మూడు రోజుల్లో వెలుగులు
- యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
- ఈపీడీసీఎల్‌కు రూ.750 కోట్ల నష్టం
- సీఎండీ శేషగిరిబాబు
యలమంచిలి: మూడు రోజుల్లో జిల్లా అంతటా విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.శేషగిరిబాబు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా అందించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. శనివారం రాత్రి యలమంచిలిలో విద్యుత్ పునరుద్ధరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విశాఖ జిల్లా మొత్తం విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైందన్నారు.
చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు నేలమట్టం కావడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ఎంత వేగవంతం చేసినా ఫలితం కన్పించడం లేదన్నారు. కొన్నిచోట్ల విద్యుత్ లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తాత్కాలికంగా వేరొక లైన్ ద్వారా సరఫరా ఇచ్చి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని చెప్పారు. జిల్లాలో పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు ఏడు వేల మంది సిబ్బంది, రెండు వేల మంది అధికారులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు తెలిపారు.
హుదూద్ తుపాను బీభతానికి ఉత్తరాంధ్రలో ఏపీఈపీడీసీఎల్ కు సుమారు రూ.750 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 7.64 లక్షల విద్యుత్ కనెక్షన్లకు 7 లక్షల కనెక్షన్లకు విద్యుత్ పునరుద్ధరించామని తెలిపారు. విశాఖపట్నంలో 11.32 లక్షల కనెక్షన్లలో ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా కనెక్షన్లకు విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలో మూడు జోన్లలో రెండు జోన్లకు పూర్తిగాను, మూడవ జోన్‌లో 75 శాతం కనెక్షన్లకు సరఫరా ఇచ్చామన్నారు.