
ఎండలు మండుతున్నాయి.. ఉదయం 10 గంటలు దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. ఈ సమయంలో మైనస్ డిగ్రీల్లో గడ్డకట్టే చల్లని ప్రదేశం కోసం ఎదురుచూస్తున్నారా..? ఉపశమనం కోసం హిమగిరుల్లో సేదతీరాలని కోరుకుంటున్నారా.. సిమ్లా పొగ మంచులో విహరించాలని, డార్జిలింగ్ గడ్డకట్టిన మంచుపై స్కేటింగ్ చేయాలని ఆశిస్తున్నారా.. అయితే మీకోసం నగరంలో స్నో థీమ్‌తో వింటర్ థ్రిల్లింగ్ ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి.కాశ్మీర్ మంచు కొండల అనుభూతిని కొండాపూర్‌లోని ఓ మాల్‌తో పాటు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఓ ప్రాంతంలో సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
కుటుంబ సభ్యులు, పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వానిరి ఆకట్టుకోవడానికి వింటర్ థ్రిల్లింగ్ వినోద కేంద్రాల్లో ప్రత్యేకించి ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, చదువు, పనిఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మైనస్ డిగ్రీల్లో సేదతీరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. స్నో ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందు చలిని తట్టుకునే జర్కినీ, బూట్లు, చేతి గ్లౌజ్‌లు నిర్వాహకులు అందిస్తారు. విశాలమైన మంచు గదిలోకి వెళ్లగానే కశీ్మర్, సిమ్లా, డార్జిలింగ్ తదతర ప్రదేశాలు గుర్తుకొస్తాయి. మంచు కొండలు ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవచ్చు. ఇక్కడే తక్కువ ఖర్చుతో ఆ అనుభూతి పొందవచ్చు. మండు వేసవిలో గడ్డకట్టిన స్నో, పొగ మంచుపై కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.
పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు
హిమాలయాల్లో ఉన్నామన్న ఫీల్ ఉంది. చాలాబాగా నచ్చింది. గడ్డకట్టిన ఐస్, పొగమంచు, వివిధ రకాల థీమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మేం మొత్తం ఐదుగురం వచ్చాం. మా కంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
– దీప, షేక్‌పేట్, హైదరాబాద్
బాగా నచ్చింది ..
మాది విశాఖపట్నం. మా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి గతంలో ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతం ఎంతగానో నచ్చింది. మరో రావాలనిపించింది. పాఠశాలలకు సెలవులు కావడంతో మళ్లీ మా అక్క నేను వచ్చాం. మంచులో బాగా ఎంజాయ్ చేస్తున్నాం.
– హనీష్, రిథిమ, విశాఖపట్నం
మంచు క్రీడలు..
విశాలమైన అతిశీతల గదుల్లో మంచు క్రీడలు అందుబాటులో ఉంటాయి. టోబోగానింగ్, స్నో స్లెడ్డింగ్, స్నో రాక్ క్లైమింగ్, స్నో డాన్స్, ఫ్లోర్‌లో డాన్స్ వంటివి ప్లాన్ చేసుకోవచ్చు. మంచు ప్యాలెస్‌లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, నల్ల సీల్స్‌తో కూడిన ఓక్ చెట్లు, ధ్రువ ఎలుగుబంట్లు, పెంగి్వన్‌లు, ఇగ్లూలు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నో మచ్ ఫన్, గేమ్స్‌తో గొప్ప జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ ధరలు ఉంటాయి.