‘కొంగు’ కుమిలింది.. కూనతో ఒరిగింది | Woman Jumps Into River With Baby In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

‘కొంగు’ కుమిలింది.. కూనతో ఒరిగింది

Published Fri, Dec 3 2021 3:04 AM | Last Updated on Fri, Dec 3 2021 3:04 AM

Woman Jumps Into River With Baby In Mahabubnagar District - Sakshi

సరిత, కుమార్తె (ఫైల్‌) 

మిడ్జిల్‌: రెండు పదుల వయసు.. మేనత్త కొడుకుతో పెళ్లయి రెండేళ్లయ్యింది. ముద్దులు మూటగట్టే తొమ్మిది నెలల కూతురు. హాయిగా సాగిపోవలసిన కాపురం.. కానీ పెళ్లయినప్పటి నుంచే కలహాలు.. పెద్దలు సర్ది చెప్పినా విభేదాలు సద్దుమణగలేదు.. దానికి బలవన్మరణమే పరిష్కారం అనుకుందా యువ వివాహిత.

బిడ్డతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ జయప్రసాద్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండకు చెందిన ఎల్లమ్మ, సంగయ్యల కుమార్తె సరిత (21)ను రెండేళ్ల క్రితం మిడ్జిల్‌కు చెందిన తన మే నత్త ఎత్తరి రా ములమ్మ కుమారుడు శ్రీశైలంకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల కూతురు ఉంది.  

పెళ్లయినప్పటినుంచే కలహాలు 
పెళ్లి జరిగినప్పటి నుంచే ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో పలుమార్లు పంచా యతీ నిర్వహించి సర్ది చెప్పినా కలహాలు తగ్గకపోవడంతో మనస్తాపానికి గురైన సరి త మంగళవారం చంటిపాపతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సాయం త్రం భర్త శ్రీశైలం ఇంటికి రాగా.. భార్య, కూతురు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఇంట్లో వెతికాడు. అయినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం మిడ్జిల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

గురువారం ఉదయం మిడ్జిల్‌ చెరువులో మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. బిడ్డను చీర కొంగుకు కట్టుకుని శవమై తేలిన సరిత, పసిపిల్ల మృతదేహాలను చూసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ కలహాలు తల్లితో పాటు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

‘బావా.. నేను చనిపోయిన తర్వాత నువ్వు.. మీ అమ్మ సంతోషంగా ఉండండి.. మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు.. నేను కూలి చేసి సంపాదించిన పైసలతోనే నా అంత్యక్రియలు నిర్వహించు’అని సరిత రాసిన సూసైడ్‌ నోట్‌ ఇంట్లో బయటపడింది. సరిత తండ్రి సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement