వైజాగ్ ‘పంచ్’ పవర్ | Vizag 'Punch' Power | Sakshi
Sakshi News home page

వైజాగ్ ‘పంచ్’ పవర్

Published Fri, Jun 13 2014 11:19 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

Vizag 'Punch' Power

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటి ష్ దేశీయులు తమ వినోదం కోసం ఇక్కడ సరదాగా బాక్సింగ్‌ను ఆడడం ప్రారంభించారు.. కాలక్రమేణా అది నేడు విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. ఆంగ్లో ఇండియన్స్‌ను ఆనందింపజేసేందుకు నాటి విశాఖవాసులు చేతులకు గుడ్డలు చుట్టుకొని ఆడుతూ వినోదం పంచితే.. ప్రస్తుత తరం  ప్రపంచ వేదికలపై పవర్ పంచ్‌లు విసురుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. పురుషులతోపాటు మహిళా బాక్సర్లనూ తయారు చేస్తూ విశాఖ.. జాతీయ స్థాయి శిక్షణ శిబిరాలకు కేంద్రంగా మారింది. ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీ కోమ్ కూడా ఈ శిబిరాల్లో పాల్గొన్న బాక్సరే.
 (-ప్రకాష్ మాడిమి, విశాఖపట్నం, న్యూస్‌లైన్)
 
1947కు ముందు ఆంగ్లో ఇండియన్లు విశాఖలో ఎక్కువగా నివసించేవారు. వారంతా ఇక్కడ రైల్వే, పోర్టు, షిప్ యార్డుల్లో పనిచేసేవారు. ఖాళీ సమయాల్లో ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ బాక్సింగ్ ఆడుతుంటే స్థానికులు అమితాసక్తితో గమనించేవారు. బ్రిటిష్ వారు నౌకల్లోని డెక్ పైన ఓపెన్ ప్లేస్‌లో ఈ ఆటలాడేవారు. ఇక డచ్ వారు నావికుల మధ్య బాక్సింగ్ పోటీలు పెట్టేవారు. నౌకల్లో పనిచేసే వారి చేతికి గుడ్డలు చుట్టి సాయంత్రం వేళల్లో రిక్రియేషన్‌గా బాక్సింగ్ పోటీలు నిర్వహించేవారు. నగదు ప్రోత్సాహకాలను కూడా అందించేవారు. ఈ పోటీల్ని ఆసక్తిగా గమనిస్తూ స్థానికులు బాక్సింగ్‌పై మక్కువ పెంచుకొన్నారు. క్రమంగా మెళకువలూ నేర్చుకున్నారు.
    
జాతీయ సమాఖ్య ఏర్పాటుతో ప్రాధాన్యత..


అప్పటి వరకు బ్రిటిష్, డచ్‌వారికి ఆనందాన్నందించిన ఆ ఆట భారత బాక్సింగ్ సమాఖ్య ఏర్పడటంతో అధికారిక పోటీలకు నోచుకుంది.  రైల్వే యార్డ్స్‌లో ఫోర్‌మెన్‌గా ఆంగ్లో ఇండియన్స్ ఉండటంతో బాక్సింగ్ సంస్కృతి అక్కడ నుంచే స్థానిక ఆటగాళ్లకు చేరింది. కాలక్రమేణా ఆంగ్లో ఇండియన్స్‌కు పోటీనిచ్చే స్థాయికి స్థానిక బాక్సర్లు ఎదిగారు. ఇదే క్రమంలో కోస్తా ప్రాంతంలో బాక్సింగ్ క్రీడకు ప్రాధాన్యత పెరిగింది. ఈస్ట్ కోస్ట్ ప్రాంతమైన విశాఖ నుంచి కోల్‌కతా వరకూ పాకింది. సమాఖ్య చొరవతో విశాఖ పాతపట్నమైన వన్‌టౌన్ ఏరియాలోనూ అమెచ్యూర్ ఆటగాళ్లు తయారయ్యారు.
    
విశాఖ బాక్సింగ్ సంఘం ఆవిర్భావం..

విశాఖలో బాక్సింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. 1997లో స్థానికంగానే  ప్రాంతీయ హాస్టల్‌ను ఏర్పాటు చేసింది. అయితే  పోటీలు ఎక్కడ, ఎలా జరుగుతాయనే విషయంపై అవగాహన లేకపోవడంతో పోటీల్లో తలపడే అవకాశం స్థానికులకు దక్కేది కాదు. ఈ పరిస్థితుల్లో జేమ్స్ ఆధ్వర్యంలో విశాఖలో బాక్సింగ్ సంఘం ఏర్పాటైంది. దీంతో స్థానికంగా కొన్ని క్లబ్‌లను ఏర్పాటు చేసి వాటి మధ్య పోటీలకు అంకురార్పణ జరిగింది. పది వెయిట్ కేటగిరీల్లో తలపడే క్లబ్‌లకు గుర్తింపునివ్వడం, మూడు టోర్నీల వరకు మిగిలిన క్లబ్‌లకు అవకాశం కల్పించి క్లబ్‌లను నియంత్రించడంతో బాక్సింగ్ టోర్నీల హవా ప్రారంభమైంది. దానికి నగర పోలీస్ కమిషనర్లు కూడా సహకరించారు. అయితే అప్పటికే బాక్సింగ్ శిక్షణ కేంద్రం తరలివెళ్లి డీఎస్‌ఏకు అనుసంధానం చేయడంతో మూడేళ్లకే హాస్టల్ ముగిసింది.
    
అకాడమీ ఏర్పాటుతో ఊపు

అప్పటి వరకు ప్రాంతీయ హాస్టల్‌గా ఉండి, శాప్‌కు అనుసంధానించబడిన బాక్సింగ్ క్రీడ.. అకాడమీ ఏర్పాటుతో విశాఖలో ఊపందుకుంది. మరో మూడేళ్ల పాటు శాప్ ఆధ్వర్యంలోపోర్ట్ స్టేడియంలోనే నడిచిన రాష్ట్ర అకాడమీ పాత్ర ముగిసింది. అయితే 2003లో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్).. అకాడమీల స్కీమ్‌లో భాగంగా విశాఖలో ఎస్టీసీ ఏర్పడింది. రెసిడెన్షియల్‌గా శిక్షణనిచ్చే ఏర్పాట్లు ఊపందుకున్నాయి.  జాతీయ శిక్షణ శిబిరాలు చోటు చేసుకున్నాయి.  దాంతో అంతర్జాతీయ పోటీల్లోనూ విశాఖ బాక్సర్లు, ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్ల రాణింపు పెరిగింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ కూడా ఇక్కడ నిర్వహించిన రెండు జాతీయ శిక్షణా శిబిరాల్లో పాల్గొంది.
    
సీనియర్లే కోచ్‌లు..

స్థానికంగా బాక్సింగ్ క్రీడకు ప్రాచుర్యం ఉన్నా సాంకేతికంగా శిక్షణ పొందిన కోచ్‌లు కరువయ్యారు. దీంతో సీనియర్ బాక్సర్లే కోచ్‌ల పాత్రను కూడా పోషించాల్సి వచ్చింది. అయితే ఉమామహేశ్వరరావు కోచ్‌గా శిక్షణ తీసుకోవడంతో మార్పు చోటుచేసుకుంది. అదే క్రమంలో శిక్షకునిగా వచ్చిన వెంకటేశ్వరరావు కూడా ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. 70వ దశకంలోనే సీనియర్ స్టేట్ మీట్‌కు వరుసగా రెండు సార్లు విశాఖ ఆతిథ్యమిచ్చింది. సాయి ప్రసాద్, ఉదయ్ ప్రకాష్, నాగేంద్ర, లింగేశ్వరరావు, ఇజాన్, వరహాలరావు వంటి వారు జాతీయస్థాయికి ఎదిగారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో సురేష్, ప్రపంచ బాక్సింగ్  టోర్నీలో ఉదయ్‌ప్రకాష్, కిరణ్, యుగంధర్ లాంటివారు పదునైన పంచ్‌లతో ఆకట్టుకున్నారు.
    
అంతర్జాతీయ స్థాయిలో మహిళా బాక్సర్లు

కాలక్రమేణా విశాఖ అమ్మాయిలు కూడా బాక్సింగ్‌పై మక్కువ పెంచుకోసాగారు. ఏకంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనే పతకాలు అందుకునే స్థాయికి ఎదిగారు. తొలిసారిగా ఈ ఘనతను సాధించిన బాక్సర్ కనకదుర్గ. 2004లో దుబాయ్ వేదికగా సాగిన అంతర్జాతీయ బాక్సింగ్‌లో ఈమె స్వర్ణం సాధించింది. మరో రెండేళ్లకు ఉష ఫైనల్‌కు చేరుకుని రజతాన్ని అందుకుంది. 2007లో ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్‌లోనూ రజతాన్ని సాధించింది. ఆ తరువాత కోచ్ (ఎన్‌ఐఎస్)గానూ శిక్షణ పూర్తి చేసుకుంది.

బాలుర విభాగంలోనూ...

బాలుర విభాగంలో 2005లో ఎం.సురేష్ వియత్నాంలో జరిగిన ఆసియన్ క్యాడెట్ బాక్సింగ్‌లో కాంస్యం సాధించాడు. ప్రస్తుతం సబ్ జూనియర్స్ స్థాయిలోనూ విశాఖ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. 2005లో జరిగిన జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో చిన్నారావు, భాస్కర్, సాగర్, శ్యామ్ కుమార్‌లు, ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో ప్రవీణ్ స్వర్ణ పతకాలు సాధించారు. బాలికల సబ్ జూనియర్స్‌లో ఉమారాణి, నిరోషా, సుజాత స్వర్ణాలందుకున్నారు. ఇంకా ఎంతో మంది వర్ధమాన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
 
‘అప్పట్లో కిట్స్ కూడా ఉండేవి కావు’
 అప్పట్లో నేను జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా.. ట్రాక్ తీసుకోవడం అంటే కలే.  కనీసం కిట్స్ కూడా ఉండేవి కావు. ఏడాదికి ఒక టోర్నీలో తలపడితే గొప్పే. నేడు పరిస్థితులు పూర్తిగా భిన్నం. వసతులు పెరిగాయి.  నెలకో టోర్నీ వచ్చింది. ఔత్సాహిక క్రీడాకారులు ట్రాక్ లేకుండా ప్రాక్టీస్‌నే మొదలెట్టడం లేదు. గల్లీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ విశాఖలో బాక్సింగ్ అభివృద్ధి చెందింది.      
- జేమ్స్, విశాఖ బాక్సింగ్ సంఘం వ్యవస్థాపకుడు
 
‘కామన్వెల్త్‌లో స్వర్ణం తెస్తా’
మూడో కామన్వెల్త్ బాక్సింగ్ ట్రయల్స్‌కు వెళ్తున్నాను. సీనియర్ విభాగంలో పతకాలు సాధించడమే లక్ష్యం. యూత్ కామన్వెల్త్‌లో స్వర్ణం సాధిస్తాను. 2009 నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయంగా పతకాలు సాధిస్తున్నా. రెండు సార్లు వరల్డ్‌కప్ బాక్సింగ్‌లో సత్తా చాటాను. టర్కీ, సెర్బియాల్లో స్వర్ణాలందుకున్నాను. బల్గేరియా, సెర్బియాల్లో ఫైనల్‌కు చేరాను.   
-నిఖత్ జరీన్ (బాక్సర్)
 
‘యూత్ ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్నా’
ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించాను. గతంలో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచాను. మరో టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాను. అయితే ప్రస్తుతం యూత్ ఒలింపిక్స్‌లో సీనియర్ విభాగంలో పతకం సాధించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
 - శ్యామ్ కుమార్, అంతర్జాతీయ బాక్సర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement