ఇంటీరియర్‌.. ఇదో ట్రెండ్‌ | interior designing in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటీరియర్‌.. ఇదో ట్రెండ్‌

Published Thu, Feb 20 2025 7:42 AM | Last Updated on Thu, Feb 20 2025 7:42 AM

interior designing in hyderabad

వినూత్న అలంకరణకు విభిన్న విధానాలు 

ఇంటీరియర్‌ హబ్‌గానూ హైదరాబాద్‌ 

నగరానికి అంబానీ, బిర్లా వంటి సంస్థల ఉత్పత్తులు 

ఈ తరం.. సాధారణ జీవనానికి భిన్నంగా.. వినూత్నమైన, విభిన్నమైన పంథాను, జీవనసరళిని కొనసాగించడం ట్రెండ్‌గా మారింది. ఇందులో భాగంగానే అధునాతనాన్ని అందిపుచ్చుకుంటూ నగర జీవనశైలికి కూడా అప్‌డేట్‌ అవుతూనే ఉంది. ప్రధానంగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ ఈ దశాబ్ద కాలంలో కొత్తపుంతలు తొక్కుతోంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మొదలు విలాసవంతమైన ఇళ్ల వరకు ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. నిత్యం ఉండే ఇంటిలో కనీసం ఏదో ఒక ప్రత్యేకత, ఆకర్షణీయ అంశం ఉండాలని కోరుకుంటున్నారు. ప్రొఫెషనల్‌గా, వ్యక్తిగతంగా అభిరుచికి తగ్గట్టు ఇంటిని మలుచుకుంటున్నారు. కొందరు కన్‌స్ట్రక్షన్‌ నుంచే ఇంటీరియర్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు. 

ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అనేది విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించే వారి సంస్కృతి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది మానమూలాల్లోనే ఉంది. దానికి అధునాతన సొగసులు ఈ మధ్య అద్దుతున్నారని ఓ ఇంటీరియన్‌ డిజైనర్‌ అంటున్నారు. గతంలో ఇళ్లలో అరుదైన పెయింటింగ్, పురాతనమైన వస్తువు లేదా ఇతర ఔరా అనిపించే వస్తువులతో అలంకరించుకునే వారు. నగర జీవనంలో ఈ సంస్కృతి అప్‌డేట్‌ అవుతూనే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ మారిందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అంటే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆకర్షణీయమైన వస్తువులు, స్థానికంగా లభించే అందమైన కళాకృతులు, వేలాడే లైట్లు, కిటికీల పరదాలు, టీ పాయ్‌ సొగసులు.. ఇలా ఇంటీరియర్‌కేది అనర్హం అనేంతలా ఎన్నెన్నో హంగులు అద్దుకున్నాయి.

మోడ్రన్‌ క్రిస్టల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి  
ముఖ్యంగా ఇంటిలోపలికి రాగానే అవాక్కవ్వాలనేది అందరి ఆశ.. దీని కోసం అరుదైన గ్లాస్, బ్రాంజ్, పింగానీ ప్రతిమలను నగరంలో విరివిగా వాడుతున్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు, గిరిజనులు తయారు చేసిన హ్యండ్‌మేడ్‌ కళాకృతులు, ఈ తరానికి చెందిన మోడ్రన్‌ క్రిస్టల్‌ ఆర్ట్స్‌ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నూలు ధారాల అల్లికలతో నేసిన పరదాలు, డిజైన్స్, హ్యంగింగ్స్‌ వంటివి కూడా ఇష్టపడుతున్నారు. నగర అధునాతన జీవన శైలిలో దిగుమతి చేసుకున్న అరుదైన, అందమైన ఇంటీరియర్స్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. స్థానిక సహజ ఉత్పత్తులు, ఎకో ఫ్రెండ్లీ డిజైనింగ్‌ వేర్, ఆర్గానిక్‌ సౌందర్య వస్తువులు, అల్లికలు, చేతివృత్తుల వస్తువులకూ అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. ఇందులో భాగంగానే అంబానీ కుటుంబానికి చెందిన వ్యాపార సౌదం స్వదేశ్‌ స్టోర్స్, ఆదిత్య బిర్లాకు చెందిన జైపూర్‌ స్టోర్స్‌ వంటివి నగరంలో వెలిశాయి. ఇలాంటి అతిపెద్ద వ్యాపార సంస్థలకు హైదరాబాద్‌ నగరం కేంద్ర బిందువుగా మారడంలో.. నగరవాసుల ఇంటీరియర్‌ ఆసక్తి మరింత పెరిగింది.

చిన్న చిన్న షాపులు 
హైదరాబాద్‌ నగరం ఘనమైన చరిత్రకు సాక్ష్యం. ఈ ప్రశస్తిని కొనసాగిస్తూనే ఇప్పటికీ కొందరు నగరవాసులు అరుదైన యాంటిక్‌ వస్తువులను తమ ఇళ్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ వస్తువులను అమ్మడానికి నగరంలోని ఓల్డ్‌సిటీతో పాటు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌ వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా షాప్‌లు ఉన్నాయి. ఇందులో లక్షల్లో అమ్మే షాపులు మొదలు కేవలం రూ.వంద వస్తువులు సైతం లభించే చిన్న చిన్న షాపులున్నాయి.  

ఇంటీరియర్‌ మొక్కలను పెంచుతూ..  
కాలుష్యరహిత వాతావరణంతో పాటు ఆహ్లాదమైన అనుభూతిని పొందాలనుకునే ప్రకృతి ప్రేమికులు తమఇళ్లలో ఇంటీరియర్‌ మొక్కలను పెంచుతూ తమ విభిన్న జీవనశైలిని ప్రదర్శిస్తున్నారు. ఇందులో చిన్న సైజు ఆర్కిడ్‌ మొక్కలు మొదలు పెద్దగా పెరిగే ఆర్నమెంటల్‌ మొక్కల వరకు ఉన్నాయి. మెయిన్‌ హాల్, టీ పాయ్, డైనింగ్‌ టేబుల్, హ్యాంగింగ్‌ మొదలు విభిన్న హంగులతో ఈ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ మొక్కలు నగరంలో లభిస్తున్నాయి.  

ప్రత్యేక ఆసక్తితో..
ఇంటీరియర్‌ డిజైన్‌ ప్రతి ఇంట్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. వ్యక్తిగత శైలి, సౌకర్యాన్ని ప్రతిబింబించేలా 
ఇంటిని, పిల్లల గదులు, అతిథి గదులను అలంకరించడంలో ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. ఫరి్నచర్‌తో పాటు ఇండోర్‌ జలపాతాలు, బుద్ధుడు, వినాయక విగ్రహాలు.. ఆకర్షణీయమైన లైటింగ్, సుగంధ ధూపం కర్రలతో దైవిక వాతావరణం కోసం అలంకరించుకుంటున్నారు. టీవీ యూనిట్లు, ఖరీదైన సోఫాలు, డైనింగ్‌ టేబుళ్లు, ఆధునిక గృహాలను విలాసవంతంగా మార్చుకుంటున్నారు.  
– ఫిరోజ్‌ సయ్యద్, ఎంఅండ్‌పీ ఇంటీరియర్స్‌ వ్యవస్థాపకులు  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement