ఎస్‌కేఎంఎల్ గెస్ట్‌హౌస్ పేరుతో నిర్వహిస్తున్న కేంద్రాన్ని సీజ్ చేస్తున్న పోలీసులు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న లాడ్జీలు, అతిథి గృహాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మొన్నటి వరకు నగరంలో పేకాట స్థావరాలపై రైడింగ్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం వ్యభిచారం, తదితర అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రెండు వారాలుగా లాడ్జీలు, అతిథి గృహాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి డాబాగార్డెన్స్ వెంకటేశ్వరమెట్ట ఆర్చి సమీప విశాఖ ఇన్ లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న వారిని నగర డీసీపీ–1 రంగారెడ్డి అరెస్ట్ చేయగా.. నిన్న బుధవారం రాత్రి సీతమ్మధారలోని శ్రీసాయి గెస్ట్ హౌస్‌లో ఇతర రాష్ట్రాల యువతులతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండడాన్ని గుర్తించి సీజ్ చేశారు.
ఈ గెస్ట్‌హౌస్ యాజమాని దుబాయ్‌లో ఉండడంతో మేనేజరే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారించి, ఓ యువతితో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా గురువారం త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై అశోక్ చక్రవర్తి బీచ్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. పాండురంగాపురం బీచ్ గెస్ట్ హౌస్‌తో పాటు బీచ్ రోడ్డులో ఉన్న కింగ్స్ అపార్ట్‌మెంట్‌లో ఎస్‌కేఎంఎల్ అతిథి గృహాల పేరిట ఉన్న ఆరు ఫ్లాట్లపై దాడులు చేశారు. వీటిల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించి వాటిని సీచ్ చేశారు. పాండురంగాపురం బీచ్ గెస్ట్‌హౌస్‌తో పాటు ఆరు ఎస్‌కేఎంఎల్ ఫ్లాట్లను సీజ్ చేశారు.
మసాజ్ సెంటర్ ముసుగులో..
గతంలో సీతమ్మధారలో మసాజ్ సెంటర్ ముసుగులో థాయ్‌లాండ్ యువతులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేసి, వాటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గాజువాక, బీచ్ రోడ్డు, వీఐపీ రోడ్డు, సీతమ్మధారలో మరికొన్ని మసాజ్ సెంటర్లను నిర్వహిస్తు న్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్ లాండ్ నుంచి టూరిస్ట్ వీసాతో యువతులను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం పోలీసుల వద్ద ఉంది.
అపార్ట్‌మెంట్లలోనే అతిథిగృహాలు..
అతిథిగృహాల పేరిట అపార్ట్‌మెంట్లలో నాలుగు ఫ్లాట్‌లు అద్దెకు తీసుకోవడం.. వాటిల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం ఇటీవల ఎక్కువైంది. అటువంటి వాటిపై పోలీసులు దృష్టి సారించి, ఆ అపార్ట్‌మెంట్ అంతటినీ సీజ్ చేయడానికి పూనుకుంటున్నారు. నగరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న లాడ్జీలు ఎన్ని ఉన్నాయి.. వాటిలో ఎంత మంది నియమ నిబంధనలు పాటిస్తున్నారు.. అతిథి గృహాలకు అనుమతులు ఉన్నాయా.. వారు నియమ నిబంధనలు పాటిస్తున్నారా.. అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదు..
నగరంలోని హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నాం. ఇప్పటికే నగరంలో పలు అతిథిగృహాలను సీజ్‌చేశాం. అతిథి గృహాలు, లాడ్జీల్లో దిగేవారి ఆధార్ తదితర గుర్తింపు కార్డు తీసుకోవాలి. చెక్ ఇన్, చెక్ అవుట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించేదిలేదు. లాడ్జీలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. -రంగారెడ్డి, డీసీపీ–1
Comments
Please login to add a commentAdd a comment