దిగివచ్చిన హిందుజా
- తెలంగాణకు వాటా మేర విద్యుత్ సరఫరాకు అంగీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా మేరకు విద్యుత్ సరఫరాకు హిందుజా కంపెనీ సూత్రప్రాయంగా అంగీకరించిం ది. గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లోని పలు షరతులపైనే తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిం ది. ఎట్టకేలకు తెలంగాణ డిస్కంతో సంప్రదింపులకు ముందుకు వచ్చిన ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులతో చర్చలు జరిపారు.
‘‘1998లో హిందుజా కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. అయితే 2003లో అమల్లోకి వచ్చిన విద్యుత్ చట్టం ప్రకారం కొన్ని సవరణలు చేసుకోవాల్సి ఉంది. వాటిపైనే చర్చలు జరిగాయి. పరస్పర అంగీకారం కుదిరింది. కొన్ని చిన్న చిన్న అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తీర్పునకు లోబడి పరిష్కారం చేసుకోవాల్సి ఉంది..’’
అని చర్చల అనంతరం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. అయితే విద్యుత్ వాటాల పంపిణీ విషయంపై డిస్కం అధికార వర్గాలు మాట్లాడుతూ ‘‘హిందుజా ప్రైవేటు కంపెనీ. గతంలోనే డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గతంలో ఉన్న పీపీఏలన్నీ అమల్లోనే ఉంటాయి. ఆ కంపెనీ ఒప్పందాలకు లోబడి వ్యవహరిస్తుందనే నమ్మకం మాకుంది..’’ అని పేర్కొన్నాయి.
విశాఖపట్నం సమీపంలో నిర్మించిన ఈ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 1,040 మెగావాట్లు. ఇక్కడ మొదటి యూనిట్‌లో ఫిబ్రవరి నెలాఖరున విద్యుత్ ఉత్పాదన ప్రారంభమవుతుందని చర్చల సందర్భంగా కంపెనీ ప్రతినిధులు వెల్లడించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
520 మెగావాట్ల మొదటి యూనిట్‌లో ఉత్పాదన ప్రారంభమైతే... తెలంగాణకు వాటా ప్రకారం 280 మెగావాట్లు అందాలి. ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల పాటు ఆ కంపెనీ విద్యుత్ సరఫరా చేయాలి. ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైనందున కాల పరిమితిని తగ్గించే అంశంపై చర్చలు జరిగాయని, పీపీఏలకు కట్టుబడి ఉండాలనే వాదనతో చర్చలు ముగిశాయని తెలిసింది.