స్మితాశర్మ
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం...
దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది.
తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది.
బంగ్లాదేశ్‌కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్‌కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్‌లోని నమ్‌ఖానా అనే ఊరిలోని బ్రోతల్‌కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు.
యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత.
కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు.
‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్‌లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్‌ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్‌లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment