భువన విజయం | sri sharada shilpa kala mandiram in Allagadda | Sakshi
Sakshi News home page

భువన విజయం

Published Mon, Dec 3 2018 3:09 AM | Last Updated on Mon, Dec 3 2018 4:14 AM

sri sharada shilpa kala mandiram in Allagadda - Sakshi

బ్రహ్మ చేసిన సృష్టికి దీటుగా ప్రతిసృష్టి చేయగలవారు శిల్పులు. యుగాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఈ శిల్ప కళావృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. మగవాళ్లకు సహాయంగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఆడవాళ్లు. ఈ ‘సాధారణంగా’ అనే ఆనవాయితీని చెరిపేశారు భువనేశ్వరి. ఆళ్లగడ్డలో శిల్పకారులుంటారనే సంగతి ఆ జిల్లా వాళ్లకు తప్ప బయటి ప్రపంచానికి తెలియని స్థితి నుంచి ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాలకు కూడా ఆళ్లగడ్డ తెలిసిందంటే ఆ ఘనత.. భువనేశ్వరి శిల్పకళా నైపుణ్యానిదే.

భువనేశ్వరి మొదట్లో శిల్పిగా స్థిరపడాలనుకోలేదు. టెన్‌ టు ఫైవ్‌ ఆఫీస్‌ జాబ్‌ లాంటిది చేయాలనుకున్నారు. ప్రొఫెషనల్‌గా స్థిరపడాలనుకున్నప్పుడు కూడా బొటిక్‌ పెట్టాలనుకున్నారు. బొటిక్‌ పెట్టడానికి ముందు వస్త్రరంగం మీద పట్టు సాధించడానికి స్వయంగా అధ్యయనం మొదలుపెట్టారు. అధ్యయనం అంటే సూరత్‌కో, ముంబైకో వెళ్లి వస్త్ర పరిశ్రమలను చూడడం, డిజైనర్‌ల స్టూడియోలను సందర్శించడం. అయితే అది సాధ్యమయ్యే పని కాదనిపించి, అన్నింటికీ ఇంటర్‌నెట్‌నే ఆధారం చేసుకున్నారామె.

నెలల పాటు ఈ సెర్చింగ్‌లో ఉండగా ఆమె మెదడులో ఓ ఆలోచన మెరిసింది. లూయీ పాశ్చర్‌ పరిశోధనలు చేసి చేసి, ఏళ్ల తర్వాత రేబిస్‌కి మందు కుక్క మెదడులోనే ఉందని తెలుసుకోవడం లాంటిదే భువనేశ్వరికి వచ్చిన ఆలోచన కూడా. ఇంటర్‌నెట్‌లో శోధిస్తుంటే తనకు తెలిసినవి, తెలియనివి ఎన్నెన్నో బయటపడుతున్నాయి. కానీ తన ఇంట్లో తయారవుతున్నటువంటి శిల్పాలు మాత్రం కనిపించలేదు. ప్రపంచం భూగోళమంత పెద్దదే అయినా విశ్వం అరచేతిలో ఇమిడిపోయేటంత అనువైనది కూడా అనిపించిందామెకు.

టన్నుల బరువైన శిల్పాలను ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో, ఓఎల్‌ఎక్స్, క్వికర్‌లలో పెట్టి, వాటి వివరాలను ప్రాధాన్యతలను వివరించడం మొదలుపెట్టింది. అమెరికా కస్టమర్‌ మేరీ యాన్‌ మెగసెసె తనను వెతుక్కుంటూ ఆళ్లగడ్డ వచ్చినప్పుడు అనిపించిందామెకు తాను చేస్తున్న ప్రయత్నం విజయవంతం అయి తీరుతుందని. రెండున్నర లక్షల రూపాయల ఆర్డర్‌ వచ్చింది. ఫేస్‌బుక్‌ ఆధారంగా భువనేశ్వరి అందుకున్న తొలి ఆర్డర్‌ అదే.

నాన్నకు నమ్మకం కలిగింది
భువనేశ్వరి తండ్రి రవీంద్రాచారి జీవితాన్ని శిల్పకళకే అంకితం చేశారు. ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి బాలవీరాచారి కాలం చేశారు. రోజుకు ఇరవై రూపాయల కూలికి పని చేసి, కొన్నేళ్లకు వృత్తిలో స్థిరపడి, తండ్రి స్థాపించిన శిల్పకళామందిరానికి పూర్వవైభవం తెచ్చారాయన. భువనేశ్వరికి ఇంట్లో రోజూ ఉలి చప్పుళ్లు వినిపిస్తూనే ఉండేవి. ఆసక్తి కొద్దీ తమ్ముడితోపాటు శిల్పాల దగ్గరకు వెళ్లినా సరే... రవీంద్రాచారికి మనసొప్పేది కాదు. కూతురు దుమ్ములో పని చేయడం నచ్చేది కాదాయనకు.

సున్నితమైన చేతులు ఉలిని పట్టుకుని గట్టిపడిపోతాయని వద్దనే వాడు. అంత గారంగా పెంచుకున్న తండ్రి... కూతురి జీవితం కూడలిలో ఉందని తెలిసినప్పుడు ఒక మాటన్నారు. ‘బాధపడుతూ ఎటూ తేల్చుకోలేక ఎంత కాలం గడిపినా సరే, పరిష్కారం దొరకదు. పని మీద ధ్యాస పెట్టు, గమ్యం తెలిసే వరకు పనిలోనే మునిగిపో’ అని చెప్పాడు. నైపుణ్యం వచ్చే వరకు శిక్షణనిచ్చాడాయన. భువనేశ్వరి విదేశీ కస్టమర్‌ నుంచి తొలి ఆర్డర్‌ అందుకున్నప్పుడు ఆయనకు కూతురి భవిష్యత్తు పట్ల భరోసా కలిగింది.

శిల్పాల పురిటిగడ్డ!
ఆళ్లగడ్డలో శిల్పుల కుటుంబాలు రెండొందలకు పైగా ఉన్నాయి. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన నిపుణులున్నారు. అయితే బొమ్మల కోసం తమ దగ్గరకు వినియోగదారులను తీసుకురావడం ఎలాగో తెలియదు. కులవృత్తితో భుక్తి జరగక తిప్పలు పడుతున్న వాళ్లే ఎక్కువ. అలాంటిది భువనేశ్వరి ప్రయత్నంతో ఆళ్లగడ్డ అంటే శిల్పాల పురిటిగడ్డ అనుకుంటోంది ప్రపంచం. ఆమెతోపాటు ఆ గ్రామంలో అనేక మందికి ఉపాధి మెరుగైంది. ఆమె దగ్గర ఆళ్లగడ్డలో యాభై మంది, క్యాంపుల్లో ముప్పై మంది శిల్పులు పని చేస్తున్నారు.

ప్రస్తుతం యాదగిరి గుట్టలో శిల్పాలు చెక్కుతున్నారు. ఇప్పుడు ఇంటీరియర్‌ డెకరేషన్‌లో కూడా శిల్పాల ప్రాధాన్యం పెరిగింది. ఇళ్లలో డైనింగ్‌ టేబుల్, కార్నర్‌ స్టాచ్యూలు, గార్డెన్‌లో పర్గోలా (రాతి మండపం)లు పెట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ కూడా శిల్పకారులకు మంచి ఉపాధిగా మారింది. కులవృత్తి ఊరుదాటలేక అంతరించి పోతున్న ఈ టెక్‌ యుగంలో టెక్నాలజీనే ప్లాట్‌ఫామ్‌గా చేసుకుని వంశపారంపర్యంగా వచ్చిన కళకు జీవం పోస్తున్నారు భువనేశ్వరి.

దేవుడి విగ్రహానికి సెంటిమెంట్‌
దేవుడి విగ్రహాలకు కళ్లను శిల్పకళామందిరాల్లో గీయరు. విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లిన తర్వాత శిల్పి గర్భగుడిలోకి వెళ్లి బంగారు లేదా వెండి సూదితో కళ్లను చెక్కుతారు. ఎందుకంటే.. ‘దేవుడు ముందే కళ్లు తెరిచి తనను ఆలయంలోకి ఎప్పుడు చేరుస్తారా, భక్తులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడకూడదు. భక్తులు ఎదురు చూస్తుండగా దేవుడు కళ్లు తెరవాలి’ అని చెబుతారు.

ఇల్లే యూనివర్సిటీ
‘‘కులవృత్తిలో నైపుణ్యం సంపాదించడం యూనివర్సిటీలో కోర్సు చేయడం కంటే ఎక్కువే. నిత్యం ప్రాక్టికల్‌ క్లాసులకు హాజరైనట్లే. మా విశ్వబ్రహ్మల కుటుంబాల్లో పిల్లలు పలక బలపం పట్టుకోవడం వచ్చినప్పటి నుంచి బొమ్మలు గీస్తుంటారు. ప్రతి శిల్పకారునిలోనూ చిత్రకారులుంటారు. మాస్టర్‌ శిల్పి కావాలంటే బొమ్మ గీయడం బాగా వచ్చి ఉండాలి. అలాగే శిల్పకారులు తప్పని సరిగా తమ మానసిక స్థితిని సాంత్వన పరుచుకుని పనిలోకి దిగాలి. ఎందుకంటే... మన మనసులోని భావాలు శిల్పం ముఖంలో ప్రతిబింబించి తీరుతాయి.

అయితే ఈ కళలో ఉండే గొప్పతనం ఏమిటంటే... కష్టాలను, బాధలను అదిమిపెట్టుకుని, మనసు చిక్కబట్టుకుని పని మొదలు పెట్టిన కొంత సేపటికే పనిలో నిమగ్నమైపోతాం. పని పూర్తయిన తర్వాత తేలికపడిన మనసుతో ఉలి పక్కన పెడతాం. రకరకాల శిల్పాలు చేస్తాం కానీ బుద్ధుడి విగ్రహం చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆయన ముఖంలో ప్రశాంతత, ఉంగరాలు తిరిగిన జుట్టు, సున్నితమైన వేళ్లు... వేటికవే క్లిష్టంగా ఉంటాయి. వాటన్నింటికంటే అర్ధనిమీలిత నేత్రాలను చెక్కడం నిజంగా   బ్రహ్మ విద్య అనే చెప్పాలి’’ అంటారు భువనేశ్వరి.

ఆరు భాగాలు.. ఆరు దశలు
ఒక శిల్పం రూపుదిద్దుకోవాలంటే తల, మెడ, నడుము, మోకాళ్లు, చీలమండలు, పాదాలు... ఇలా ఆరు భాగాలుగా పని జరుగుతుంది. ముఖం పొడవు ఇన్ని అంగుళాలుంటే... మెడ ఎంత ఉండాలి, దేహం పొడవు, కాళ్లు, పాదాల పొడవు... ప్రతిదీ కొలత ప్రకారం జరగాలి. శాస్త్రబద్ధంగా లెక్క ఉంటుంది. మాకు పెద్దవాళ్లు నోటిమాటగా చెప్పి నేర్పించేస్తారు. పుస్తకం చూడాల్సిన అవసరం రాదు. మొదట రాయి మీద బొమ్మ వేస్తారు. ఈ పనిని మా నాన్నలాగ మాస్టర్‌లే చేయాలి. ఆ తర్వాత బ్లేడ్‌ మెషీన్‌తో ఎక్స్‌ట్రాలు తీసేయాలి. మూడవ దశలో శిల్పంలో ప్రధాన ఆకారం వచ్చేటట్లు బిట్‌ మెషీన్‌తో చెక్కాలి. ఆ తర్వాత శిల్పానికి పాలిష్‌. ఐదవ దశలో వేళ్లు, ఆభరణాలు, వస్త్రాలు, జుట్టు వంటి లైనింగ్‌ వర్క్‌ చేసి, డైమండ్‌ టూల్‌తో జీవరేకలు గీయాలి. చివరగా కళ్లు పెట్టాలి.

మా తాత శ్రీశైలంలోని భ్రమరాంబిక ఆలయం, మహానంది ఆలయంలో అద్దాల మండపం, అహోబిలంలో కోనేరు వంటి ప్రసిద్ధ నిర్మాణాలు చేశారు. ఆయన స్థాపించినదే ‘శారద శిల్పకళామందిరం’. నాన్న అనారోగ్యం వల్ల ఇప్పుడు నేను, తమ్ముడు చూసుకుంటున్నాం. కస్టమర్లు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కాంటాక్ట్‌ చేస్తున్నారు. వాళ్లకు ఆళ్లగడ్డ రావడం కంటే కర్నూలు సౌకర్యంగా ఉంటుందని అక్కడో బ్రాంచ్‌ పెట్టాను. మైసూర్, పులివెందుల దగ్గర మల్యాల, కర్నూలు దగ్గర వెల్దుర్తి నుంచి రాళ్లను తెచ్చుకుంటాం. విగ్రహానికి రాయిని ఎన్నుకోవవడంలోనే నైపుణ్యం ఉంటుంది. దేవుడు కృష్ణశిల (నల్లరాయి)లో ఉంటాడని చెబుతారు.

రాయి లోపల సన్న పగులు ఉన్నా సరే దానిని పక్కన పడేయాల్సిందే. ఉలితో శిల మీద దెబ్బ వేయగానే వచ్చిన శబ్దం చెప్పేస్తుంది ఆ రాయి గట్టిదా డొల్లదా అని. నేను ఎక్కువ కష్టపడిన విగ్రహాల్లో ద్రాక్షారామంలోని శివుడు ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం కోసం, లేపాక్షి నంది విగ్రహం కోసం మాత్రమే. అది నిజానికి కష్టం కాదు ఆందోళన. గోదావరి పుష్కరాల కోసం 13 అడుగుల విగ్రహం ఆర్డర్‌ చేశారు, 25 రోజుల్లో పూర్తి చేయాలి. మొత్తం ఇరవై మందిమి... పగలు పది మంది, రాత్రి పదిమంది షిఫ్టుల్లో పనిచేశాం. కృష్ణాపుష్కరాల కోసం చేసిన కృష్ణవేణి విగ్రహం (శ్రీశైలం పాతాళగంగ ఘాట్‌), శ్రీశైలం శిఖరం మీద ఉండే నంది విగ్రహం చాలా సంతోషాన్నిచ్చాయి. మా తాత శిల్పాలున్న శ్రీశైలంలో నా శిల్పాలు కూడా ఉండడం నాకు సంతోషాన్నిచ్చింది.

– భువనేశ్వరి, శిల్పి, శారద శిల్పకళామందిరం నిర్వాహకురాలు

ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటోలు: బి. వి. కృష్టయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement