
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత కేజ్రీవాల్‌ను సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిలుస్తారా లేదా అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది. ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, మరో మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.
నూతన సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీలోని లక్షమంది చోటామోటా నేతలను బీజేపీ ఆహ్వానించనుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రమాణస్వీకారానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ నేతలు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, వీరేంద్ర సచ్‌దేవ్ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.
ఫిబ్రవరి 19న జరగబోయే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది వెల్లడికానుంది. తొలుత ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావించింది. తరువాత ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిశ్చయించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులను నియమించనున్నదని సమాచారం. ఈ పరిశీలకులు ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. వీటి ఆధారంగా పార్టీ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తుంది. కాగా ముఖ్యమంత్రి రేసులో న్యూఢిల్లీ ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, రేఖ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్
Comments
Please login to add a commentAdd a comment