ఖమ్మంరూరల్ మండల పోలింగ్ సామగ్రి తీసుకుంటున్న సిబ్బంది
సాక్షిప్రతినిధి,ఖమ్మం: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈ నెల 21న(నేడు) ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు ఆదివారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల సామగ్రిని సిబ్బంది తీసుకెళ్లారు. బందోబస్తుకు పోలీసులు తరలారు. గ్రామ పంచాయతీకి ఒక బస్సు చొప్పున కేటాయించారు. తొలి విడతలో 6 మండలాల్లోని 188 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 1736 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం విదితమే. అందులో 21 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు
ఏకగ్రీవం కావడంతో పాటు 275వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవం కాగా, మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.
దీంతో 167గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, 1458వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 446 మంది, వార్డు స్థానాల్లో అభ్యర్థులు 3,215మంది పోటీ పడుతున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తర్వాత నూతన పంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. కోరం పూర్తయితే అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. పూర్తి కాని పక్షంలో మరుసటిరోజు ఉంటుంది. అప్పటికీ సాధ్యం కాకపోతే వాయిదా వేసి మరొక తేదీని ప్రకటిస్తారు.
పోలింగ్ జరిగే మండలాలివే..
తొలి విడతలో ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, కామేపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 167 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక జరగనుండగా 5,200మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. అదనంగా మరో 200మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో మైక్రో సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసి వీడియో చిత్రీకరణ చేయనున్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు.
ప్రలోభాల పర్వం
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం శనివారం సాయంత్రం 5గంటల వరకు ముగియడంతో ఆయా గ్రామాల్లోని అభ్యర్థులు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారే ఓటర్లను తమవైపు మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment