వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భాస్కర్ (వెనుక భాగంలో గన్‌తో పట్టుబడిన ఇద్దరు నిందితులు)
మహబూబ్‌నగర్ క్రైం: పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని హత్య చేయాలనే ఉద్దేశంతో తుపాకీ కొనుగోలు చేసి.. అది పని చేస్తుందో.. లేదోనని టెస్టింగ్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో అనూహ్యంగా పోలీసులకు చిక్కారు ఇద్దరు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాత్రి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. తిమ్మసానిపల్లికి చెందిన వరద రవి, అతని స్నేహితుడు కన్నయ్య ఇద్దరు కలిసి శుక్రవారం అర్ధరాత్రి లక్ష్మీనగర్‌కాలనీ– తిమ్మసానిపల్లి మధ్యలో ఉన్న రైల్వేట్రాక్ దగ్గర తపంచ ఒక రౌండ్ పేల్చారు. అదే సమయంలో లక్ష్మీనగర్‌కాలనీలో పెట్రోలింగ్ చేస్తున్న రూరల్ పోలీసులకు గన్ పేలిన సౌండ్ వినిపించింది. దీంతో పోలీసులు రైల్వేట్రాక్ వెంబడి సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంటే వరద రవి, కన్నయ్య ఇద్దరు కలిసి టీఎస్ 06 ఈఎక్స్ 7345 నంబర్ గల పల్సర్ బైక్‌పై పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆపి తనిఖీ చేయగా వరద రవి దగ్గర తపంచ, మూడు బుల్లెట్లు, ఒకటి కాల్చిన ఖాళీ బుల్లెట్ లభ్యమయ్యాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు మరింత లోతుగా విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహిళ విషయంలో గొడవ
తిమ్మసానిపల్లికి చెందిన వరద రవికి అదే గ్రామానికి చెందిన పాపిగారి రవితోపాటు అతని గ్యాంగ్‌కు 2017లో ఓ మహిళ విషయంలో గొడవ జరిగింది. అదేవిధంగా 2018 న్యూ ఇయర్ వేడుకల్లో వరద రవికి పాపిగారి రవి గ్యాంగ్ మధ్య జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందినవారు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో ఇరువర్గాలపై అప్పట్లో కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన వరద రవి అతనికి అడ్డు వస్తున్న పాపిగారి రవి, అతని గ్యాంగ్‌ను అడ్డులేకుండా చేయాలనే ఉద్దేశంతో గతేడాది ఉత్తరప్రదేశ్‌కు చెందిన గప్‌చుప్‌లు విక్రయించే ఓ వ్యక్తితో రూ.20 వేలకు తపంచ కొనుగోలు చేశాడు. దానిని శుక్రవారం రాత్రి పనిచేస్తుందో లేదోనని టెస్టింగ్ చేయడానికి రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లి పోలీసులకు పట్టుబడ్డాడు.
రూరల్ పోలీసులు పాలమూరులో ఒక మర్డర్ కాకుండా ఆపడంతో పాటు ఒక ప్రాణాన్ని కాపాడినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం తపంచ విక్రయించిన వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలో అతనిని అదుపులోకి తీసుకొని మరింత విచారణ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడిన ఏ1 వరద రవి, ఏ2 కన్నయ్యలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. పట్టుబడిన వారి నుంచి కంట్రీమెడ్ వెఫన్ (తపంచ), మూడు లైవ్ బుల్లెట్లు, ఒక ఖాళీ బుల్లెట్, ఒక నాటు కొడవళి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ మహేశ్వర్‌రావు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, వెంకటయ్య, రమేష్, పృథ్వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అసలేం జరిగింది..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వ్యాపారం నిమిత్తం పాలమూరుకు వచ్చాడు. అతను తిమ్మసానిపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే గప్‌చుప్‌ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఉత్తరప్రదేశ్‌లో తపంచ, గన్‌లను తక్కువ ధరకు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో కొనుగోలు చేసి వాటిని మహబూబ్‌నగర్‌లో రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతని దగ్గర కొందరు వ్యక్తులు తుపాకులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతను పాలమూరులో ఎన్ని గన్స్ విక్రయించాడనే విషయం తెలియాలంటే పరారీలో ఉన్న ఆ వ్యక్తి అదుపులోకి తీసుకుంటే తప్ప వెలుగులోకి రావు.
Comments
Please login to add a commentAdd a comment