Fact Check:చట్ట ప్రకారమే చెల్లింపులు  | Payments to Hinduja organization as per law | Sakshi
Sakshi News home page

Fact Check:చట్ట ప్రకారమే చెల్లింపులు 

Published Sat, May 27 2023 5:10 AM | Last Updated on Sat, May 27 2023 11:10 AM

Payments to Hinduja organization as per law - Sakshi

సాక్షి, అమరావతి : ఒకసారి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరిగిన తరువాత ఒప్పంద కాలానికి కొనుగోలు చేసినా, చేయకపోయినా, ఆ విద్యుత్‌ కేంద్రం ఉత్పత్తి చేసినా, చేయకపోయినా స్థిర ఛార్జీలు అనేవి భరించాల్సిందే. వీటిలో ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలు, అప్పు మీద వడ్డీ, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు, యంత్రాల అరుగుదల, తరుగుదల వంటివి ఉంటాయి. ఈ విషయం విద్యుత్‌ రంగంపై కనీస అవగాహన ఉన్న వారెవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది.

కానీ, తమవి అత్యున్నత విలువలని గొప్పలు చెప్పుకునే ఈనాడు దినపత్రికకు మాత్రం ఈ విషయం తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన ధ్యేయంగా తప్పుడు కథనాలను నిత్యం వండి వారుస్తోంది. దానిలో భాగంగానే ‘హిందుజాకు దోచిపెట్టింది రూ.1,234 కోట్లు’ అంటూ అబద్ధాలు అచ్చేసింది.

అందులో అసలు నిజాలను ఇంధన శాఖ జాయింట్‌ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె పద్మజనార్థనరెడ్డిలతో కలిసి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ శుక్రవారం విద్యుత్‌ సౌథలో మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈనాడు అబద్ధాల వెనుక నిజానిజాలిలా ఉన్నాయి.. 

ఒప్పందాలు ఇప్పటివి కాదు.. 
హిందూజ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కొందరు దు్రష్పచారం చేస్తున్నారు. ఈ హిందుజా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) మొదటిసారి 1994లోనే అప్పటి ఎలక్ట్రిసిటీ బోర్డుతో జరిగింది. తరువాత దానిని సవరించి 1998లో 1,040 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ కడతామని ఒప్పందం చేసుకున్నారు. 2001 నాటికి ఆ పీపీఏ గడువు ముగిసింది.

తర్వాత వారు మళ్లీ ప్రభుత్వాన్ని సంప్రదించి, మర్చంట్‌ పవర్‌ ప్లాంట్‌కైనా వెళ్తామని అమమతి కోరారు. 2010లో మెగావాట్‌కు రూ.5.33 కోట్లు చొప్పున రూ.5,545 కోట్లతో ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారించారు. వివిధ కారణాలతో విద్యుత్‌ కేంద్రం నెలకొల్పడంలో జాప్యం జరిగింది. హిందూజా రాకపోయినా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుంది కాబట్టి 2011లో 1,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి, యూనిట్‌ రూ.3.60 చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకుంది.

2013లో హిందూజాతో ఒక మెమొరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ను ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ, 2014లో పీపీఏ ప్రకారం హిందూజా సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయింది. దీంతో 2016 జనవరిలో మొదటి యూనిట్, జూలైలో రెండవ యూనిట్‌లో ఈ విద్యుత్‌ కేంద్రం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. 2016 ఆగస్టులో ఏపీఈఆర్‌సీ హిందూజా టారిఫ్‌ను యూనిట్‌ రూ.3.82గా నిర్ణయించి, ఏటా 2,828 మిలియన్‌  యూనిట్లు తీసుకోవాలని డిస్కంలకు చెప్పింది. రూ.5,623 కోట్లు ఫిక్స్‌డ్‌ చార్జీలుగా నిర్ధారించింది. 

టీడీపీ అనాలోచిత నిర్ణయం ఫలితమే.. 
ఈ నేపథ్యంలో.. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం నుంచి వైదొలగాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నిర్ధేశించింది. దానికి అనుగుణంగా ఈ ఒప్పందం వద్దని డిస్కంలు చేసిన అభ్యర్ధనకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఈ ఒప్పందంపై న్యాయ పోరాటం, చిక్కులు ప్రారంభమయ్యాయి. అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటీ (ఆప్‌టెల్‌)ను హిందూజా ఆశ్రయించింది. ట్రిబ్యునల్‌ టీడీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆ తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

అంతిమంగా ఫిబ్రవరి 2022లో సుప్రీంకోర్టు ‘ఈ ఒప్పందం రద్దు కుదరదు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి అమలులో వున్నట్లే’ అని తీర్పునిచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హిందూజాకు స్థిర చార్జీలు చెల్లించక తప్పని పరిస్థితి. నిజానికి.. ఇన్ని రోజులు హిందుజా విద్యుత్‌ కేంద్రం అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి విద్యుత్‌ తీసుకోలేకపోవటానికి కారణం గత ప్రభుత్వం 2018లో తీసుకున్న లోప­భూయిష్ట నిర్ణయమే.

టీడీపీ ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకోకపోయి ఉంటే, హిందూజా నుంచి విద్యుత్‌ తీసుకుని ఆ మేరకు చెల్లింపులు చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు విద్యుత్‌ తీసుకోకుండానే చార్జీలు చెల్లించాల్సి రావడం గత ప్రభుత్వ పాప ఫలితమే. అంతేగాని.. ఉత్తుత్తి విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు కట్టిందన్న మాటలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అదీగాక.. 2022 మార్చి తర్వాత హిందూజా సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1,040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. రాష్ట్రానికి అదనంగా 15 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ సరఫరా అవుతోంది.  

చట్టప్రకారమే అనుమతి.. 
అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌ వారి ఉత్తర్వుల్లో హిందూజా టారిఫ్‌ను స్థిర, చర ఛార్జీలుగా విభజించమని ఆదేశాలిచ్చింది. వాటి ప్రకారం కమిషన్‌ అప్పటి తాత్కాలిక (ఆడ్‌హాక్‌) చార్జీ అయిన యూనిట్‌ రూ.3.82ను స్థిరచార్జీ రూ.1.06గాను.. చరచార్జీ రూ.2.76గాను విభజించింది. దీని ముఖ్యోద్దేశ్యం.. మెరిట్‌ ఆర్డర్‌ సూత్రాలను ఈ విద్యుత్‌ కేంద్రానికి అమలుపరచడమే. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆగస్టు 2022లో ఇచ్చిన తుది ఉత్తర్వుల్లో అప్పటికున్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఇంతకుముందు నిర్ణయించిన తాత్కాలిక (అడ్‌హక్‌) చార్జీయే 2016 నుంచి 2022 ఆగస్టు వరకు వర్తిస్తుందని చెప్పింది.

టారిఫ్‌ అప్పటికే రెండు భాగాలుగా విభజించినందున ఇందులో స్థిరఛార్జీ చెల్లింపు అన్నది భాగమే కాబట్టి కమిషన్‌ నిర్ణయం మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరంలేదు. హిందుజాకు స్థిరఛార్జీల బకాయిలు వాళ్ల ఉత్పత్తి అందుబాటు ప్రకటనలను బట్టి చెల్లించాలని అడ్వొకేట్‌ జనరల్, ఆంధ్రప్రదేశ్‌ న్యాయ శాఖా కార్యదర్శి, న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌గుప్తా విద్యుత్‌ పంపిణీ సంస్థలకిచ్చిన న్యాయ సలహాలో ధ్రువీకరించారు.

సుప్రీంకోర్టు, అప్పీలేట్‌ ట్రిబ్యునల్, ఏపీఈఆర్‌సీ ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులు, ఎలక్ట్రిసిటీ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ప్రభుత్వం డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆలస్య చెల్లింపు సర్‌చార్జీ (ఎల్‌పీఎస్‌ ) స్కీం నిబంధనలకు లోబడి, హిందుజాకు రూ.1,234 కోట్లు స్థిర చార్జీలను చెల్లించడానికి అనుమతినిచ్చింది.  

‘ఈనాడు’ అవగాహనా రాహిత్యం.. 
హిందుజాపై సుప్రీంకోర్టు, అప్పీలేట్‌ ట్రిబ్యునల్, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఇచ్చిన తుది తీర్పుల ప్రకారం హిందూజా విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం అమలు  చేయాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వంపైన, డిస్కంలపైన ఉంది. నిజానికి.. హిందూజా దాదాపు రూ.2,401 కోట్లకు అర్జీ పెట్టినప్పటికీ సాంకేతిక, న్యాయపరమైన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కోల్‌ ఎంత ఉంది, ఆ రోజు నార్మేటివ్‌ అవైలబిలిటీ ఎంత అనేది ప్రతి యూనిట్‌ ప్రకారం అన్ని స్థాయిల్లోనూ రోజువారీగా క్షుణ్ణంగా పరిశీలించి చివరికి వారికి మొత్తం రూ.1,234 కోట్లు చెల్లించాలని లెక్కించాం.

ఈ చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో జరిగాయి. కాబట్టి, ఈ వివరాలు కమిషన్‌కు ఆర్థిక సంవత్సరం 2022–23 నాల్గవ త్రైమాసికానికి డిస్కంలు సమర్పించే ఇంధన, విద్యుత్‌ కొనుగోలు వ్యయ సర్దుబాటు నివేదికలో నిబంధనల ప్రకారం పొందుపరుస్తాయి. వాస్తవాలిలా ఉంటే.. ఈ నిజాలను గాలికొదిలేసి, విద్యుత్‌ తీసుకోని కాలానికి స్థిరఛార్జీలు హడావిడిగా చెల్లించేశారని, కనీసం కమిషన్‌ అనుమతి తీసుకోలేదని ఈనాడు రాయడం పూర్తిగా అవగాహనా రాహిత్యం. విషయంపట్ల  తగినంత పరిజ్ఞానం, ఏపీఈఆర్‌సీ ఇచ్చిన వివిధ నిబంధనలు, నియమావళి గురించి అవగాహన లేకుండా అబద్ధాలు అచ్చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement