
జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న నిపుణులు
సన్ స్క్రీన్, గొడుగుతో కొంత వరకూ ఉపశమనం
తినే ఆహారం, వేసుకునే బట్టలూ కీలకమే
చర్మ సౌందర్యానికి చిట్కాలు చెబుతున్న బ్యుటీషియన్లు
అందంగా కనబడాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం భానుడు భగభగలతో చర్మానికి రక్షణ లేకుండా పోతోంది. గడప దాటిన వెంటనే వేడి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా ముఖం, చేతులు సూర్య కిరణాలు నేరుగా తగిలే ఇతర ప్రదేశాల్లో చర్మం నిర్జీవంగా మారిపోతోంది. దీంతో చర్మ కాంతి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు.
వేసవిలో చర్మానికి చెమటలు పట్టడం, జిడ్డుగా మారడం, పొడిబారిపోవడం, నల్లని మచ్చలు రావడం, ముఖంపై మొటిమలు, ఇలా ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో ఉత్పన్నమవుతాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది వారికి తెలిసిన వివిధ రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యం దెబ్బతినడానికి మృత కణాలు కూడా ఒక కారణం. అయితే వీటి వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది. చెమట గ్రంథుల్ని మూసివేడయం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటి నుంచి అధిగమించాలంటే ఈ చిక్కాలు పాటించాల్సిందే..
సన్ స్క్రీన్‌తో మేలు..
సూర్యకిరణాల నుంచి విడుదలయ్యే అధిక యూవీ ఎక్స్‌పోజర్ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సూర్యకిరణాలు తాకే ప్రదేశాల్లో సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలు, మచ్చలను నియంత్రించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖం మృదువుగా చేస్తుంది.
పళ్లు , పళ్ల రసాలు తీసుకోవడం మంచిది..
వేసవి తాపానికి శరీరం తేమ కోల్పోతుంది. ఫలితంగా చర్మం ఎరగ్రా కందిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్లతో పాటు, శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను పునరుద్ధరిస్తాయి. చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. నిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, దానిమ్మ, వాటర్ మెలాన్, బ్లూబెర్రీ, కివీ, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
మేకప్ తక్కువగా వేసుకోవాలి..
సూర్య కిరణాల నుంచి వెలువడే యూవీ ఎక్స్‌పోజర్ చర్మానికి హానికలిగిస్తుంది. దీనిని నుంచి రక్షణ కోసం ఎస్‌పీఎఫ్ 50 ఉన్న యూవీ స్పెక్ట్రమ్ సన్ బ్లాక్, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కాలంతో సంబంధం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌్రస్కీన్ లోషన్ రాసుకోవాలి. వేసవిలో ఇది మరింత అవసరం. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడగడం, స్నానం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రతకు చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండటానికి నిపుణుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో తిరగకుండా ఉండేందుకు ప్రయతి్నంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తే ఎండ నుంచి ఉపశమనం కోసం బ్లాక్ గాగుల్స్, ఎండ తగలకుండా స్కార్‌్ఫ్స, గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసుకునే దుస్తులు కాటన్ మెటీరియల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. లూజుగా ఉన్న కాటన్ బట్టలు ధరించాలి.
– ఆలపాటి శిరీష, కాస్మటాలజిస్టు, సికారా క్లినిక్స్, బంజారాహిల్స్