఇచ్చాం. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద రూ.2.03కోట్ల వ్యయంతో పండ్ల తోటల విస్తరణ, ఫాంపాండ్స్, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేశాం. పశు సంవర్ధక శాఖ : జిల్లాలో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఇప్పటి వరకు 220మెట్రిక్ టన్నుల స్వల్పకాలిక, మేలుజాతి పశుగ్రాస విత్తనాలను 75శాతం సబ్సిడీపై రైతులకు ఇచ్చాం. ఇప్పటివరకు 2,096మందికి పశువులు పంపిణీ చేశాం. మార్కెటింగ్ : జిల్లా కేంద్రంలో రూ.5.50కోట్ల వ్యయంతో రైతు బజార్ ఏర్పాటు, 13మండలాల్లో గోదాములు 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేశాం. విద్యుత్ : 2018–19 ఏడాదిలో రూ.38.15 కోట్ల విలువైన 23 ఉపకేంద్రాలు మంజూరు కాగా,ఇందు లో నాలుగు ఉపకేంద్రాల పనులు పూర్తయ్యాయి. వ్యవసాయ బావుల విద్యుత్ కోసం కోసం 5,761 దరఖాస్తులు రాగా 3,983 కనెక్షన్లు ఇచ్చాం. ఆర్అండ్బీ: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కలెక్టరేట్ కాంప్లెక్స్ కోసం రూ.43.83కోట్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధాన రహదారుల కోసం 158.10 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.210.57 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్ పట్టణ బైపాస్ నిర్మాణానికి రూ.96.70కోట్లు మంజూరయ్యాయి. పౌరసరఫరాల శాఖ : రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో భాగంగా ఐకేపీ ద్వారా 39వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 45676.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇందుకోసం 11,398 మంది రైతులకు రూ.75.83కోట్లు చెల్లించాం. వైద్య, ఆరోగ్యశాఖ : కంటి వెలుగు పథకం కింద జిల్లాలో 6,96,431 మంది కంటి పరీక్షలు చేసి 1,02,796 అద్దాలు అందజేశాం. ఇక 1,177మందికి ఆపరేషన్లు చేయించాం. జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో 15 అధునాతన లేబర్ రూంలు నిర్మాణం పూర్తిచేశాం. డీఆర్డీఓ : 2018–19 ఏడాదిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద రూ.99.63కోట్లతో 89,285 కుటుంబాల్లోని 1,41,203 మంది కూలీలకు 36.14లక్షల పనిదినాలు కల్పించాం. జిల్లాలోని 96 గ్రామాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాం. మత్స్యశాఖ : జిల్లాలో 251 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 185 చెరువుల్లో 1.15 కోట్ల చేప విత్తనాలు వదిలాం. దీంతో పాటు మత్స్యకారులకు 2,163 ద్విచక్ర వాహనాలు, 183 నాలుగు చక్రాల వాహనాలు సబ్సిడీపై అందజేశాం. అటవీశాఖ : ఈ ఏడాది వేపూర్, మునిమోక్షం అటవీ ప్రాంతాల్లో 66.60 హెక్టార్ల విస్తీర్ణంలో 77, 572 మొక్కలను నాటాం. జాతీయ రహదారి సుం దరీకరణలో భాగంగా 57 కిలోమీటర్ల పొడవున 25, 147మొక్కలు, అంతర్రాష్ట్ర రోడ్ల వెంబడి 51,750 మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని అప్నన్నపల్లి సమీపంలో ఉన్న మయూరి ఎకో పార్క్‌ను సుందరీకరించాం. -
ప్రలోభాల పర్వం!
మహబూబ్‌నగర్ క్రైం: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు నేడు సోమవారం జరగనున్నాయి. అంచెలంచెల వ్యూహాలతో ఆయా పార్టీల అభ్యర్థులు పంపకాల పర్వానికి తెరతీశారు. ప్రలోభాలే ఓటు బ్యాంకుగా భావిస్తూ నోటుకు ఓటు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఓటు బలాన్ని నోటు బలహీనతతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో భారీగా మద్యం, డబ్బు పంపకానికి తెరతీశారు. శని, ఆదివారాల్లో రాత్రివేళ ఓటర్ల చెంతకు నోట్లను చేరవేశారు. అయితే ముందస్తుగానే నగదును, మద్యాన్ని ఆయా గ్రామాలు, వార్డులకు గుట్టుగా పంపించడంతో పంపిణీ చేసే ప్రక్రియ సులువుగా సాగింది. పంపిణీలోనూ పోటాపోటీ కొన్ని చోట్ల పంపిణీ జరుగుతుండగా వివిధ పార్టీ్ట ల నాయకులు గొడవలకు సైతం దిగుతున్నారు. నువ్వా.. నేనా అంటూ ప్రచారం చేసి పంపిణీలో సైతం అదేస్థాయిలో పోటీ పడ్డారు. ఓటర్లు సైతం బహిరంగంగానే డబ్బులు అడుగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.300 మాత్రమే ఇచ్చారని, వేరే పార్టీలు ఇంకా ఎక్కువగానే ఇస్తున్నారని నిలదీసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఒక ఓటు వెయ్యి రూపాయలు ఆపైనే పలికినట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల పక్కా హామీ తీసుకుని అభ్యర్థులు డబ్బును వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఊరూవాడా మందు పార్టీలు పల్లెలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జోరుగా మందు పార్టీలు, బిర్యాని విందులు నడుస్తున్నాయి. కొందరు అభ్యర్థులు ఉదయం నుంచి భోజనం ఏర్పాటు చేస్తే మరికొందరు రాత్రి వేళలో మద్యం, చికెన్, మటన్ అడిగిన పద్ధతుల్లో చేసి ఖుషీ చేస్తున్నారు. ఏ వీధి చూసినా బృందాలుగా సిట్టింగ్‌లు నడుస్తున్నాయి. పార్టీల వారీగా పంపకాలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్ష దైవంగా భావించడం పరిపాటి. ఏ పుట్టలో ఏ పాముందో అదే మనకు బలంగా మారుతుందో అంటూ అందరిని ప్రసన్నం చేసుకోవడం సహజం. కానీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే తమ ఓటు వీళ్లని నమ్మిన వాళ్లకే డబ్బు చెల్లిస్తున్నారు. ఆ మేరకు వార్డుల వారీగా మాత్రమే డబ్బు అందజేస్తున్నారు. పైకి ధీమా..లోలోపల దిగులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కొందరు అభ్యర్థులు ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. కింది వ్యక్తులపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయకుల్లో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. ఓటు బాసలు చేయించుకున్నారు. నోటు ఊసులు చెప్పుకున్నారు. కానీ ఓటరు నాడి పట్టుకోవడంలో ఊగిసలాట కొనసాగుతోంది. పంపకాల పేచీలు కలవరపాటు గురి చేస్తున్నాయి. ఒక్క ఓటుకు రూ.300, రూ.500 వెచ్చించినా ఓటు మాకే వేస్తారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం గుబులు పట్టి పీడిస్తోంది. ఇదిలా ఉంటే ద్వితీయ శ్రేణి నాయకుల మాత్రం ఇది ఒక దఫా మాత్రమే ఇంకా ఒకరోజు సమయం ఉంది కదా..! కంగారు పడకండి అంటూ ఓటర్లను సముదాయించే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలోపు మీకు నజరానాలు తప్పక అందుతాయంటూ ఆశ పెడుతున్నారు. భారీగా మద్యం నిల్వలు ఈ ధపా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను వశం చేసుకోవడానికి సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకవైపు మద్యం అమ్మకాలు, తరలింపుపై భారీ స్థాయిలో నిఘా కొనసాగుతున్నా ఓటర్లకు మాత్రం మద్యం చేరుతోంది. కొందరు నాయకులు కార్యక్తలకు చీటీలను పంపిణీ చేస్తే మరి కొందరు టోకన్లు అందిస్తున్నారు. మరి కొందరు నేరుగా ఇంటింటికి వెళ్లికి మరీ ముట్టచెప్పుతున్నారు. ఈ వ్యవహారంలో గ్రామాల్లో ఖాళీగా ఉన్న యువకులు కీలక పాత్ర వహిస్తున్నారు. బృందాలు ఏర్పడి ఆయా గ్రామాల్లో ద్విచక్ర వాహనాలపై మద్యం తరలిస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని గ్రామీణా ప్రాంతాల్లో చీప్ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కేవలం కూలీలు, రైతులు, మధ్యతరగతి వారికి చీప్ లిక్కర్, క్వాటర్స్, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులకు బ్రాండెడ్ బాటిల్స్ అందిస్తున్నారు. ఇక పల్లెల్లో ఓటర్లకు ఇవ్వడానికి రూ.100 నోట్లు, రూ.200నొట్లు భారీ సిద్ధం చేసుకొని తెల్లవారుజామున 4గంటల నుంచి 6గంటల మధ్యలో ఓటర్ల చెంతకు చేర్చడానికి అన్ని ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన నిషా?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి తీసుకుని ఇంట్లో వారిపై దౌర్జన్యాలకు దిగిన సంఘటనలు ఇటీవల వనపర్తి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినట్లు సమాచారం. అయినా కన్నప్రేమ విషయం బయటకు పొక్కనివ్వవటం లేదు. ఈనేపథ్యంలోనే నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి యువకులు చేసుకున్న సంబరాల్లో ఓ యువకుడు మృతి చెందడానికి గంజాయి మత్తే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మత్తులో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వనపర్తి సీఐ సూర్యానాయక్, ఎస్ఐ జములప్ప, రమణ తెలిపిన వివరాలు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వ్యాపారం కోసం కొన్నేళ్ల క్రితం వనపర్తికి వచ్చిన దేవేందర్ ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనతో పాటు తమ్ముడు పుష్పెందర్ (28) వనపర్తిలోనే నివాసం ఉండేవాడు. పుష్పెందర్‌కు గత ఏడేళ్ల క్రితం సుజాత అలియాస్ రాఖితో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత వారు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ వ్యాపారంలో నష్టం వచ్చిందని మళ్లీ నలభై రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి వనపర్తికి వచ్చాడు. తన అన్నవెంట పనిచేసే యోగేష్‌తో కలిసి సోమవారం ఇంట్లోనే మద్యం సేవించిన పుష్పేందర్.. మిత్రుడు భానుకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సంతబజార్‌లో ఎస్పీ కార్యాలయం పక్కన తెలిసిన వ్యక్తులు సాయి, చరణ్ మరికొందరు కనిపిస్తే శుభాకాంక్షలు చెప్పారు. అక్కడే ఇరువర్గాల మధ్య మునుపటి విషయాలపై ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా పుష్పేందర్‌పై సాయి, చరణ్‌తో పాటు మరికొందరు దాడి చేయగా యోగేష్ అడ్డుకునేందుకు యత్నించినా వారు వినకపోవడంతో పారిపోయాడు. ఆ వెంటనే విషయాన్ని పుష్పేందర్ అన్న దేవేందర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న దేవేందర్ ఎస్పీ కార్యాలయం పక్కన రోడ్డుపై పడి ఉన్న పుష్పేందర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిందని ఎస్ఐ జములప్ప తెలిపారు. కాగా, ఈ విషయమై సీఐ సూర్యానాయక్‌ను వివరణ కోరగా.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే అంశంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. -
పొంగి పొర్లింది!
మహబూబ్‌నగర్ క్రైం : ఈ ఏడాది జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ ఏడాది కాలానికి మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు కాసుల పండింది. రెండేళ్ల కాలానికి వైన్స్ అనుమతులు ఇవ్వగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధం గా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర గా.. వైన్స్ యాజమానులకు కూడా కాసుల పంట పండింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అమ్మకాలు జరగడం విశేషం. ఈ మేరకు ప్రస్తుత ఏడాదిలో మద్యం అమ్మ కాలు, ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రత్యేక కథనం. గత ఏడాది అక్టోబర్ నుంచి.. వైన్స్‌ల అనుమతులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అనుమతులు 2019 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ‘ఆనవాయితీ’ ప్రకారం మద్యం పంపిణీ కోసం నేతలు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నాయకులు ముందుగానే మద్యం డంప్‌లు దించేశారు. అటు వైన్స్ యాజమాన్యాలు కూడా ముందస్తుగా భారీగా మద్యం నిల్వలు దిగుమతి చేసుకున్నారు. ఇక ఎన్నికల వేళ అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.1,100.10 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో కొత్త ఏడాదిలో కూడా మద్యం అమ్మకాలు భారీగా సాగే అవకాశముంది. 2019లో కూడా మద్యం అమ్మకాలు ఇదే స్థాయిలో కొనసాగితే అమ్మకాలు ఉంటే దీని విలువ ఉమ్మడి జిల్లా నుంచి 2018, 2019 ఏళ్లకు గాను రూ.2,300 కోట్లకు చేరే అవకాశముంది. దుకాణాదారులకు కాసుల పంట ఈ దఫా లైసెన్స్ పొందిన వైన్స్ యజమానులకు అదృష్టం కలిసొచ్చినట్లే చెప్పాలి. ఏడాదికి రూ.45లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్దేశించగా రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ చెల్లించేందుకు కావాల్సిన నగదును యజమానులు కేవలం ఈ ఒక్క నవంబర్ నెలలో సంపాదించినట్లు చెబుతున్నారు. ఇక వచ్చే అక్టోబర్ 1వ వరకు ప్రస్తుత లైసెన్సుల కాలపరిమితి ఉంది. ఈ మేరకు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికలే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగడం.. వైన్స్ యాజమాన్యాలకు కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. ఈ ఏడాది రికార్డులో ఆదాయం గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో జిల్లాలో రూ.800కోట్ల నుంచి రూ.900కోట్ల వరకు అమ్మకాలు సాగేవి. కానీ ఈ ఏడాది ఏకంగా రూ.1,100.10 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. 2015 అక్టోబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో రూ.872.93 కోట్ల విలువైన అమ్మకాలు సాగగా, 2016 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ వరకు రూ.959.16 కోట్ల అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 2016 కంటే 2017 ఏడాదిలో అమ్మకాలు పెరగగా.. ఈ ఏడాది ఇది మరింత పెరగడం గమనార్హం. ఉన్నతాధికారుల మన్ననలు 2018లో జిల్లాలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఉద్యోగుల పనితీరు ఉన్నతాధికారుల మన్ననలు అందుకుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 100రోజుల యాక్షన్ ప్లాన్‌ను జిల్లా అధికారు విజయవంతంగా అమలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆబ్కారీ శాఖకు అవసరమైన సిబ్బంది లేకపోయినా.. ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా విధులు నిర్వర్తించారు. పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించడం ద్వారా అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యంతో ఎక్సైజ్ పోలీసులు (ఫైల్) ఏడాది మొత్తం కష్టపడ్డాం ఈ ఏడాది కాలంలో మొత్తం ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డాం. ఇదే ఏడాదిలో వంద రోజుల ప్రణాళిక, అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల ప్రణాళికాయుతంగా విధులు నిర్వర్తించాం. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. మా పనితీరును కమిషనర్ అభినందించారు. ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకున్నాం. 24గంటల పాటు మా శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. – జయసేనారెడ్డి, డీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ -
వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను...
మహబూబ్‌నగర్ క్రైం: మహిళను చీర కొంగుతో బిగించి హత్యచేసిన సంఘటనకు సంబంధించిన కేసును పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. సోమవారం సీఐ కిషన్ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. నవాబ్‌పేట మండలం కన్మన్‌కాల్వ గ్రామానికి చెందిన భీమమ్మ(35) భర్త గతంలోనే వదిలేయడంతో కొన్నిరోజులుగా తంగెడపల్లికి చెందిన ముర్గని శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భీమమ్మ ఇతరులతో తిరుగుతోందని శ్రీనివాస్‌కు అనుమానం రావడంతో అప్పటినుంచి ఆమె తరచూ డబ్బుల కోసం వేధిస్తుండేది. అయితే అది సహించని శ్రీనివాస్ ఆమెను తుదముట్టించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే ఈనెల 11న సాయంత్రం 5గంటల సమయంలో నవాబ్‌పేటలో ఉన్న బేకరి దగ్గర కలిశాడు. చీకటి పడిన తర్వాత భీమమ్మకు కల్లు తాగించి నవాబ్‌పేట సమీపంలోని నల్లరాళ్లగుట్ట వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమె గొంతుకు చీర కొంగు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, తాళిబొట్టు, సెల్‌ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టగా శ్రీనివాస్‌ను పిలిపించి విచారించారు. దీంతో తానే హత్యచేసినట్లు బయటపడింది. అతని వద్ద ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుళ్లు వెంకటయ్య, గొవింద్, శంకర్లను అభినందించారు. -
ముందస్తుకు ముమ్మర నిఘా
మహబూబ్‌నగర్ క్రైం : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా పోలీసులు కసరత్తు ప్రారంభించారు. రౌడీషీటర్లు, నేరప్రవృత్తి కలిగిన వారు దౌర్జన్యాలు, గొడవలు, కుమ్ములాటలకు కారణమవుతుంటారు. ఇటువంటి వారిని జిల్లా పోలీసులు ముందుగానే గుర్తించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే, పార్టీల తరఫున నజరానాలు అందించడం తదితర అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయివరకు మూడంచెల విధానం అమలు చేస్తున్నారు. ఆదర్శ ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక వాహనాలు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు 30 ఇన్నావో వాహనాలు, 70ద్విచక్ర వాహనాలను ఇటీవల జిల్లాకు కేటాయించారు. ఇటీవల 30 ఇన్నోవాలు పోలీస్స్టేషన్లకు కేటాయించారు. దీంతో ఆయా వాహనాలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు నిరంతరం గస్తీ ప్రారంభించాయి. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా వెంటనే చేరుకుంటున్న సిబ్బంది.. ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ద్విచక్ర వాహనాలను బ్లూ కోల్డ్ వాహనాలుగా వినియోగిస్తూ గల్లీగల్లీల్లోనూ రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారు. రెవెన్యూ, పోలీసుల సమన్వయం ఎన్నికల విధుల్లో రెవెన్యూ, పోలీసు శాఖలది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో రెండు శాఖలను సమన్వయం చేయటంలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతీ చిన్న అంశాన్ని కూడా తమ వరకు చేరేలా సూచనలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ మేరకు ప్రచారాలు, గోడలపై రాతలు, మీడియాల్లో కథనాలు, సోషల్ మీడియాల్లో పోస్టులు వంటి విషయాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు అనుమతులు లేని పార్టీ కార్యక్రమాలను నిరోధించాలని ఆదేశిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల గుర్తింపు జిల్లాలో పోలీసులు దాదాపు 120సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. గతంలోఆయా గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగిన గొడవలు, ఘర్షణలు, దాడులు, ఓటర్లను మభ్య పెట్టడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ గుర్తింపు చేపట్టారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థాయిలో జరిగిన సమావేశంలో చర్చించారు. తుపాకులు వెనక్కి.. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో లైసెన్సు ఆయుధాలు కలిగిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా తుపాకులు ఉన్న వారంతా తమ దగ్గర డిపాజిట్ చేయాలంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో లైసెన్స్‌దారులంతా ఆయుధాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. జిల్లాలో 400పైగా మంది వ్యాపారులు, రాజకీయ నాయకులు లైసెన్స్ ఆయుధాలు కలిగి ఉన్నారు. వాస్తవానికి గతంతో పోలిస్తే లైసెన్సుల జారీని గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గించారు. తనిఖీలు.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటానికి జిల్లా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బయటి ప్రాంతాల నుంచి నగదు, మద్యం సరఫరా కాకుండా సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖల ఆధ్వర్యాన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా పోలీసులు కూడా ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడానికి నిర్ణయించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో చెక్కు పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. అలాగే, జిల్లాకు చేరిన ప్రత్యేక పోలీసు బృందాలతో తరచూ కవాతు నిర్వర్తిస్తున్నారు. -
‘లెక్క’ తప్పిందా.. సొత్తు గోవిందా!
నాగర్‌కర్నూల్ క్రైం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే బెల్టు షాపులపై జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు బెల్టుషాపుల నిర్వాహకులను బైండోవర్ చేశారు. అధికారులు చెక్‌పోస్టుల వద్ద, బ్యాంకు ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత వారం రోజుల క్రితం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యాపారి వాహనం నుంచి రూ.33,72,330 నగదు పట్టుబడటంతో తరలింపుపై నిఘా తీవ్రతరం చేశారు. వ్యాపారుల్లో ఆందోళన ఎన్నికల సీజన్ కావడంతో వ్యాపారులు, ప్రజలు నగదును ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే జంకుతున్నారు. వ్యాపారులు చాలా వరకు బ్యాం కు చెల్లింపుల ద్వారానే వ్యాపార లావాదేవీ లు కొనసాగిస్తున్నారు. ఆస్పత్రులకు, షాపింగ్‌లు, ఇతర అవసరాల కోసం ప్రజలు నగదును తీసుకువెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నగదుకు సంబంధించి ఆధారాలను చూయిస్తేనే వాటిని సీజ్ చేయమని అధికారులు చెబుతున్నా చాలామందికి ఆ విషయాలు తెలియక నగదుకు సంబంధించిన రశీదులు తీసుకువెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. లావాదేవీలపై సమాచార సేకరణ ఎన్నికలలో ఓటర్లకు నగదు పంచి ప్రలోబాలకు గురిచేసే అవకాశం ఉన్నందున నగదు తరలింపు పై నిఘా పెంచిన అధికారులు బ్యాంకు ఖా తాలపై దృష్టిసారించారు. అభ్యర్థులు నగదును నే రుగా కాకుండా బ్యాంకుల ద్వారా లావాదేవీలు జ రుపుతారనే ఉద్దేశంతో కొద్దిరోజుల నుంచి బ్యాం కుల్లో రూ.లక్షల్లో జరిగిన లావాదేవీలపై ఆదాయ పు పన్ను శాఖ, ఎన్నికల అధికారులుç Üసమాచా రం సేకరిస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో మహిళా సంఘాలు అధికంగా ఉండటంతో వారు రూ.లక్ష ల్లో రుణాలు తీసుకుంటుంటారు. అభ్యర్థులు మ హిళా సంఘాలను ప్రభావితం చేయకుండా ఉం డేందుకు వారి ఖాతాల్లో ఇటీవల జరిగిన నగదు లావాదేవీల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పూర్తి ఆధారాలతో.. ఏ వ్యక్తి అయిన సొంత అవసరాలకు, వ్యా పార లావాదేవీల కోసం, షాపింగ్‌లకు ఇలా ఏ అవసరం నిమిత్తం నగదు తీసుకువెళ్తున్నామనే ఆధారాలను అధికారులకు చూయిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు. తనిఖీలలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే ఆ నగదుకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తారు. సరైన ఆధారాలు చూయించకపోతే సీజ్‌చేసి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. సదరు అధికారి నగదును జిల్లా ఎన్నికల మానిటరింగ్ కమిటీ విచారణ చేసి సరైన ఆధారాలు చూయించకుంటే ట్రెజరీలో డిపాజిట్ చేసి కోర్టులో కేసు వేస్తారు. తనిఖీలలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు పట్టుకుంటే ఆ నగదును సీజ్ చేసి జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలి. జిల్లా ఎన్నికల అధికారి ఆ నగదును ఎస్టీఓలో జమ చేసి ఆదాయ శాఖాధికారులకు సమాచారం ఇస్తే నగదు పట్టుబడిన వ్యక్తికి ఆదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. నగదుకు సంబంధించిన వ్యక్తి ఐటీ రిటరŠన్స్, సరైన ఆధారాలు చూయించి నగదు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా చెక్కులు జారీచేసే అవకాశం ఉంది. చెక్కులను అకౌంట్లో జమ కావడానికి చాలారోజులు పడుతుంది అనుకుంటే బ్యాంకుల నుంచి డిమాండ్ డ్రాఫ్ట్‌లను తీసుకునే అవకాశం ఉంది. ఆధారాలు చూయించాలి ఎన్నికల కోడ్ ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వెంట తీసుకువెళితే నగదుకు సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలలో నగదుకు సంబంధించిన ఆధారాలు చూయించి అధికారులకు సహకరించాలి. ఎవరైనా సరైన ఆధారాలు చూయించకుంటే సీజ్ చేసి ట్రెజరీ కార్యాలయంలో జమ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – హన్మానాయక్, ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నాగర్‌కర్నూల్ -
ప్రత్యేక నిఘా
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎవరు కూడా మద్యం ఇస్తూ ఓటర్లను ప్రలోభపెట్టకుండా పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి మద్యాన్ని దిగుమతి చేసుకునే అవకాశమున్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అన్ని చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు, టీవీల ఏర్పాటుతో పాటు అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటుకు నివేదిక పంపిస్తే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో సీనియర్ అధికారి, నోడల్ అధికారి, రిటర్నింగ్ అధికారులు తరచు సమీక్షించాలని.. ఎక్కడైతే ఎక్కువమొత్తంలో మధ్యం అమ్మకం జరుగుతుందో అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం పోలీసు శాఖ సిబ్బంది పెట్రోలింగ్ చేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కమిషన్, కలెక్టర్ నుండి కానీ పత్రికల ద్వారా సమస్యలు వెల్లడైతే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యాన ఏర్పాటు చేసే చెక్‌పోస్టులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మద్యం అమ్మకాలు, అక్రమ సరఫరా నివారణకు చేపట్టిన చర్యలు వివరించారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ ఉమ్మడి జిల్లా డీసీ జయసేనారెడ్డి, ఈఎస్ అనితతో పాటు ఎక్సైజ్, పోలీసు శాఖల సీఐలు, అధికారులు పాల్గొన్నారు. అక్రమ మద్యం, గుడుంబా నివారణకు రెండు బృందాలు సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, గుడుంబా సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలను అరికట్టేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలోని వైన్‌షాపులు, బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రిమోట్ ఏరియాల వద్ద నిఘా ఏర్పాటు చేసి అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రిటైల్‌గా కాకుండా పెద్దమొత్తంలో ఒకేసారి మద్యం అమ్మితే నేరమవుతుందన్నారు. ప్రతీ షాపులో సీసీ కెమెరాలు ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ షాపులోనైనా ఉన్న స్టాక్‌లో 50 శాతం వరకే అమ్మాలని, దానికంటే ఎక్కువగా అమ్మితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. ఈ అంశాలన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ బృందాల తనిఖీలకు రాజకీయ పార్టీల నాయకులు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ఎస్పీ రెమారాజేశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీఆర్వో కె.స్వర్ణలతతో పాటు వివిధ పార్టీ ల నాయకులు పాల్గొన్నారు. -
మీ త్యాగం చెదరని జ్ఞాపకం
మహబూబ్‌నగర్ క్రైం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన అమరుల త్యాగం చెదరని జ్ఞాపకం లాంటిదని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు స్థూపం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఎస్పీ రెమా రాజేశ్వరి ఒదార్చారు. సంఘ విద్రోహక శక్తులతో పోరాడి ప్రాణాలు వదిలిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరుల కీర్తి.. పోరాట పటిమ తమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, గిరిబాబు, సీఐలు రామకృష్ణ, రాజేష్, కిషన్, రాజు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అమరులకు పూలమాలలతో వందనం సమర్పించారు. పోలీసుల సంక్షేమానికి కృషి సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడం పోలీస్ వృత్తిలో సహజమైన అంశంగా భావించి ప్రతి అధికారి ముందుకుసాగాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ప్రజల సంరక్షణ కోసం నిత్యం పోలీసింగ్ వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పోలీస్ అధికారి ప్రాణాలు త్యాగం చేస్తున్నాడని, కాశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు శాంతి భద్రతలను రక్షించే క్రమంలో ఈ ఏడాది 414 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అందరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి అమరవీరులు చేసిన త్యాగమని కొనియాడారు. రెండు దశాబ్దాల కిందట నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మావోయిస్టులు జరిపిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని, సమాజంలో శాంతియుత వాతావరణ నిర్మాణం కోసం పోలీసు బలగాలు, దేశ రక్షణ కోసం పొరాటం చేసే సైనికులు 39మంది చనిపోయారని గుర్తు చేశారు. పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. పోలీసులకు ప్రజల సహకారం ఉంటే శాంతిభద్రతల రక్షణ సులువవుతుందని, ఎక్కవ జనాభా ఉన్న ఈ సమాజంలో సుమారు లక్ష మందికి ఒక పోలీస్ అధికారి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. గౌరవప్రదంగా కవాతు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. సాయుధ బలగాలు సంప్రదాయ పూర్వకంగా వందనం సమర్పించగా ఎస్పీ రెమా రాజేశ్వరికి స్వీకరించారు. అనంతరం అమరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగానే అమరు పేరున రచించిన పుస్తకాన్ని పరేడ్ కమాండర్ వీరేష్ ఎస్పీకి అందజేయగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు చదివి వినిపించారు. పిల్లలతో ముచ్చటించిన ఎస్పీ కార్యక్రమం అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ రెమా రాజేశ్వరి తన చాంబర్లో ముచ్చటించారు. వారి సాదక బాదకాలను అడిగి తెలుసుకున్నారు. బరువెక్కిన హృదయాలతో వారి కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. వేదికపై పలువురు తమ మనోభావాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తండ్రితో కూతురు గడిపిన రోజులు.. కొడుకుతో తల్లి పంచుకున్న మధుర జ్ఞాపకాలు.. భార్య తన భర్తతో పెళ్లియిన నాటి నుంచి చివరకు పంచుకున్న తీపి గుర్తులు నెమరువేసుకుని భావోధ్వేగానికి లోనయ్యారు. పట్టణంలో శాంతి ర్యాలీ అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి జెండా ఊపి శాంతిర్యాలీ ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశీనాయుడు విగ్రహం వరకు వెళ్లారు. నినాదాలు చేస్తూ విగ్రహానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ వెంకటేశ్వవర్లు, డీఎస్పీ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్‌రావు, డీఎస్పీలు గిరిబాబు, ఇమ్మాన్యుయేల్, డీఎఫ్ఓ గంగారెడ్డి, సీఐలు డివిపి రాజు, రామకృష్ణ, రాజేష్, కిషన్, అమర్నాథ్రెడ్డి, ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, పీపీ బాలగంగాధర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, రాజయ్య, నాగభూషణం, సత్తయ్య, మన్మోహాన్ పాల్గొన్నారు. -
ముందస్తు మద్యం
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలవడంతో మద్యం విక్రయాలు పెరిగాయి. సెప్టెంబర్‌లోనే నాలుగు జిల్లాల్లో కలిపి రూ.60కోట్ల మద్యం కొనుగోలు చేసి స్టాక్ చేశారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాదారులు, బార్ల యజమానులు, రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా డిపోల నుంచి రూ.కోట్ల విలువైన మద్యాన్ని ముందుగానే కొనుగోలుచేసి ఆయా నియోజకవర్గాల్లో నిల్వచేసినట్లు సమాచారం. 2017–19 నూతన ఎక్సైజ్ పాలసీ సోమవారం నాటికి ఏడాది పూర్తికానుంది. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకు ఉమ్మడి జిల్లాలో రూ. 999కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. వచ్చే ఎన్నికల సీజన్ నేపథ్యంలో మరో రూ.2వేల కోట్ల అమ్మకాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి అధికాదాయం సమకూరింది. మద్యం స్టాక్ ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో 66 మద్యం దుకాణాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 45 దు కా ణాలు, వనపర్తిలో 29దుకాణాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 24 దుకాణాలు ఉన్నాయి. అ యితే ఇప్పటికే ఒక్క నాగర్‌కర్నూల్ నియోజవర్గంలోనే దుకాణాల కోసం రూ.6కోట్ల మద్యం కొనుగోలు చేసి స్టాక్ చేసినట్లు తెలిసింది. దీంతో పాటు వనపర్తి నియోజకవర్గం కోసం రూ.4కోట్ల మద్యం డిపో నుంచి తీసుకువెళ్లినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా కోసం రూ.30కోట్ల మద్యం, జో గుళాంబ గద్వాల జిల్లా కోసం రూ.20కోట్ల మ ద్యంను ఆయా డిపోల నుంచి కొనుగోలు చేశారు. 15రోజుల క్రితం కొత్తకోట సమీపంలో నూతన మద్యం డిపో ప్రారంభించారు. ఇక్కడి నుంచి వనపర్తి, కొత్తకోట, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, ఆత్మకూర్, నారాయణపేట, పెబ్బే ర్లో ఉన్న మ ద్యం దుకాణాలకు మద్యం స రఫరా చేస్తారు. ఇదివరకు నాలుగు జిల్లాలకు కలిపి తిమ్మాజిపేట వద్ద ఉన్న మద్యం డిపో నుంచి స రఫ రా అయ్యేది. ప్ర స్తుతం నూతన డిపో ఏర్పాటు చే యడం ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాదా రులు ఇక్కడి నుంచే కొనుగోలు చేయనున్నారు. పంట పడినట్టే ఈ దఫా మద్యం దుకాణాల లైసెన్స్ పొందిన వారికి అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. రెండేళ్ల కాలవ్యవధిలో మద్యం లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.45లక్షలు, రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాలి. అయితే ఈ కాలపరిమితిలో అనేక ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు కిటకిటలాడనున్నాయి. వచ్చే మే నెలలోపు పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. అంతకుముందు సర్పంచ్‌లు, స్థానిక సంస్థలకు ఎన్నిక జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్ పొందినవారికి పంట పండినట్లేనని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల వేళ.. ఆదాయం భళా! వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం (ఎక్సైజ్ పాలసీ) విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆరు స్లాబులు ఉండగా తాజాగా రెండింటిని కుదించి పట్టణ ప్రాంతాల్లో దుకాణం ధర ఏడాదికి రూ.55లక్షలు, గ్రామీణప్రాంతాల్లో రూ.45లక్షలకు సర్దుబాటు చేసింది. అయితే గతంలో కంటే ఈ సారి మద్యం దుకాణాలకు పోటీదారులు గణనీయంగా పోటీపడి దుకాణాలను సొంతం చేసుకున్నారు. 2015 అక్టోబర్ నుంచి 2016సెప్టెంబర్ రూ.872.93కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, 2016 అక్టోబర్ నుంచి 2017 ఆగస్టు వరకు రూ.923.16కోట్ల వ్యాపారం జరిగింది. 2016తో పొలిస్తే 2017లో మరో రూ.91కోట్లకు పైగా విక్రయాలు పెరిగాయి. 2017తో పొలిస్తే 2018లో రూ.76కోట్ల అధికాదాయం వచ్చింది. గత రెండేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా విక్రయాలు భారీగానే సాగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో వచ్చే ఏడాదిలో దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా అదనపు విక్రయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. స్టాక్ చేస్తే చర్యలు తప్పవు ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల్లో గతనెలలో ఎంతస్థాయిలో మద్యం విక్రయించారో అదేస్థాయిలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అక్టోబర్‌లో 10వేల కేసులు అమ్మకాలు చేస్తే నవంబర్‌లో సైతం 10వేల కేసులు ఇస్తాం. వచ్చే ఎన్నికల నేపథ్యంలో అన్ని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయాలు, స్టాక్ చేసినట్టు తేలితే కేసులు నమోదుచేసి మద్యం సీజ్‌చేస్తాం. –జయసేనారెడ్డి, డీసీ ఉమ్మడి జిల్లా -
ఏడుగురు మహిళల్ని చంపిన నిందితుడి అరెస్టు
మహబూబ్‌నగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు మహిళల్ని చంపేశాడతను. ఇదీ కేవలం మూడు నెలల కాలంలోనే..! ఇలా ఆభరణాల కోసం మహిళలను చంపిన నిందితుడిని చివరకు మహబూబ్‌నగర్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ మండలం కోడూరుకు చెందిన వడ్డె రాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. కొన్ని నెలలక్రితం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌కు వెళ్లి కొంతకాలం సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇటీవలే ఆమెను మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చి టీడీగుట్ట ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బతికేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి, వారిని దూరంగా తీసుకెళ్లి, దాడిచేసి చంపి, వారి ఒంటిపైనున్న ఆభరణాలను అపహరించడం మొదలుపెట్టాడు. కేవలం మూడు నెలల్లో ఒకే తరహాలో ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు వలపన్ని ఎట్టకేలకు బుధవారం రాజును పట్టుకున్నారు. అతడి నుంచి 320 తులాల వెండి ఆభరణాలు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, మృతుడి చేతిలో హతమైన మహిళల్లో హన్వాడ మండలం వేపూర్‌కు చెందిన దంతపల్లి నర్సమ్మ (35), వెంకటాపూర్‌కు చెందిన డోకూర్ వెంకటమ్మ (40), దొడ్డలోనిపల్లికి చెందిన మంజలి శాంతమ్మ (43), జైనల్లీపూర్‌కు చెందిన బియ్యన్ని ఎల్లమ్మ (35), చౌడాపూర్కు చెందిన చెన్నమ్మ (35), కొత్తపేటకు చెందిన పారుపల్లి యాదమ్మ (42), మరో గుర్తుతెలియని మహిళ ఉన్నారు.