అక్రమ రవాణా గుట్టురట్టు
నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: సరైన పత్రాలు లేకుండా భారీగా నగదు, వెండి తరలిస్తున్న ముగ్గురు యువకులను రైల్వే పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 67 కిలోల వెండి ఆభరణాలు, రూ.6.67 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే నెల్లూరు డీఎస్పీ రాజేంద్రకుమార్ తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు..సంక్రాంతి నేపథ్యంలో రైళ్లలో అక్రమంగా బాణసంచా, ఇతర ప్రమాదకర వస్తువులు తరలిస్తున్నారనే అనుమానంతో డీఎస్పీ రాజేంద్రకుమార్, ఇన్‌స్పెక్టర్ విజయకుమా ర్, గూడూరు ఎస్సై వరప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బం ది తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన ధనరాజ్, రాజన్, తంబాలా ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు హౌరా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి వెళ్లేందుకు నెల్లూరులో ఎక్కారు. రైలు బయలుదేరగానే అప్పటికే బోగీలో తనిఖీ చేస్తున్న పోలీసులను గమనించిన ఆ ముగ్గురు బరువైన రెండు బ్యాగులను ఎస్4 బోగీ నుంచి ఎస్ 10 బోగీవైపు తీసుకెళ్ల సాగారు. పోలీసులు వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ బ్యాగులను తనిఖీ చేయగా 67 కిలోల వెండి ఆభరణాలు, రూ.6.67 లక్షల నగదు బయటపడ్డాయి.
వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ముగ్గురు యువకులు, సొత్తును అదుపులోకి తీసుకుని గూడూరు రైల్వేస్టేషన్‌లో దిగారు. అనంతరం నెల్లూరు రైల్వేస్టేషన్‌కు తరలించారు. ఆభరణాల విలువ రూ.30 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. నగదు, వెండిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.