ప్రలోభాల పర్వం! | Telangana Panchayat Elections First Phase Panchayat Election | Sakshi
Sakshi News home page

ప్రలోభాల పర్వం!

Published Mon, Jan 21 2019 6:56 AM | Last Updated on Mon, Jan 21 2019 6:56 AM

Telangana Panchayat Elections First Phase Panchayat Election - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు నేడు సోమవారం జరగనున్నాయి. అంచెలంచెల వ్యూహాలతో ఆయా పార్టీల అభ్యర్థులు పంపకాల పర్వానికి తెరతీశారు. ప్రలోభాలే ఓటు బ్యాంకుగా భావిస్తూ నోటుకు ఓటు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఓటు బలాన్ని నోటు బలహీనతతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో భారీగా మద్యం, డబ్బు పంపకానికి తెరతీశారు. శని, ఆదివారాల్లో రాత్రివేళ ఓటర్ల చెంతకు నోట్లను చేరవేశారు. అయితే ముందస్తుగానే నగదును, మద్యాన్ని ఆయా గ్రామాలు, వార్డులకు గుట్టుగా పంపించడంతో పంపిణీ చేసే ప్రక్రియ సులువుగా సాగింది.
 
పంపిణీలోనూ పోటాపోటీ 
కొన్ని చోట్ల పంపిణీ జరుగుతుండగా వివిధ పార్టీ్ట ల నాయకులు గొడవలకు సైతం దిగుతున్నారు. నువ్వా.. నేనా అంటూ ప్రచారం చేసి పంపిణీలో సైతం అదేస్థాయిలో పోటీ పడ్డారు. ఓటర్లు సైతం బహిరంగంగానే డబ్బులు అడుగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.300 మాత్రమే ఇచ్చారని, వేరే పార్టీలు ఇంకా ఎక్కువగానే ఇస్తున్నారని నిలదీసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఒక ఓటు వెయ్యి రూపాయలు ఆపైనే పలికినట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల పక్కా హామీ తీసుకుని అభ్యర్థులు డబ్బును వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఊరూవాడా మందు పార్టీలు 
పల్లెలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జోరుగా మందు పార్టీలు, బిర్యాని విందులు నడుస్తున్నాయి. కొందరు అభ్యర్థులు ఉదయం నుంచి భోజనం ఏర్పాటు చేస్తే మరికొందరు రాత్రి వేళలో మద్యం, చికెన్, మటన్‌ అడిగిన పద్ధతుల్లో చేసి ఖుషీ చేస్తున్నారు. ఏ వీధి చూసినా బృందాలుగా సిట్టింగ్‌లు నడుస్తున్నాయి.
 
పార్టీల వారీగా పంపకాలు 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్ష దైవంగా భావించడం పరిపాటి. ఏ పుట్టలో ఏ పాముందో అదే మనకు బలంగా మారుతుందో అంటూ అందరిని ప్రసన్నం చేసుకోవడం సహజం. కానీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే తమ ఓటు వీళ్లని నమ్మిన వాళ్లకే డబ్బు చెల్లిస్తున్నారు. ఆ మేరకు వార్డుల వారీగా మాత్రమే డబ్బు అందజేస్తున్నారు.

పైకి ధీమా..లోలోపల దిగులు 
మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కొందరు అభ్యర్థులు ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. కింది వ్యక్తులపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయకుల్లో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. ఓటు బాసలు చేయించుకున్నారు. నోటు ఊసులు చెప్పుకున్నారు. కానీ ఓటరు నాడి పట్టుకోవడంలో ఊగిసలాట కొనసాగుతోంది. పంపకాల పేచీలు కలవరపాటు గురి చేస్తున్నాయి. ఒక్క ఓటుకు రూ.300, రూ.500 వెచ్చించినా ఓటు మాకే వేస్తారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం గుబులు పట్టి పీడిస్తోంది. ఇదిలా ఉంటే ద్వితీయ శ్రేణి నాయకుల మాత్రం ఇది ఒక దఫా మాత్రమే ఇంకా ఒకరోజు సమయం ఉంది కదా..! కంగారు పడకండి అంటూ ఓటర్లను సముదాయించే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేలోపు మీకు నజరానాలు తప్పక అందుతాయంటూ ఆశ పెడుతున్నారు.

భారీగా మద్యం నిల్వలు 
ఈ ధపా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను వశం చేసుకోవడానికి సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకవైపు మద్యం అమ్మకాలు, తరలింపుపై భారీ స్థాయిలో నిఘా కొనసాగుతున్నా ఓటర్లకు మాత్రం మద్యం చేరుతోంది. కొందరు నాయకులు కార్యక్తలకు చీటీలను పంపిణీ చేస్తే మరి కొందరు టోకన్లు అందిస్తున్నారు. మరి కొందరు నేరుగా ఇంటింటికి వెళ్లికి మరీ ముట్టచెప్పుతున్నారు. ఈ వ్యవహారంలో గ్రామాల్లో ఖాళీగా ఉన్న యువకులు కీలక పాత్ర వహిస్తున్నారు.

బృందాలు ఏర్పడి ఆయా గ్రామాల్లో ద్విచక్ర వాహనాలపై మద్యం తరలిస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని గ్రామీణా ప్రాంతాల్లో చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కేవలం కూలీలు, రైతులు, మధ్యతరగతి వారికి చీప్‌ లిక్కర్, క్వాటర్స్, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులకు బ్రాండెడ్‌ బాటిల్స్‌ అందిస్తున్నారు. ఇక పల్లెల్లో ఓటర్లకు ఇవ్వడానికి రూ.100 నోట్లు, రూ.200నొట్లు భారీ సిద్ధం చేసుకొని తెల్లవారుజామున 4గంటల నుంచి 6గంటల మధ్యలో ఓటర్ల చెంతకు చేర్చడానికి అన్ని ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement