2024–25లో 5.3 బిలియన్ డాలర్లు
సీఎల్‌ఈ చైర్మన్ రాజేంద్ర కుమార్
న్యూఢిల్లీ: లెదర్, పాదరక్షల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ. 5.3 బిలియన్ డాలర్లకు (రూ.45 వేల కోట్లు) చేరుకుంటాయని లెదర్ ఎగుమతుల మండలి (సీఎల్‌ఈ) చైర్మన్ రాజేంద్ర కుమార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో మెరుగైన డిమాండ్ ఉండడంతో రానున్న నెలల్లో ఆర్డర్లు పెరగనున్నట్టు చెప్పారు. 2023–24లో ఎగుమతులు 4.69 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా సహా పలు దేశాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కుమార్ తెలిపారు.
భారత ఎగుమతిదారులు ఆఫ్రికాలోనూ వ్యాపార అవకాశాలను అన్వేíÙస్తున్నట్టు చెప్పారు. 42 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమ మొత్తం ఆదాయం 19 బిలియన్ డాలర్లు కాగా (రూ.1.61 లక్షల కోట్లు), ఇందులో ఎగుమతులు 5 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయని వెల్లడించారు. ‘‘2030 నాటికి ఈ పరిశ్రమ ఆదాయం 47 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇందులో ఎగుమతుల రూపంలో 13.7 బిలియన్ డాలర్లు సమకూరొచ్చు’’ అని అంచనా వేశారు. 47 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకునేందుకు, అదనంగా 7–8 లక్షల మందికి ఉపాధి కల్పనకు వీలుగా తోలు పరిశ్రమకూ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) విస్తరించాలని కోరారు.
బడ్జెట్ అంచనాలు..
బడ్జెట్ అంచనాలపై ఎదురైన ప్రశ్నకు కుమార్ స్పందిస్తూ.. వెట్ బ్లూ లెదర్, క్రస్ట్ లెదర్‌పై 20 శాతంగా ఉన్న ఎగుమతుల సుంకాన్ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరినట్టు తెలిపారు. ఫినిష్డ్ లెదర్ దిగుమతులపైనా సుంకాన్ని తొలగించాలని కోరినట్టు చెప్పారు. భారత తోలు, తోలు ఉత్పత్తుల వృద్ధికి యూఎస్, ఈయూ కీలక మార్కెట్లుగా ఉన్నట్టు గ్రోవ్‌మోర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎండీ యద్వేంద్ర సింగ్ పేర్కొన్నారు. సామర్థ్యాలను విస్తరించడం ద్వారా అవకాశాలను పెంచుకోవాలంటూ దేశీ పరిశ్రమకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment