brothels houses
-
జిల్లాలో జోరుగా హైటెక్ వ్యభిచారం ! యువకులకు నచ్చితే రేటు నిర్ణయం !!
జగిత్యాల క్రైం: జిల్లాలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెడుతున్న దళారులు.. యువకులను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు పరిచయం ఉన్నవారితోనే వాట్సాప్ గ్రూపులు తయారు చేస్తూ వ్యభిచారం దందా విస్తరిస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లను అడ్డాలుగా చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి, మల్యాల, కొండగట్టు తదితర ప్రాంతాల్లో దందా జోరుగా సాగుతోందనే సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఏడుగురు నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు. అయినా, వ్యభిచారం ఆగడంలేదు. ప్రముఖులకూ సరఫరా.. ► దళారులు అందమైన యువతులను ఎరగా చూపుతూ యువకులను ఆకర్షిస్తున్నారు. కొందరు ప్రముఖులకు కూడా సరఫరా చేస్తున్నారు. ఇలాంటివారు కోరుకుంటే ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు, అత్యాధునిక వసతులు కలిగిన భవనాలు ఎంచుకుంటున్నారు. ఖరీదైన వాహనాల్లో యువతలను తరలిస్తున్నారు. యువతులు అడిగినంత సొమ్ము చెల్లిస్తూ వ్యాపారం విస్తరిస్తున్నారు. నెల టర్నోవర్ రూ.20లక్షల పైనే.. జిల్లాలో జరిగే హైటెక్ వ్యభిచారంలో సుమారు 150మంది దళారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, వైజాగ్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోంచి యువతులను రప్పిస్తున్నారు. తమతో టచ్‌లో ఉండే యువకులకు వీరి ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెడుతూ, వాట్సాప్‌లో పంపిస్తూ ఆకర్షిస్తున్నారు. యువకులకు నచ్చితే.. ఆ ఫొటోలోని యువతికి రేటు నిర్ణయిస్తున్నారు. ఇళ్లలో అయితే రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, బయటకు తీసుకెళ్తే రూ.5వేల నుంచి రూ.6వేల వరకు రేట్ కుదుర్చుకుంటున్నారు. ఈ సొమ్మును ఫోన్‌పే, గూగుల్‌పే తదితర డిజిటల్ పద్ధతుల్లో చెల్లింపులు చేసుకుంటున్నారు. మరోవైపు.. జిల్లాలో సుమారు వంద మంది వరకు వ్యభిచార నిర్వాహకులు ఉన్నట్లు తెలిసింది. వీరితోనే దళారులు దందా సాగిస్తున్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా ప్రతినెలా సుమారు రూ.20లక్షల వరకు టర్నోవర్ సాగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిఘా పటిష్టం చేశాం ► జిల్లాలో వ్యభిచారాన్ని అరికట్టేందుకు నిఘా పటిష్టం చేశాం. దందా ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లలో దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్వాహకులను అరెస్టు చేశాం. ఇంకా చాలామంది ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. వారిని కూడా పట్టుకుంటాం. – భాస్కర్, ఎస్పీ ► జగిత్యాల శివారు అంతర్గాం రోడ్డులోని ఓ ఇంటిపై పోలీసులు సోమవారం మధ్యాహ్నం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ, నిర్వాహకులతోపాటు ముగ్గురు యువతులను పట్టుకున్నారు. యువతులను సఖీ కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు, విటుడిని రిమాండ్‌కు తరలించారు. ► జగిత్యాల శివారు తిమ్మాపూర్ రోడ్డులో కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ మహిళ కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన ఇద్దరుయువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. నిందితులను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఐదు నెలల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ► మల్యాల మండలం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని ఓ ఆలయం సమీపంలోగల ఇంట్లో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడి చేయగా అప్పటికే నిందితులు తప్పించుకుని పారిపోయారు. ► నెల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు ఉండేచోట ఓ మహిళ, ఇద్దరు యువతులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. -
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్‌కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్‌లోని నమ్‌ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్‌ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్‌లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..
ఆటోనగర్(విజయవాడ తూర్పు): విజయవాడ నగరంలోని రామవరప్పాడు ప్రాంతంలో నివాసాల మధ్య వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సోమవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు పటమట సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపినట్టు చెప్పారు. ఐదుగురు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: మాట్లాడుకుందామని భార్యను హోటల్ గదికి పిలిచి.. -
అతిథిగృహాల ముసుగులో అకృత్యాలు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న లాడ్జీలు, అతిథి గృహాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మొన్నటి వరకు నగరంలో పేకాట స్థావరాలపై రైడింగ్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం వ్యభిచారం, తదితర అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రెండు వారాలుగా లాడ్జీలు, అతిథి గృహాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి డాబాగార్డెన్స్ వెంకటేశ్వరమెట్ట ఆర్చి సమీప విశాఖ ఇన్ లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న వారిని నగర డీసీపీ–1 రంగారెడ్డి అరెస్ట్ చేయగా.. నిన్న బుధవారం రాత్రి సీతమ్మధారలోని శ్రీసాయి గెస్ట్ హౌస్‌లో ఇతర రాష్ట్రాల యువతులతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండడాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ గెస్ట్‌హౌస్ యాజమాని దుబాయ్‌లో ఉండడంతో మేనేజరే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారించి, ఓ యువతితో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా గురువారం త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై అశోక్ చక్రవర్తి బీచ్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. పాండురంగాపురం బీచ్ గెస్ట్ హౌస్‌తో పాటు బీచ్ రోడ్డులో ఉన్న కింగ్స్ అపార్ట్మెంట్లో ఎస్‌కేఎంఎల్ అతిథి గృహాల పేరిట ఉన్న ఆరు ఫ్లాట్లపై దాడులు చేశారు. వీటిల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించి వాటిని సీచ్ చేశారు. పాండురంగాపురం బీచ్ గెస్ట్‌హౌస్‌తో పాటు ఆరు ఎస్‌కేఎంఎల్ ఫ్లాట్లను సీజ్ చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో.. గతంలో సీతమ్మధారలో మసాజ్ సెంటర్ ముసుగులో థాయ్‌లాండ్ యువతులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేసి, వాటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గాజువాక, బీచ్ రోడ్డు, వీఐపీ రోడ్డు, సీతమ్మధారలో మరికొన్ని మసాజ్ సెంటర్లను నిర్వహిస్తు న్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్ లాండ్ నుంచి టూరిస్ట్ వీసాతో యువతులను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం పోలీసుల వద్ద ఉంది. అపార్ట్మెంట్లలోనే అతిథిగృహాలు.. అతిథిగృహాల పేరిట అపార్ట్మెంట్లలో నాలుగు ఫ్లాట్లు అద్దెకు తీసుకోవడం.. వాటిల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం ఇటీవల ఎక్కువైంది. అటువంటి వాటిపై పోలీసులు దృష్టి సారించి, ఆ అపార్ట్మెంట్ అంతటినీ సీజ్ చేయడానికి పూనుకుంటున్నారు. నగరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న లాడ్జీలు ఎన్ని ఉన్నాయి.. వాటిలో ఎంత మంది నియమ నిబంధనలు పాటిస్తున్నారు.. అతిథి గృహాలకు అనుమతులు ఉన్నాయా.. వారు నియమ నిబంధనలు పాటిస్తున్నారా.. అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదు.. నగరంలోని హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నాం. ఇప్పటికే నగరంలో పలు అతిథిగృహాలను సీజ్‌చేశాం. అతిథి గృహాలు, లాడ్జీల్లో దిగేవారి ఆధార్ తదితర గుర్తింపు కార్డు తీసుకోవాలి. చెక్ ఇన్, చెక్ అవుట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించేదిలేదు. లాడ్జీలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. -రంగారెడ్డి, డీసీపీ–1 -
నేలమాలిగలు.. ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు లేవు!
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట కేంద్రంలోని వేశ్యాగృహాల్లో నేలమాలిగలు లేవని, అలాగే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు వాడలేదని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలిపింది. ఇది కేవలం కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అభిప్రాయపడింది. యాదగిరిగుట్టలో వేశ్యావృత్తిని నిర్వహిస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపి పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైళ్లకు తరలించి ఆర్నెల్లుగా జైళ్లలో ఉంచిన నేపథ్యంలో ఈ నెల 8న మానవ హక్కుల వేదిక బృందం యాదగిరిగుట్టకు చేరుకుని అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అన్నీ హృదయవిదారక అంశాలే... యాదగిరిగుట్ట వేశ్యాగృహాలను నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు, బాలికల సంరక్షణ గృహాలకు తరలించారు. వారి ఇళ్లకు తాళం వేయడంతో మిగిలిన కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న హెచ్ఆర్ఎఫ్ బృందం బాధితులను పరామర్శించడంతో వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అరెస్టు కాని కుటుంబ సభ్యుల్లో కొందరు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకోగా.. మరికొందరికి అవి కూడా దొరకలేదు. కొందరు గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ గుడారాల్లో ఓ బాలింత సైతం పసికందుతో అవస్థలు పడుతూ ఉంది. ఇటు పీడీ యాక్టుపై జైలుకు వెళ్లి వచ్చిన వారి పరిస్థితిదుర్భరంగా మారింది. దీన్ని చూసి హెచ్ఆర్ఎఫ్ సభ్యులు చలించిపోయారు. పునరావాసం ఎక్కడ...: వేశ్యావృత్తిని మానేసిన వారు ఇతర ఉపాధి పనులకు వెళ్తున్నారని హెచ్ఆర్ఎఫ్ తెలిపింది. ‘వేశ్యావృత్తిని మానేసినట్లు ప్రత్యేకంగా బోర్డులు తగిలించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పునరావాసం, ఆర్థిక సాయం అందలేదు. బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు వారి ఇళ్లను వారికే అప్పగించాలి. హోంలలోని పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలి..’అని నివేదికలో కోరింది. అవన్నీ నిరాధారం.. వేశ్యాగృహాల్లో పిల్లలను నేలమాలిగల్లో రహస్యంగా పెంచుతున్నట్లు, వారు త్వరగా ఎదిగేందుకు ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు చేస్తున్నట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ అదంతా ప్రచారమేనని హెచ్ఆర్ఎఫ్ బృందం అభిప్రాయపడింది. అక్కడ అలాంటి పరిస్థితేమీ లేదని.. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదని వెల్లడించింది. ‘ఈ ఆరోపణల ఆధారంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్‌పై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆస్పత్రి సీజ్ చేసినప్పటికీ అక్కడ ఈస్ట్రోజన్‌కు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. మరి ఆ వైద్యుడిని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు. 33 మంది బాధిత బాలికలను రెండు హోంలకు తరలించారు. ఆమన్‌గల్‌లో ప్రజ్వల నడుపుతున్న హోంలో 20 మంది, మిగిలిన 13 మందిని నల్లగొండలోని శిశు విహార్‌కు పంపించారు. అయితే ప్రజ్వల హోంలోని పిల్లలను చూసే అవకాశం కూడా ఇవ్వడం లేదు..’అని హెచ్ఆర్ఎఫ్ పేర్కొంది. -
వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఉండిలోని వ్యభిచార గృహాలపై శుక్రవారం పోలీసులు ముకుమ్మడి దాడులు చేశారు. ఈ సందర్భంగా 19 మంది మహిళలు, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భీమవరం, ఉండి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వ్యభిచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. -
అనంతలో వ్యభిచార గృహాలపై దాడులు
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో వ్యభిచార గృహాలపై జిల్లా పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఇద్దరు మహిళలతోపాటు నలుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుక్కరాయ సముద్రంలో ఇటీవల కాలంలో వ్యభిచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.