మానవ అక్రమ రవాణనుఒంటి చేత్తో అడ్డుకుంటోంది పల్లవి ఘోష్ .తను స్థాపించిన ‘ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ద్వారా పది వేల మంది బాల బాలికలను, స్త్రీలను అక్రమ రవాణ నుంచి కా పాడగలిగింది.అస్సాంకు చెందిన పల్లవి ఘోష్ ఈశాన్య రాష్ట్రాల పో లీసులకు, సరిహద్దు భద్రతా దళాలకు సుపరిచితం.వారి సహాయంతో పల్లవి చేస్తున్న కృషికి ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి.
‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం భారత్‌లో 2021లో 77,535 మంది బాల బాలికలు ‘మిస్’ అయ్యారు. వీరిలో 59,544 మంది ఆడపిల్లలు. వీరంతా ఏమయ్యారు?
అంతులేని అక్రమం
‘మన దేశంలో పేదరికం, వలసలు, వరదలు, అధిక సంతానం, ఇంటి సభ్యుల మధ్య సఖ్యతా, ప్రేమా లేకపోవడం... ఇవి ఉన్నంత కాలం మానవ అక్రమ రవాణా ఉంటుంది. ఆడపిల్లలను వ్యభిచారం కోసం, బలవంతపు పెళ్లిళ్ల కోసం కిడ్నాప్ చేస్తున్నారు. అబ్బాయిలను వెట్టి కార్మికులుగా మార్చడానికి తీసుకెళుతున్నారు.
ఇవి ఆగాలంటే సమాజంలో చైతన్యం రావాలి’ అంటోంది పల్లవి ఘోష్. 2013 నుంచి 2023 మధ్య కాలంలో పల్లవి ఘోష్ యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్‌గా దాదాపు 10 వేల మంది బాల బాలికలను, స్త్రీలను కా పాడింది. ఈమె కార్యరంగం అంతా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది. అక్కడి ట్రాఫికర్లకు పల్లవి పేరు చెబితే హడల్.
బాల్యంలో పడిన తొలిముద్ర
పల్లవి ఘోష్‌ది అస్సామ్‌లోని లుమ్‌డింగ్. ఏడవ క్లాస్‌లో ఉండగా వేసవి సెలవుల్లో బెంగాల్‌లోని మేనమామ ఇంటికి వెళ్లింది. ‘అప్పుడు ఆ పల్లెటూళ్లో ఒకాయన తన కూతురి కోసం వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరో అపరిచితుడు బైక్ మీద వచ్చి మాట కలిపి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడని ఊళ్లో చెప్పుకున్నారు.
ఆ వయసులో ఆ ఘటన నా మీద చాలా ముద్ర వేసింది’ అంటుంది పల్లవి. ఢిల్లీలో డిగ్రీ చేసిన పల్లవి చెన్నై నుంచి ‘జెండర్ ఇష్యూస్’ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికై పని చేసే ఢిల్లీ స్వచ్చంద సంస్థ ‘శక్తివాహిని’లో 2013లో చేరింది.
ఎన్నో అనుభవాలు
యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్‌గా పల్లవి ఎన్నో అనుభవాలు చూసింది. ‘ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి ఢిల్లీలో పని మనుషులుగా స్త్రీలను అమ్మేస్తారు. ఆ స్త్రీలను ఇంటి యజమానులు దారుణంగా హింసిస్తారు. అలాంటి వారిని ఎందరినో విడిపించాను. హర్యానాలో పెళ్లికూతుళ్లది పెద్ద సమస్య.
అందుకని బెంగాల్, అస్సాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల నుంచి మహిళలను ఎత్తుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసి ఇళ్ల లోపల ఉంచేస్తారు. పల్లెల్లో ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపరు. అడ్డుకోరు. ఆశ్చర్యం ఏమంటే వయసు కూడా పట్టించుకోరు. 50 ఏళ్ల మహిళను కూడా ఎత్తుకొచ్చి హర్యానాలో పెళ్లి చేశారు’ అంటుంది పల్లవి.
డ్రైవర్లను చైతన్యవంతం చేయాలి
ఈశాన్య రాష్ట్రాల్లో పల్లవి ఊరూరు తిరిగి అక్కడి కార్మికులతో, కూలి మహిళలతో, స్కూలు విద్యార్థినులతో మాట్లాడుతుంది. తన సంస్థ వాలంటీర్ల ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలను కలిసి మానవ అక్రమ రవాణా గురించి చెబుతుంది. ‘అన్నింటి కంటే ముఖ్యం రిక్షావాళ్లను, క్యాబ్ డ్రైవర్లను, ఆటోవాళ్లను చైతన్యవంతం చేయాలి.
ఎందుకంటే ఆడవాళ్లను ఎత్తుకుపోవాలంటే వీరి ద్వారానే పోవాలి. వీరు ఆపగలిగితే సగం కేసులు ఆగిపోతాయి’ అంటుంది పల్లవి. ఆడపిల్లల అక్రమ రవాణాను నిరోధించడం ఒకెత్తయితే తిరిగి పట్టుకొచ్చాక వారికి కొత్త జీవితాలు ఇవ్వడం ఒకెత్తు. ‘తీసుకొచ్చిన వారిని షెల్టర్ హోమ్స్‌లో పడేయడం సరి కాదు. ఆ హోమ్స్‌లో రకరకాల అనుభవాల పిల్లలు ఉంటారు. వారందరూ కలిసి ఉండటం వల్ల ప్లిలలు ఆరోగ్యకరమైన మానసిక స్థితితో ఎదగలేరు’ అంటుంది పల్లవి.
ప్రాణాలకు ప్రమాదమైనా
శక్తివాహినిలో ఏడేళ్లు పని చేశాక 2020లో సొంతగా ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్’ అనే ఎన్.జి.ఓ స్థాపించి యాంటీ ట్రాఫికింగ్ మీద పని చేస్తున్న పల్లవి ఈ పనిలో చాలా రిస్క్ ఉందని చెబుతుంది. ‘ఆడపిల్లలను/స్త్రీలను ఇళ్ల నుంచి వ్యభిచార గృహాల నుంచి విడిపించడానికి వెళ్లినప్పుడు దారుణంగా ఎదురుదాడి చేస్తారు. చం పాలని చూస్తారు.
అయితే పోలీసుల సహాయం లేకుండా నేను వెళ్లను. కొంతమంది బ్రోకర్లు నాకు నేరుగా ఫోన్ చేసి ఈ దాడులు మానేస్తే ఇల్లు కొనిస్తాం అని బేరానికి వచ్చారు. కోర్టులో ఒకడు నాకు కత్తి చూపించాడు’ అంటుంది పల్లవి. అయినా సరే ఆమె తన కృషి మానలేదు.
Comments
Please login to add a commentAdd a comment