మృతదేహాలను ఆటోలో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొస్తున్న పోలీసులు
సాక్షి, మహబూబ్‌నగర్: క్షణం క్షణం ఉత్కంఠ భరితం. కుయ్... కుయ్ అంటూ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రికి చేరుకుంటోన్న అరగంటకో వాహనం.. ఏ వాహనంలో ఎవరు..? ఎప్పుడొస్తున్నారో తెలియదు. ప్రతి వాహనంలో వస్తున్న పోలీసు అధికారులకు స్థానిక డీఎస్పీ, ఇతర అధికారుల సెల్యూట్. గేటు ముందు వాహనాలు నిలిపి.. ఆస్పత్రిలోకి వెళ్లిన అధికారులు. కొందరు ఫోరెన్సిక్ నిపుణులంటే.. ఇంకొందరు ఇంటెలిజెన్స్ అధికారులని పోలీసుల చర్చలు. ఆస్పత్రి చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. ఇంతకు జిల్లాస్పత్రిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనం..!
జిల్లా ఆస్పత్రి వద్ద జనం
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.40గంటల వరకు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన పోలీసులు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితుల మృతదేహాలకు పూర్తయిన పోస్టుమార్టం. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రి ముందు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నడిచిన హైడ్రామా. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ‘దిశ’ నిందితుల పోస్టుమార్టం ఉమ్మడి జిల్లా పోలీసులకే కాదూ హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఉత్కంఠతో పోలీసులు అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వర్తించారు.
అక్కడా..? ఇక్కడా..?
రంగారెడ్డి షాద్‌నగర్ చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ‘దిశ’ నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లాస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని ప్రసార మాద్యమాల్లో తెలుసుకున్న పాలమూరు ప్రజలు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున జిల్లాస్పత్రికి చేరుకున్నారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి.. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో సుమారు వంద మంది పోలీసులతో గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన ద్వారం నుంచి పోస్టుమార్టం వరకు ఉన్న మార్గాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్న పోలీసులు ఎవరినీ అటు వైపు వెళ్లనీయలేదు. రెండు గంటల ప్రాంతంలో నిందితులకు ఎన్‌కౌంటర్ స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
మృతుల తల్లిదండ్రులను ఓదారుస్తున్న వనపర్తి ఎస్పీ అపూర్వరావు
సాయంత్రం 3.10 గంటలకు జిల్లాస్పత్రికి చేరుకున్న ఎస్పీ మృతదేహాలను మహబూబ్‌నగర్‌కే తీసుకువస్తున్నారని.. అందరూ సిద్ధంగా ఉండాలని పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ఉదయం నుంచి అప్పటి వరకు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులు, మృతదేహాలు వస్తే ఏవైనా శాంతిభద్రతలు తలెత్తుతాయా..? అలాంటి పరిస్థితి రాకుండా ఇంకేం చేద్దామని డీఎస్పీలతో చర్చించారు. 3.40 గంటల ప్రాంతంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న సాధారణ జనంతో పాటు మీడియాను సైతం ప్రధాన గేటు బయటికి పంపించేశారు. ఆస్పత్రి అంతా పోలీసుల హడావిడి మొదలవడం.. మీడియా రోడ్డుపైకి రావడంతో ఆ మార్గాన వెళ్లే జనం ‘దిశ’ నిందితుల మృతదేహాలను చూసేందుకు ఆగింది. దీంతో తేరుకున్న పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో గుమికూడిన జనాన్ని బలవంతంగా అక్కడ్నుంచీ పంపించేశారు. సుమారు 40మీటర్ల వరకు పోలీసులు పహారాగా నిలిచారు. మరోవైపు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో జిల్లాకు చెందిన వైద్యులను పోలీసులు అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment