స్కూల్ పిల్లలతో పల్లవి ఘోష్
‘బాలికల అక్రమ రవాణా’ ఈ హెడ్డింగ్‌తో వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ‘అయ్యో’ అనుకుని మరో వార్తలోకి వెళ్లిపోవడం కూడా చాలా మామూలుగా జరిగిపోతూనే ఉంటుంది. మన కళ్ల
ముందు ఉండే అమ్మాయిని ఎవరో అపహరించుకుని వెళ్లారని తెలిస్తే మనసంతా పిండేసినట్లవుతుంది. రోజులపాటు బాధపడతాం. కానీ ఏమీ చేయం.
అక్రమాల మీద గళమెత్తలేకపోయి నప్పటికీ కనీసం నోరు తెరిచి మనకు తెలిసిన విషయాన్ని చెబితే ఆ సమాచారం దర్యాప్తుకు దోహదమవుతుందని తెలిసినా పోలీసు ముందు పెదవి విప్పడానికి భయం. కానీ, అస్సాంకు చెందిన పల్లవి ఘోష్ అలా చూసి ఊరుకోలేదు. పన్నెండేళ్ల వయసులో ఆమె కళ్ల ముందు జరిగిన ఓ సంఘటన ఆమెను కదిలించింది. సమాజానికి అంకితమయ్యేలా ఆమెను ప్రభావితం చేసింది.
అప్పుడు పల్లవి ఘోష్‌కు పన్నెండేళ్లు. ఆమె నివసిస్తున్న గ్రామానికి సమీపంలో ఉన్న మరో చిన్న గ్రామానికి చెందిన బాలికను దుండగులు అపహరించుకు వెళ్లడం ఆమె కంట పడింది. పెద్దగా అరుస్తూ పెద్దవాళ్లను అప్రమత్తం చేయడం ద్వారా ఆ బాలికను రక్షించగలిగింది పల్లవి. ట్రాఫికింగ్‌ని స్వయంగా చూడడం ఆమెకది తొలిసారి.
కానీ బాలికలు, మహిళల అక్రమ రవాణా పట్ల అస్పష్టంగానైనా కొంత అవగాహన ఉందామెకి. అక్రమ రవాణాను నిరోధించాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంది పల్లవి. వయసు పెరిగేకొద్దీ ఆమెలో ట్రాఫికింగ్ పట్ల స్పష్టమైన కార్యాచరణ రూపుదిద్దుకుంది. ‘ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ’ స్థాపించి బాలికలు, మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టింది.
వేదిక మీద ప్రసంగం చాలదు!
‘‘బాలికలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరించి చెప్పడానికి, ఆ బారిన పడకుండా కాపాడడానికి వేదికల మీద ఎన్ని ప్రసంగాలు చేసినా వాటితో అనుకున్న లక్ష్యం నెరవేరట్లేదని కొద్దికాలంలోనే తెలిసింది. ఇలా ప్రసంగాలతో కనీసం ఆలోచననైనా రేకెత్తించగలుగుతున్నానా అనే సందేహం కూడా కలిగింది. అప్పటి నుంచి నేరుగా ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టడం మొదలుపెట్టాను.
వాళ్ల ఉద్ధరణ కోసం నిజంగా చేయాల్సిన పని ఏమిటనేది అప్పుడు తెలిసింది. మహిళలు గతంలోకి వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని, జరగబోయి తప్పించుకున్న దురాగతాలను ఏకరువు పెట్టారు. ప్రమాదాలు ఎన్ని రకాలుగా చుట్టుముడతాయనే విషయాన్ని వారికి విడమరిచి చెప్పడంతోపాటు ప్రమాదాన్ని శంకించినప్పుడు రక్షణ కోసం ఏమి చేయాలో వివరించాను.
కొన్ని ఇళ్ల నుంచి అప్పటికే మాయమైపోయిన బాలికల అన్వేషణ కోసం పోలీస్ శాఖను ఆశ్రయించాను. అలాగే సమాజాన్ని చైతన్యవంతం చేసే క్రమంలో కానిస్టేబుళ్లను భాగస్వాములను చేశాను. వారిని దగ్గరగా చూడడం, వారు చెప్పే ధైర్యవచనాలను వినడం ద్వారా బాలికలు తమకు ప్రమాదం ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసుల సహాయాన్ని కోరగలుగుతారు.
ఇలా ఎన్నో ప్రయత్నాల ద్వారా అక్రమ రవాణా పట్ల బాలికల్లో చైతన్యం తీసుకువచ్చాను. అపహరణకు గురైన పదివేలకు పైగా బాలికలను తిరిగి వారి ఇళ్లకు చేర్చగలిగాను. అంతటితో సరిపోదని ఆ తర్వాత తెలిసింది. రక్షించిన బాలికలకు ఉపాధి కూడా కల్పించాలి. ఆ పని చేయలేకపోతే ట్రాఫికింగ్ మాఫియా పని పేరుతో ఆ బాలికలను తిరిగి తమ గుప్పెట్లోకి తీసుకుపోతుంది.
అందుకోసం మా ఫౌండేషన్ ద్వారా వారికి పనుల్లో శిక్షణ ఇచ్చి పని కల్పించడం కూడా మొదలు పెట్టాను. పది వేలకు పైగా బాలికలను కాపాడడంతోపాటు 75 వేల మందిలో చైతన్యం తీసుకురాగలిగాను. వారి భవిష్యత్తు అంధకారంలోకి తోసేసే ముఠాల నుంచి వారికి జాగ్రత్తలు తెలియచేశాను. కానీ మాఫియా ముఠాలను కూకటి వేళ్లతో పెకలించి వేయడం అనే పనిని ప్రభుత్వాలు చేయాలి. అప్పుడే ఈ భూతం తిరిగి నిద్రలేవకుండా ఉంటుంది’’ అని వివరించింది పల్లవి ఘోష్.
Comments
Please login to add a commentAdd a comment