Smita Sharma
-
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్‌కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్‌లోని నమ్‌ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్‌ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్‌లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
పూజా పటాలు
అత్యాచారానికి గురైన అమ్మాయినిపదే పదే అవమానానికి గురిచేస్తారు. లైంగికంగా ఒకసారి... మానసికంగా వందసార్లు! గాయమూ వీళ్లదే. చీత్కారాలూ వీళ్లకే. రాలినపువ్వు పూజకు పనికిరాదు అనుకునే సమాజంలో... ఈ గాయపడిన పిల్లలకు పటాలు కట్టి పూజలకు అర్హులను చేస్తోంది స్మితాశర్మ. న్యూఢిల్లీ.. ఇండియా హాబిటేట్ సెంటర్లోని ప్లాజా స్టెప్స్... ఫోటోగ్రఫి ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఒక్కో మెట్టు మీది ఒక్కో ఛాయాచిత్రం ఒక్కో జీవితాన్ని ఆవిష్కరిస్తోంది! కళాత్మకమా... కాదు కదిలించే ప్రదర్శన.. అని ప్లాజా స్టెప్స్ దిగి వస్తున్న వాళ్ల ముఖ కవళికలు చెప్తున్నాయి! తొలి మెట్టునానుకొని ఉన్న గోడ మీద... చూడగానే ఆ కాటుక కళ్లు పలకరిస్తున్నట్టే అనిపించాయి! గులాబీ రంగు చున్నీతో ఆ విశాల నయనాలు తప్ప మొహమంతా చుట్టేసుకొని ఉంది. పేరు ప్రజున అట. పధ్నాలుగేళ్లు! రేప్ సర్వైవర్... అందుకే మొహాన్ని చూపించట్లేదు.. పేరు కూడా మార్చాను అని రాసింది ఫోటోగ్రాఫర్ ఆ ఫోటో పక్కనే! పసివయసులో ఎదురైన భయంకరమైన అనుభవం ఆ అమాయకత్వాన్ని మాత్రం మింగలేదని ఆ చూపు చెపుతోంది! థాంక్ గాడ్.. ఆ పిల్ల కొత్తగా బతికేందుకు కావల్సిన ఆక్సిజన్‌ను కలుషితం చేయనందుకు! రెండో మెట్టుమీది గోడా... ఇంకో అమ్మాయి.. బీనాను కొవ్వొత్తి నీడలో నిలబెట్టి చూపుతోంది! ఆమె కథా మనసును పిండేసేదే! అడ్డొచ్చిన ధూళిని మింగి రివ్వున దూసుకెళ్లే గాలికున్న వేగాన్ని ఆ బాలికకు నైజంగా ఇచ్చిన ప్రకృతికి ధన్యవాదాలు! రేప్.. సెక్సువల్ అబ్యూజ్.. హెరాస్మెంట్... అసాల్ట్... రకరకాల వేధింపులకు రకరకాల పేర్లు.. కాని వాటి లక్ష్యం ఒక్కటే! అమ్మాయిల మనసును, శరీరాన్ని గాయ పర్చడం.. ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం.. వ్యక్తిగత గుర్తింపు లేకుండా చేయడం.. సమూహం నుంచి వెలివేయడం! అయినా వెరవకుండా గాయాన్ని ధైర్యమనే మలామ్తో నయం చేసుకొని సమాజంలో కలిసే ప్రయత్నం చేస్తున్నారు! ఆ స్ఫూర్తి చిత్రాలు.. గాథల కొలువే ఈ ఛాయాచిత్ర ప్రదర్శన! ఈ జీవితాలను ఫ్రేమ్ చేసిన వనిత పేరు స్మిత శర్మ! ఫోటోజర్నలిస్ట్! న్యూయార్క్, కోల్‌కతా కేంద్రాలుగా పనిచేస్తున్న స్మితకూ అలాంటి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. తన పద్దెనిమిదవ యేట కాలేజ్ లెక్చరర్చేత లైగింక వేధింపులకు గురైంది స్మిత. తప్పు గురువు చేస్తే శిక్ష తనకు విధించారు తోటి విద్యార్థులు, ఇతర గురువులు ఆమెను కాలేజ్ నుంచి బహిష్కరించి! నన్ను ఇబ్బంది పెట్టిన వాడిని వదిలేసి నన్ను చదువుకోనీకుండా చేస్తారేంటి? అని గొంతు చించుకుంది... ఇది అన్యాయం అంటూ మొరపెట్టుకుంది.. చదువుకు దూరం చేయొద్దని ప్రాధేయపడింది. ఎవరూ వినిపించుకోలేదు. కాళ్లావేళ్లా పడితే లాభంలేదు.. పోరాడి సాధించుకోవాలనుకుంది. సాధించుకుంది. మళ్లీ కాలేజ్‌లో చేరింది. చిన్నాన్న కూతురూ... కమలిక తన చిన్నాన్న కూతురు. చురుకైన అమ్మాయి. స్కూల్ టాపర్. తను ఎనిమిదో క్లాస్‌లో ఉన్నప్పుడు క్లాస్మేట్ ఒకతను చాలా వేధించాడు ఆమెను. ఆ అబ్బాయి మీద ప్రిన్సిపల్‌కు, స్కూల్ యాజమాన్యానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా లాభం లేకపోయింది. పైగా వాళ్లంతా కూడా ఆ అబ్బాయి తరపునే వకాల్తా పుచ్చుకున్నారు. కమలిక పైనే నిందవేశారు. ఆ అవమానాలకు కుంగిపోలేదు కమలిక. వాటిని భరిస్తూనే నాలుగేళ్లు గడిపింది. కమలిక పదకొండో తరగతికి వచ్చింది. ఆమె ధైర్యం అటు టీచర్లకు ఇటు యాజమాన్యానికి మింగుడు పడలేదు. ఏ సాకుతోనైనా సరే ఆ అమ్మాయిని స్కూల్ నుంచి పంపించేయాలనే కక్షతో ఉన్నారు. ఆ క్రమంలో.. ఒకసారి టీచర్ ఇచ్చిన ఒక అసైన్మెంట్ చేయలేకపోయింది ఆ అమ్మాయి. అదే అవకాశంగా తీసుకున్న టీచర్లు ఆమెను అసహ్యంగా తిట్టారు. టీచర్లు చెప్పింది వినకుండా నిర్లక్ష్యంగా ఉంటోందని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ట్రబుల్‌మేకర్ అనే ముద్ర వేశారు. బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి యాజమాన్యం ఆమెను అనుమతించలేదు. చివరకు కమలిక వాళ్ల అమ్మ క్షమాపణ చెబితే కానీ శాంతించలేదు పాఠశాల సిబ్బంది. అయితే ఈసారి ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయింది కమలిక. నిరుడు జనవరి 20న తమ ఇంటి పక్కనే ఉన్న ఏడంతస్తుల మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నిశ్శబ్దం బద్దలైన వేళ.. కమలిక మరణం స్మితను కలచివేసింది. ఆమెను కాపాడుకోలేకపోయాననే చింత ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కమలిక లాంటి పరిస్థితి ఏ స్కూల్లో ఏ అమ్మాయికి రావద్దు అనుకుని హెచ్ఆర్డి మంత్రికి ఓ అర్జీపెట్టింది. బడిలో బాలికలకు ఎవరినుంచైనా లైంగిక వేధింపులు ఎదురైతే నిర్భయంగా చెప్పుకునేలా.. దాని తాలూకు ఇబ్బందులను అధిగమించేలా ప్రతి స్కూల్లో ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సెంటర్స్‌ను పెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలేసి ఇబ్బంది పడ్డవాళ్లను అవమానించే సంస్కృతికి ఫుల్స్టాప్ పెట్టాలని నినదించింది. అమ్మాయిలను అబ్బాయిలు వేధించడం పట్ల సమాజంలో ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు చేయాలనుకొని చనిపోయిన తన చిన్నాన్న కూతురు పేరిట ‘కమలిక ఫౌండేషన్’ను స్థాపించింది. ఈ ఫౌండేషన్ తరపున రేప్సర్వైవర్స్ కథనాలను జనసామాన్యంలోకి తెచ్చి రేప్‌కి గురైన వాళ్లను అవమానించే, బహిష్కరించే కుసంస్కృతిని రూపుమాపాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగమే ఢిల్లీలో జరిగిన ఆ ఫోటో ఎగ్జిబిషన్. సామాన్య జీవితంలోకి.. కేవలం ఛాయాచిత్ర ప్రదర్శనలకే పరిమితం కాకుండా హ్యుమన్‌రైట్స్ ఆర్గనైజేషన్‌తో కలిసి రేప్ సర్వైవర్స్‌కి పునరావాసం కల్పిస్తోంది స్మిత. అమ్మాయిలకు సైకిళ్లు డొనేట్ చేసి మళ్లీ స్కూల్లో ప్రవేశం కల్పించి వాళ్లకు చదువుకునే ధైర్యాన్ని అందిస్తోంది. రేప్ సర్వైవర్స్ కోసం ఆమె చేస్తున్న ఈ కృషికి ‘ది వాషింగ్టన్ పోస్ట్’ అవార్డునూ అందుకుంది. ‘క్రానికల్స్ ఆఫ్ కరేజ్’అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించి దేశంలోని నాలుగు రాష్ట్రాలు పర్యటించింది. ఆయా ప్రాంతాల్లోని రేప్ బాధితులను ఇంటర్వ్యూ చేసి వాళ్ల గళాల్ని వినిపిస్తోంది. ఏ ఇంటి ఆడపిల్ల అలాంటి దారుణాలకు బలికాకుండా తమ ఇంటి మగపిల్లల్ని పెంచమని కోరుతోంది. ప్రస్తుతం ఆమె ఈ ఇంటర్వ్యూలను డాక్యుమెంటరీగా చిత్రీకరించే పనిలో ఉంది. విక్టిమ్స్లా కాదు సర్వైవర్స్లా.. మనదేశంలో ఆడపిల్ల అంటే అందరికీ తేలిక. ఆమె ఆత్మగౌరవం ఏమాత్రం విలువలేని విషయం. అందుకే అమ్మాయిలను వేధింపులకు గురిచేసే వాళ్లను వదిలేసి, వేధింపు లకు గురైన ఆడపిల్లలను అవమానిస్తున్నారు. వాళ్లను వెలేస్తున్నారు. ఈ ధోరణిని అడ్డుకోవాలి. దీని పట్ల సమాజంలోని నిశ్శబ్దం బద్దలు కావాలి. రేప్ విక్టిమ్స్లా కాకుండా రేప్ సర్వైవర్స్లా నిలబడాలి. నా ప్రయత్నాలన్నీ దానికోసమే! - స్మిత శర్మ - సాక్షి ఫ్యామిలీ